నటుడు మనోబాల కన్నుమూత
ABN , First Publish Date - 2023-05-04T02:53:53+05:30 IST
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత మనోబాల (69) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు..

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత మనోబాల (69) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత పది రోజులుగా చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. దీంతో కోలీవుడ్ శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, టి.రాజేందర్, దిగ్గజ దర్శకుడు భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజాలతో పాటు విశాల్, కార్తీ తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నై సాలిగ్రామంలోని ధనలక్ష్మి కాలనీలో ఉన్న స్వగృహంలో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నేడు (గురువారం) జరుగనున్నాయి. ఆయనకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న మనోబాల.. నటుడిగా 1979లో ‘పుదియ వలర్పుగళ్’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన ఆయన 1982లో ‘ఆగాయ గంగై’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడుగా రాణించారు. దాదాపు 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో రజనీకాంత్, విజయకాంత్, ప్రభు, కార్తీ, సత్యరాజ్ వంటి అగ్రహీరోలను డైరెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అలాగే, సుమారుగా 345కిపైగా చిత్రాల్లో నటించారు. మూడు చిత్రాలను నిర్మించారు. 16కి పైగా టీవీ సీరియళ్ళలో నటించారు. ఆయన వెండితెరపై కనిపించిన చివరి చిత్రం ‘ఘోష్టి’. పస్తుతం ఆయన నటించిన మూడు నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి, చెన్నై