సరిగ్గా 35 ఏళ్ల క్రితం..
ABN , First Publish Date - 2023-04-30T01:05:54+05:30 IST
విజయం వెంటే అపజయం పొంచి ఉండే చిత్ర ప్రపంచంలో పోటీని తట్టుకుంటూ ఒక హీరో 35 ఏళ్ల పాటు కొనసాగడం అంటే..

విజయం వెంటే అపజయం పొంచి ఉండే చిత్ర ప్రపంచంలో పోటీని తట్టుకుంటూ ఒక హీరో 35 ఏళ్ల పాటు కొనసాగడం అంటే అదంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ విషయంలో ఆమిర్‌ఖాన్ చాలా అదృష్టవంతుడని అంటున్నారంతా. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సరిగ్గా 35 ఏళ్ల క్రితం (1988 ఏప్రిల్ 29) విడుదలైంది. యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న సమయం అది. ప్రేమకథలతో సినిమాలు తీయడానికి అందరూ వెనుకాడుతున్న ఆ తరుణంలో తయారైన ఈ రొమాంటిక్ ఫిల్మ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. వద్దు అని వారించారు కూడా. అయినా నిర్మాత నాజీర్ హుస్సేన్ వెనక్కి తగ్గలేదు. సినిమా తీసి, హిట్టు కొట్టి చూపించారు. ‘చాక్లెట్ బోయ్’ అని ఆ చిత్రంతో అందరి చేత పిలిపించుకున్న ఆమిర్ ఈ 35 ఏళ్ల నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఫర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్నారు. ‘లగాన్’, ‘దంగల్’ వంటి విజయవంతమైన సినిమాలే కాదు ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వంటి డిజాస్టర్స్ కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం వ్యక్తుల జాతకాలు మారిపోయే చిత్ర పరిశ్రమంలో అపజయాలకు వెరవకుండా నవ్యత కోసం కృషి చేసే ఆమిర్ ఖాన్ వంటి హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు.