ఎడ్యుకేషన్‌ మాఫియాను ఎండగట్టే ‘యూనివర్సిటీ’

ABN , First Publish Date - 2023-02-07T03:15:04+05:30 IST

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. నిర్మాతగా ఇది ఆయనకు 30వ సినిమా. విజయనగరం, పర్లాకిమిడి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రనిర్మాణం పూర్తయింది...

ఎడ్యుకేషన్‌ మాఫియాను ఎండగట్టే ‘యూనివర్సిటీ’

ప్రజానటుడు ఆర్‌.నారాయణమూర్తి తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. నిర్మాతగా ఇది ఆయనకు 30వ సినిమా. విజయనగరం, పర్లాకిమిడి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రనిర్మాణం పూర్తయింది. ప్రస్త్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించడమే కాకుండా కీలకమైన ప్రొఫెసర్‌ పాత్రను ఆయన పోషించారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సినిమానే ప్రాణం నారాయణమూర్తికి. మనకు కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు కానీ ప్రజా దర్శకుడు ఆయన ఒక్కరే! చలనచిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే, ఆ సముద్రం చూసే ఏకైక వ్యక్తి నారాయణమూర్తి. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన. విద్యా వ్యవస్థ బ్యాక్‌డ్రా్‌పలో ఆయన ‘యూనివర్సిటీ’ చిత్రం తీశారు. అప్పట్లో ఉన్న చదువు ఇప్పుడు లేదు. గురువులకు ఆ నాడు ఉన్న గౌరవం ఈనాడు లేదు. చదువుకునే రోజులు పోయి చదువు కొనే రోజులు వచ్చాయి. ఈ పరిస్థితులను చూసి ఆవేదన చెంది, ఎడ్యుకేషన్‌ మాఫియాను ఎండగడుతూ ‘యూనివర్సిటీ’ చిత్రాన్ని తీశారు నారాయణమూర్తి. ఈ సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘మనదేశంలో విద్య, వైద్యం.. సేవా రంగాలని రాజ్యాంగం చెబుతోంది. దానికి అనుగుణంగా ఈ రెండు రంగాలు ప్రైవేట్‌ పరం కానివ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విద్యార్ధులు జాతి సంపద. వారిని కుల మత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ప్రైవేట్‌ పరం అవుతున్న పరిస్థితుల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలతో ఈ సినిమా తీశాను. వైజాగ్‌ సత్యానంద్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కళాకారులు ఈ సినిమాలో నటించారు’ అని చెప్పారు.

Updated Date - 2023-02-07T03:15:06+05:30 IST