తారకరత్నకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2023-02-21T02:00:38+05:30 IST

నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానుల సందర్శనార్థం...

తారకరత్నకు కన్నీటి వీడ్కోలు

నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం 9.45 గంటలకు మోకిలలోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తారకరత్న పార్థీవదేహాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తారకరత్నను కడసారి చూసేందుకు ఆయన బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, నందమూరి సుహాసిని, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి సహా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హీరోలు వెంకటేశ్‌, తరుణ్‌, సాయి కుమార్‌, నిర్మాత సురేశ్‌బాబు, న టులు బెనర్జీ, శివబాలాజీ, అన్నపూర్ణ, అశోక్‌మెహతా, మాదాల రవి, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని, అజయ్‌, అన్నపూర్ణ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. కాగా, తారకరత్న పార్థీవదే హాన్ని చూసిన తండ్రి మోహన్‌కృష్ణ, తల్లి సీత కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి మహాప్రస్థానం వరకు సాగిన అంతిమయాత్రలో అంబులెన్స్‌లో తారకరత్న పార్థీవదేహం వెంట చంద్రబాబునాయుడు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యేవరకు చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, నారా లోకేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, మోక్షజ్ఞ తదితర కుటుంబ సభ్యులున్నారు. తారకరత్న పార్థీవదేహానికి శాస్రోక్తంగా కార్యాక్రమాలు పూర్తిచేసిన తండ్రి మోహన్‌కృష్ణ చితికి నిప్పంటించారు.

Updated Date - 2023-02-21T02:00:38+05:30 IST