A new combination is formed : కొత్త కలయిక కుదిరింది

ABN , First Publish Date - 2023-08-30T05:12:25+05:30 IST

బాలీవుడ్‌లో ఇద్దరు ముగ్గురు అగ్రహీరోల కాంబినేషన్‌లో సినిమాలు రావడం పాత కాలం నుంచే ఉంది. అమితాబ్‌ ధర్మేంద్ర కాంబినేషన్‌లో వచ్చిన ‘షోలే’ విజయం చరిత్రలో నిలిచిపోయింది...

A new combination is formed : కొత్త కలయిక  కుదిరింది

బాలీవుడ్‌లో ఇద్దరు ముగ్గురు అగ్రహీరోల కాంబినేషన్‌లో సినిమాలు రావడం పాత కాలం నుంచే ఉంది. అమితాబ్‌ ధర్మేంద్ర కాంబినేషన్‌లో వచ్చిన ‘షోలే’ విజయం చరిత్రలో నిలిచిపోయింది. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ లాంటి స్టార్లతో పాటు యువ హీరోలు కూడా మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. కానీ దక్షిణాదిన మాత్రం మొదట్నుంచి ఈ తరహా చిత్రాలు తక్కువే. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. దక్షిణాది భాషలకు చెందిన పలువురు అగ్రహీరోలు కలసి నటించేందుకు ముందుకొస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో ఓ కొత్త ఒరవడికి నాంది పలికారు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ఇద్దరూ కలసి నటించి అభిమానులను అలరించడంతో పాటు సంచలన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించారు. ఇండస్ట్రీ , అభిమానులు ఊహించని కాంబినేషన్‌తో తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని అందంచారు దర్శకుడు రాజమౌళి. ఈ ఉత్సాహంతోనే ఎన్టీఆర్‌ మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సారి బాలీవుడ్‌ అగ్రహీరో హృతిక్‌రోషన్‌తో ఆయన వెండితెరపైన సందడి చేయనున్నారు. 2024లో ఇదే అతిపెద్ద మల్టీస్టారర్‌గా నిలవబోతోంది. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. దీపావళికి ‘వార్‌ 2’ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

32ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు

చాలా ఏళ్ల తర్వాత తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ‘జైలర్‌’ రూపంలో భారీ విజయం దక్కింది. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం తొలివారంలోనే రూ. 500 కోట్ల వసూళ్లను సాధించి, తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌, మలయాళ అగ్రహీరో మోహన్‌లాల్‌ అతిథిపాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. వీరు కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇప్పుడు రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘హమ్‌’ చిత్రంలో నటించిన 32 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తలైవర్‌ 170’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. రజనీకాంత్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. అమితాబ్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ అవనుంది. ఇందులో మరో ప్రధాన పాత్ర కోసం పలువురు టాలీవుడ్‌ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. శర్వానంద్‌ నటిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ప్రతి నాయకుడిగా టాలీవుడ్‌కు

తమిళ అగ్రనటుడు కమల్‌హాసన్‌ కూడా ‘విక్రమ్‌’ విజయం తర్వాత దూకుడు పెంచారు. యువ హీరోలతో జట్టుకడుతూ విజయాలు అందుకుంటున్నారు. అత్యధిక వ్యయంతో తెరకెక్కుతోన్న టాలీవుడ్‌ చిత్రం ‘కల్కి’లో ఆయన కనిపించనున్నారు. ఆయన ప్రభా్‌సను ఢీకొట్టే ప్రతినాయకుడి పాత్రలో విలనిజం పండించనున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

మూడు భాషల హీరోలతో

వరుస సినిమాలు చేస్తూ జోరు చూపుతున్నారు ధనుష్‌. అరుణ్‌ మఽథేశ్వరన్‌ దర్శకత్వంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పీరియాడిక్‌ చిత్రంలో ఆయన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ ఇందులో ధను్‌షతో కలసి కనిపించబోతున్నారు. అలాగే టాలీవుడ్‌ హీరో సందీ్‌పకిషన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కుదిరితే అదిరే కాంబినేషన్లే

ఇవి కాకుండా మరికొన్ని క్రేజీ కాంబినేషన్ల గురించి పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు అగ్రహీరోలు నటిస్తున్న కొన్ని చిత్రాల్లో యువ హీరోలు, సీనియర్‌ హీరోలు కీలకపాత్రలు పోషిస్తున్నారంటూ చెబుతున్నారు. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్‌’. ఇందులో కన్నడ హీరో యశ్‌ కొన్ని క్షణాలు మెరవబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘కేజీఎఫ్‌’ చిత్రాలతో యష్‌ పేరు పాన్‌ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది. ఇప్పుడు సలార్‌కు కూడా ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు కావడం కూడా దీనికి ఓ కారణం. వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘మహానటి’, ‘సీతారామం’ ద్వారా ఘన విజయాలను అందుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఇప్పుడు ప్రభాస్‌ కథానాయకుడిగా ఆ సంస్థ నిర్మిస్తోన్న ‘కల్కి’ చిత్రంలోనూ దుల్కర్‌ ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్‌. ఇదే విషయం ఆయన్ను మీడియా అడిగితే ‘కాదు అని అవును’ అని చెప్పకుండా దాటేశారు. దీంతో దుల్కర్‌ ‘కల్కి’లో కనిపించడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. అలాగే రజనీకాంత్‌ హీరోగా ‘జైలర్‌’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించబోతున్నారనీ అందులో తమిళ హీరో విజయ్‌ కీలకపాత్ర పోషించబోతున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు నెల్సన్‌ దిలీ్‌పకుమార్‌కు విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన ఈ పాత్ర చేసేందుకు అంగీకరించారని అంటున్నారు. చిర ంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రీమేక్‌ అవుతోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. టాలీవుడ్‌లో ఓ అగ్రహీరో నటిస్తున్న చిత్రంలో శివరాజ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో నాగార్జున ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Updated Date - 2023-08-30T05:12:25+05:30 IST