కేన్సర్‌పై చిరు క్లారిటీ
ABN , First Publish Date - 2023-06-04T02:29:07+05:30 IST
శనివారం ఓ కేన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాటలు అభిమానుల్ని కన్‌ఫ్యూజ్ చేశాయి. తాను ముందస్తుగా కేన్సర్ పరీక్షలు చేయించుకొన్నానని, అందుకే కేన్సర్ నుంచి తప్పించుకొన్నానని చిరు చేసిన వ్యాఖ్యల్ని...

శనివారం ఓ కేన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాటలు అభిమానుల్ని కన్‌ఫ్యూజ్ చేశాయి. తాను ముందస్తుగా కేన్సర్ పరీక్షలు చేయించుకొన్నానని, అందుకే కేన్సర్ నుంచి తప్పించుకొన్నానని చిరు చేసిన వ్యాఖ్యల్ని కొన్ని వెబ్ సైట్లు, చానళ్లూ మరోలా అర్థం చేసుకొన్నాయి. చిరంజీవి కేన్సర్ బారిన పడ్డారని, చికిత్స తీసుకోవడం వల్ల ఆ వ్యాధి నుంచి తప్పించుకొన్నారని కథనాలు రాశాయి. దాంతో చిరు క్లారిటీ ఇచ్చారు. ‘కొలనోస్కోపి కేసులు బాగా వస్తున్నాయి. అది నాల్గో స్టేజీ వచ్చే వరకు గుర్తించలేమనే అవగాహన నాకు ఉంది. ఎందుకైనా మంచిదని ముందే పరీక్ష చేయుంచుకోవాలని అనిపించింది. ఏఐజీ ఆస్పత్రి డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని కలిసి కోలనోస్కోపీ పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షలో బినైన్ పాలిప్స్ ఉందని తేలింది. వాటి వల్ల ఒకటి, రెండేళ్ల తర్వాత ముప్పు ఉంటుందని, తొలగించుకోవడం మంచిదని డాక్టర్ సూచించారు. అప్పటికప్పుడు చికిత్స చేసి వాటిని తొలగించారు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ‘‘కొన్ని మీడియా సంస్థలు నేను చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను కేన్సర్ బారిన పడ్డాను, చికిత్స వల్ల కోలుకొన్నాను’ అని వార్తలు రాశాయి. అందరూ ముందు జాగ్రత్తలు తీసుకొని రెగ్యులర్ చెకప్‌లు చేయించుకొంటే కేన్సర్ రాకుండా నివారించొచ్చు అని చెప్పాను. ఇది అర్థం చేసుకోకుండా అవాకులూ, చెవాకులూ రాయకండి. దీని వల్ల అనేకమందిని భయభ్రాంతులకు గురిచేసి బాధ పెట్టినవాళ్లవుతారు’’ అంటూ ట్వీట్ చేశారు.