స్ర్తీలపై గౌరవాన్ని పెంచే సినిమా
ABN , First Publish Date - 2023-08-16T03:06:47+05:30 IST
‘‘వైవిధ్యభరితమైన సినిమాల్ని అందించడమే మా మైక్ మూవీస్ సంస్థ లక్ష్యం. అందులో కొంత రిస్క్ ఉంది. అయినా ఇష్టంగా స్వీకరిస్తామ’’న్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అప్పన్నరెడ్డి, రవీందర్ రెడ్డి. వీళ్లు నిర్మాతలుగా...

‘‘వైవిధ్యభరితమైన సినిమాల్ని అందించడమే మా మైక్ మూవీస్ సంస్థ లక్ష్యం. అందులో కొంత రిస్క్ ఉంది. అయినా ఇష్టంగా స్వీకరిస్తామ’’న్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అప్పన్నరెడ్డి, రవీందర్ రెడ్డి. వీళ్లు నిర్మాతలుగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన చిత్రమిది. ఈనెల 18న విడుదల అవుతున్న సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఓ మగాడు గర్భం దాలిస్తే ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందించిన సినిమా ఇది. కత్తి మీద సాములాంటి సబ్జెక్ట్. డీల్ చేయడం అంత సులభం కాదు. కానీ కథపై నమ్మకంతో ఈ సినిమా పట్టాలెక్కించాం. దర్శకుడు అనుకొన్నది అనుకొన్నట్టు తెరకెక్కించాడు. బడ్జెట్ కాస్త పరిధి దాటింది. అయితే నాణ్యమైన సినిమా అందించామన్న సంతృప్తి దక్కింది. సినిమా పూర్తయిన తరవాత కొంతమంది సన్నిహితులకు చూపించాం. ‘మా అమ్మ.. భార్య గుర్తొచ్చారు’ అని చెప్పారు. ఓ ప్రాణం పోయడం మామూలు విషయం కాదు. అదో పునర్జన్మ లాంటిది. అదే ఈ సినిమాలో చూపించాం. గర్భిణీలపై గౌరవాన్ని పెంచే సినిమా ఇది. సోహైల్ చాలా బాగా చేశాడు. ముందు వేరే హీరోతో అనుకొన్నాం. కానీ ‘బిగ్ బాస్’ చూశాక ఈ కథకు సోహైల్ అయితే న్యాయం చేస్తాడనిపించింది. తనకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంద’’న్నారు. ‘‘మా సంస్థలో ఇక మీదట కూడా కథాబలం ఉన్న చిత్రాలే నిర్మిస్తాం. ఓ ఐదు చిత్రాలు పైప్ లైన్‌లో ఉన్నాయ’’ని అప్పన్న రెడ్డి, రవీందర్ రెడ్డి తెలిపారు.