డబ్బింగ్‌ డిజాస్టర్‌

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:24 AM

ఒకప్పుడు స్ట్రెయిట్‌ చిత్రాలకు మించి తెలుగునాట డబ్బింగ్‌ చిత్రాల హవా ఉండేది. ఇప్పుడు, ముఖ్యంగా ఈ ఏడాది మాత్రం ఆ జోరుకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన పలు డబ్బింగ్‌ చిత్రాలు...

డబ్బింగ్‌ డిజాస్టర్‌

ఒకప్పుడు స్ట్రెయిట్‌ చిత్రాలకు మించి తెలుగునాట డబ్బింగ్‌ చిత్రాల హవా ఉండేది. ఇప్పుడు, ముఖ్యంగా ఈ ఏడాది మాత్రం ఆ జోరుకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన పలు డబ్బింగ్‌ చిత్రాలు బోల్తాపడడమే దీనికి కారణం. అయితే మంచి కథ, కథనాలతో వచ్చిన కొన్ని అనువాద చిత్రాలు ఆదరణ పొందగా, మిగిలినవన్నీ డిజాస్టర్‌లుగా మిగిలాయి.

భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా విడుదలైన కన్నడ చిత్రం ‘కబ్జ’. తొలి షో తోనే డిజాస్టర్‌ అనిపించుకొంది. రూ. 120 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తొలి వారంతానికి రూ. 30 కోట్ల మేర వసూలు చేసి, భారీ పరాజయాన్ని మూటగట్టుకొంది. ఈ చిత్రం మార్చిలో ప్రేక్ష కుల ముందుకొచ్చింది. కన్నడంతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నాలుగు వేలకు పైగా స్ర్కీన్లలో విడుదల చేశారు. బ్రిటిషర్ల కాలం నాటి కథ, భారీ తారాగణం, ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో ‘కబ్జ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కన్నడ అగ్ర హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌, శివ్‌రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ‘కేజీఎ్‌ఫ’కు నకలు అనే ముద్ర వేసి తెలుగు ప్రేక్షకులు ఘోరంగా తిప్పికొట్టారు. ఆర్‌ చంద్రు దర్శకత్వం వహించాడు. ‘కేజీఎఫ్‌’ సిరీ్‌సకు సంగీతం అందించిన రవి బస్రూర్‌ ‘కబ్జ’కు పనిచేశారు. ఎంత మంది ఉద్ధండులు పనిచేసినా, కథ, కథనాల్లో బలహీనతలు సినిమాను దెబ్బకొట్టాయి.

  • కన్నడ హీరో శివరాజ్‌ కుమార్‌ నటిస్తూ, నిర్మించిన పీరియాడిక్‌ చిత్రం ‘వేద’. ఈ సినిమా కూడా ప్రచార కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పీరియాడిక్‌ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ నాట మోస్తరు విజయాన్ని అందుకుంది. తెలుగులో మాత్రం ఈ సినిమా ప్రచార ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది.

నిరాశపరిచిన మణిరత్నం

గతేడాది విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తొలి భాగం తెలుగునాట మంచి వసూళ్లనే రాబట్టింది. రెండో భాగం కూడా అదే స్థాయిలో ఆడుతుందని అనుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ విడుదలైంది. తమిళనాట మాత్రం వారంతానికే వంద కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు నాట పూర్తి రన్‌లో అతి కష్టం మీద పదిహేను కోట్లను దాటింది. విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్‌ లాంటి భారీ తారాగణం ఉన్నా కూడా ఈ డబ్బింగ్‌ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

మెప్పించని మాలికాపురం

‘దృశ్యం’ లాంటి కంటెంట్‌ ఆధారిత లో బడ్జెట్‌ చిత్రాలతో పరభాషల్లోనూ సక్సెస్‌ కొట్టడంలో మలయాళ చిత్రసీమ ముందుంది. అక్కడి సినిమాలకు తెలుగు నాట కూడా గతంలో మంచి ఆదరణే దక్కింది. ఈ ఏడాది చెప్పుకోదగ్గ సంఖ్యలో విడుదలైనా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. ‘భాగమతి’, ‘యశోద’ చిత్రాలతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్‌. ఆయన హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘మాలికాపురం’ను గీతాఆర్ట్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేసింది. అయ్యప్పస్వామి కథాంశంతో ‘మాలికాపురం’ తెరకెక్కింది. అప్పటికే ‘కాంతారా’తో బాక్సాఫీసును కొల్లగొట్టి ఉండడంతో ఈసినిమా పైనా మంచి హైప్‌ క్రియేట్‌ చేశారు. కథాంశం బాగున్నా కమర్షియల్‌ యాంగిల్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

షారూఖ్‌కు కలసిరాలేదు

వరుస పరాజయాలతో బ్రేక్‌ తీసుకున్న షారూఖ్‌ఖాన్‌ ఈ ఏడాది ‘పఠాన్‌’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం తెలుగులో తక్కువ థియేటర్లలో విడుదలైంది. పూర్తి రన్‌లో రూ. 8 కోట్ల మేర వసూళ్లను మాత్రమే దక్కించుకొంది. ప్రపంచవ్యాప్తంగా ‘పఠాన్‌’ ఫుల్‌రన్‌లో రూ. 1050 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆయన నటించిన ‘జవాన్‌’ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఒకట్రెండు హిట్లతో సరి

ఈ ఏడాది వచ్చిన డబ్బింగ్‌ చిత్రాల్లో విజయాల శాతం చాలా తక్కువ. మలయాళ డబ్బింగ్‌ చిత్రం ‘2018’కు తెలుగు నాట కూడా చక్కని ఆదరణ లభించింది. 2018లో కేరళను కుదిపేసిన వరదల నేపథ్యంలో సాగే చిత్రమిది. మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 200 కోట్ల వసూళ్లను సాధించింది. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఎలాంటి ప్రచారం లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం వసూళ్లు క్రమేపీ పంజుకున్నాయి. రిలీజైన తొలి రోజే ఇక్కడ రూ. కోటికి పైగా వసూళ్లను దక్కించుకొంది. తెలుగునాట తొలి వారంతానికి రూ. 7 కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగులో నిర్మాత బన్నీవాసు విడుదల చేశారు. ఆయనకు మంచి లాభాలను తెచ్చిన చిత్రంగా నిలిచింది. ఇండియా తరపున ఆస్కార్‌ పురస్కారాలకు అధికారిక ఎంట్రీగా ‘2018’ చిత్రం ఎంపికైంది.

  • 2016లో ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌ ఆంటోని. అప్పట్లో ఈ సినిమా వసూళ్లు తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రాలను మించిపోయాయి. అయితే తర్వాత విజయ్‌ ఆంటోనీకి మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు. అందుకే ఆయన మళ్లీ ‘బిచ్చగాడు 2’తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ వసూళ్లు దుమ్మురేపాయి. తొలి రోజే రూ. 5 కోట్లకు చేరువగా వచ్చింది. రెండు వారాలు ముగిసేసరికి రూ. 10 కోట్ల బిజినెస్‌ చేసింది. బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇచ్చిన సక్సె్‌సతో త్వరలో ‘బిచ్చగాడు 3’ని తెరకెక్కించనున్నట్లు విజయ్‌ ఆంటోని ప్రకటించారు.

రజనీ రికార్డుల మోత

‘భాషా, ముత్తు, నరసింహ, చంద్రముఖి...’ ఇలా ఒకటేమిటి తెలుగునాట రికార్డు స్థాయి వసూళ్లతో రజనీకాంత్‌ ప్రభంజనాన్ని చాటిన డబ్బింగ్‌ చిత్రాలు ఎన్నో. అయితే కొన్నేళ్లుగా రజనీకాంత్‌కు సరైన హిట్‌ లేదు. ఆయన సినిమాలకు తెలుగులోనే కాదు తమిళంలోనూ సరైన వసూళ్లు రావడం లేదు. రజనీకాంత్‌ నుంచి ఓ సూపర్‌హిట్‌ సినిమా రావాలనే అభిమానుల కోరిక ఈ ఏడాది ‘జైలర్‌’ రూపంలో తీరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 650 కోట్లకు పై బడి వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 80 కోట్ల వసూళ్లను సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది.

లియో

తమిళంలో అగ్రహీరోగా భారీ వసూళ్లను రాబడుతున్న విజయ్‌ తెలుగు నాట మాత్రం అంతగా సక్సెస్‌ కాలేకపోయారు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో విడుదలవుతున్నా, ఇప్పటిదాకా సంచలన విజయాలు అందుకున్నవి లేవనే చెప్పాలి. ఒకట్రెండు సినిమాలు యావరేజీ టాక్‌ తెచ్చుకున్నాయి. అయితే ఆ లోటును ఈ ఏడాది ‘లియో’ చిత్రం తీర్చింది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించడంతో తెలుగునాట కూడా ‘లియో’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇద్దరు టాలీవుడ్‌ అగ్రహీరోలు నటించిన స్ట్రెయిట్‌ చిత్రాలతో పాటు విడుదలైనా లోకేశ్‌ క్రేజ్‌తో ఇక్కడా మంచి వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లోనే ‘లియో’ రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాగే పూర్తి రన్‌లో రూ. 60 కోట్ల మార్క్‌ను అందుకొంది.

  • విశాల్‌, ఎస్‌. జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో విశాల్‌ మరో సారి విఫలమయ్యాడు. ఈ సినిమా తెలుగునాట ఓ మాదిరి వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.

ద్విభాషా చిత్రాల జోరు

ఇటీవల కాలంలో హీరోలకు పరభాషల్లోనూ మార్కెట్‌ బాగా పెరిగింది. దాంతో కొన్ని సినిమాలను ఒకే సారి రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అగ్రహీరోలయితే తెలుగు-తమిళ భాషల్లో సినిమాలను తెరకిక్కించడం పరిపాటిగా మారింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన ‘సార్‌’ చిత్రం రెండు భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘మట్టి కుస్తీ’ కూడా రెండు భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రం రెండు చోట్లా మంచి వసూళ్లను సాధించింది. విజయ్‌ హీరోగా నటించిన ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా విడుదలై యావరేజీగా నిలిచింది. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘మైఖేల్‌’ డిజాస్టర్‌గా మిగిలింది.

Updated Date - Dec 22 , 2023 | 05:35 AM