A blow to the box office : బాక్సాఫీసుకి వడదెబ్బ

ABN , First Publish Date - 2023-06-13T04:17:48+05:30 IST

ఈ యేడాది సంఖ్యాపరంగా చూస్తే కొత్త సినిమాల హడావుడి జాస్తిగానే కనిపిస్తోంది. ప్రతీవారం కనీసం నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌, మేలలోనూ భారీ సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. వాటిలో విజయాలు సాధించిన చిత్రాలు కొన్నే. ఏప్రిల్‌లో ‘రావణాసుర’, ‘శాకుంతలం’, ‘మీటర్‌’, ‘ఏజెంట్‌’ ప్రేక్షకుల ముందుకు...

A blow to the box office : బాక్సాఫీసుకి వడదెబ్బ

వేసవిపై చిత్రసీమ ఎన్నో ఆశలు పెట్టుకొంటుంది. ఎందుకంటే... వేసవి చాలా మంచి సీజన్‌. స్కూళ్లూ, కాలేజీలకు సెలవులు వస్తాయి. కుర్రాళ్లంతా ఖాళీగా ఉంటారు. వాళ్లతో పాటుగా ఇంటిల్లిపాదినీ థియేటర్లుకు తీసుకొచ్చేందుకు ఇంతకంటే మంచి సీజన్‌ దొరకదు. ఫిబ్రవరి, మార్చి పరీక్షల సీజన్‌. అందుకే ఈ రెండు నెలల్లో సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. వాళ్లందరి దృష్టి ఏప్రిల్‌, మే వైపే ఉంటుంది. ప్రతీ యేడాదీ భారీ చిత్రాలు ఈ సీజన్‌లోనే విడుదల అవుతాయి. అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీసు దగ్గర క్యూ కడతాయి. అయితే ఈసారి ఆ హంగామా ఎక్కడా కనిపించలేదు. ఈ రెండు నెలల్లో పెద్ద హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. టూ, త్రీ టైర్‌ హీరోల చిత్రాలే పెద్ద దిక్కుగా మారాయి. అయితే అవి కూడా నిరుత్సాహ పరిచాయి. ఒకటీ అరా విజయాలు మినహాయిస్తే... ఈ వేసవి అందరినీ నిరాశకు గురి చేసింది.

ఈ యేడాది సంఖ్యాపరంగా చూస్తే కొత్త సినిమాల హడావుడి జాస్తిగానే కనిపిస్తోంది. ప్రతీవారం కనీసం నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌, మేలలోనూ భారీ సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. వాటిలో విజయాలు సాధించిన చిత్రాలు కొన్నే. ఏప్రిల్‌లో ‘రావణాసుర’, ‘శాకుంతలం’, ‘మీటర్‌’, ‘ఏజెంట్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటిపైనా భారీ అంచనాలున్నాయి. అయితే ఒక్కటి కూడా మెప్పించలేదు. ‘రావణాసుర’ రవితేజకు కొత్త జోనర్‌. పైగా ‘ధమాకా’ జోష్‌లో విడుదలైన సినిమా. కానీ ఫలితం రాబట్టలేకపోయింది. ఎన్నో వ్యయ ప్రయాసలతో గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’ డిజాస్టర్‌ లిస్టులో చేరిపోయింది. విజువల్‌ హంగులు తేలిపోవడం, కథా, కథనాలు ఆసక్తికరంగా లేకపోవడంతో సమంతకు పరాభవం తప్పలేదు. చిన్న సినిమాలతో ఎదిగిన కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’లో పోలీస్‌ అవతారం ఎత్తాడు. మాస్‌ని మెప్పించాలని చూశాడు. కానీ.. ఆశాభంగం ఎదురైంది. కిరణ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మైత్రీ మూవీస్‌కి తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ‘ఏజెంట్‌’ కథ కూడా ఇంతే. ఓ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌... ‘ఏజెంట్‌’ కోసం చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు కూడా అఖిల్‌ స్థాయికి మించి ఖర్చు పెట్టారు. కానీ ఇవేం ‘ఏజెంట్‌’ని గట్టెక్కించలేకపోయాయి. ఏప్రిల్‌లో విడుదలైన చిత్రాలలో ‘విరూపాక్ష’ ఒక్కటే సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో చేరింది. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం దాదాపుగా రూ.70 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మేలోనూ పరాభవాలు తప్పలేదు. గోపీచంద్‌ ‘రామబాణం’ గురి తప్పింది. హ్యాట్రిక్‌ కాంబో అంటూ చేసిన హడావుడి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. జగపతిబాబు, ఖుష్బూలాంటి స్టార్లు కూడా ఈ సినిమా జాతకాన్ని మార్చలేకపోయారు. ‘నాంది’ విజయంతో ఉత్సాహం తెచ్చుకొన్న నరేశ్‌.. తన ప్రయాణాన్ని మార్చాడు. కొత్త తరహా కథల్ని ఎంచుకొంటున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి నియోజవర్గం’ కూడా ఆ తరహా కథే. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లని రాబట్టలేకపోయింది కానీ, నరేశ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. అదే నమ్మకంతో చేసిన ‘ఉగ్రం’ అంచనాలకు దూరంగా నిలిచింది. ఇందులో నరేశ్‌ పోలీస్‌ పాత్ర పోషించాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టాడు. కానీ గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లే లేకపోవడంతో ఫలితం తేడా కొట్టింది. నాగచైతన్య - వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన ‘కస్టడీ’ మరో డిజాస్టర్‌. ‘మానాడు’లాంటి స్ర్కీన్‌ ప్లే ప్రధానమైన చిత్రాన్ని తీసిన వెంకట్‌ ప్రభు నుంచి.. ఇంత పేలవమైన కథతో సినిమాని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ సినిమాతో బయ్యర్లు కూడా భారీగా నష్టపోయారు. ఇదే నెలలో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ నందిని రెడ్డి మార్క్‌కి దూరంగా నిలిచిపోయింది. తెర నిండా భారీ తారాగణం కనిపించినా, స్వప్న సినిమాస్‌ సంస్థ నిర్మాణ విలువలు పాటించినా, కథలో బలం లేకపోవడంతో ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది. ఈ సినిమాతో.. సంతోష్‌ శోభన్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌ పడిపోయింది.

జూన్‌లో కూడా ఈ ఫ్లాపుల పరంపర కొనసాగింది. ‘అహింస’, ‘నేను స్టూడెంట్‌ సార్‌’, ‘అన్‌ స్టాపబుల్‌’, ‘టక్కర్‌’ ఇలా.. వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్తోంది. ‘ఆదిపురుష్‌’ ఈ సీజన్‌లో వస్తున్న చివరి సినిమా. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘ఆదిపురుష్‌’ హ్టిటయితే.. కనీసం రూ.1500 కోట్లు రావొచ్చన్నది ట్రేడ్‌ వర్గాల అంచనా. అదే జరిగితే.. ఈ వేసవి డల్‌గా సాగినా, క్లైమాక్స్‌లో విజయంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.

వేసవి సీజన్‌ని టాలీవుడ్‌ సరిగా ప్లాన్‌ చేసుకోలేదనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలేవీ ఈ సీజన్‌లో రాకపోవడం ట్రేడ్‌ వర్గాల్ని సైతం విస్మయపరిచింది. సాధారణంగా సంక్రాంతికి స్టార్‌ హీరోల చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొంతమంది మాత్రం వేసవిపై దృష్టి పెడతారు. కానీ ఈసారి అలా జరగలేదు. వీటిపై కొవిడ్‌ ప్రభావం కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం కోవిడ్‌ వల్ల సినిమాలు ఆగిపోయాయి. మామూలు పరిస్థితులు నెలకొన్న తరవాత చిత్రీకరణలు జోరందుకొన్నాయి. కానీ షెడ్యూళ్లు తారుమారు అయ్యాయి. అందుకే ఎవరి సినిమాలూ అనుకొన్న సమయానికి పూర్తి కాలేదు. దాంతో వేసవి కాస్తా నీరుగారిపోయింది. పైగా ఐపీఎల్‌ భయాలూ నిర్మాతలకు ఉంది. ప్రతీ యేటా వేసవిలోనూ ఐపీఎల్‌ కూడా మొదలవుతుంది. ఎంత లేదన్నా.. ఫస్ట్‌ షో, సెకండ్‌ షో సమయాల్లోనే మ్యాచులు జరుగుతాయి కాబట్టి, యువతరం టీవీలకు అతుక్కుపోతుంది. టికెట్లు తెగవు. అందుకే వేసవి సీజన్‌ అంటే నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సివస్తోంది. ఆ ఎఫెక్ట్‌తోనే పెద్ద చిత్రాలు విడుదలకు వెనకడుగు వేస్తున్నాయి.

Updated Date - 2023-06-13T04:24:49+05:30 IST