19 నెలలు మోశా!

ABN , First Publish Date - 2023-01-25T01:38:32+05:30 IST

‘‘నా సినీ ప్రయాణంలో నాకెదురైన ప్రతి పాటనీ ఓ తపస్సులానే భావించి రాశా. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కూడా అంతే. కీరవాణి గారి సంగీత సారధ్యంలో...

19 నెలలు మోశా!

‘‘నా సినీ ప్రయాణంలో నాకెదురైన ప్రతి పాటనీ ఓ తపస్సులానే భావించి రాశా. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కూడా అంతే. కీరవాణి గారి సంగీత సారధ్యంలో చాలా సినిమాలకు పనిచేశా. కానీ... ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కి ముందు కొంచెం గ్యాప్‌ వచ్చింది. మళ్లీ కీరవాణి గారి బాణీకి ఎప్పుడు పాట రాస్తానో అనుకొంటున్న దశలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం పిలుపు వచ్చింది. ఈసారి ఎలాగైనా సరే.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, మంచి పాట రాయాలన్న సంకల్పంతో ఈ పాటకు పనిచేశా. అప్పటికి ట్యూను లేదు. కీరవాణి గారికి అత్యంత ఇష్టమైన త్రిశ్ర గతిలో నాకు నేనే ఓ బాణీ అనుకొని పాట రాశాను. రెండు రోజులకే 3 పల్లవులు వచ్చేశాయి. వాటిలో ఒకటి ఎంచుకొన్నారు. మిగిలిన పాట పూర్తవడానికి 19 నెలలు పట్టింది. పందొమ్మిది నెలల పాటు ఈ పాటని ఓ తల్లిలా, తండ్రిలా మోస్తూనే ఉన్నా. రోజూ ఈ పాట గురించి నాకూ, కీరవాణి గారికీ చర్చ జరిగేది. ఒక్కో రోజు ఒకొక్క పదం పుట్టేది. ఒక్కోసారి అది కూడా వచ్చేది కాదు. అయినా సరే.. ఉత్సాహంగా పనిచేశాం. సినిమాలో రామ్‌, భీమ్‌ నేపథ్యాలు వేరు. ఒకరు ఆంఽధ్ర అయితే.. మరొకరు తెలంగాణ. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన మాండలికం, ఉమ్మడి పదాలూ పాటలో కనిపించాలి. కర్రసాము, మిరపతొక్కు, జొన్నరొట్టె.. ఇవన్నీ తెలిసిన పదాలే. తెలంగాణలో విజిల్‌ని ‘కీసు పిట్ట’ అంటారు. 1920 నాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితుగతుల్ని దృష్టిలో ఉంచుకొనే ప్రతి పదం రాశాను. రాయడం ఒక ఎత్తు. దాన్ని తెరపై తీసుకురావడం మరో ఎత్తు. ఈ విషయంలో రాజమౌళి మాస్టర్‌ అనిపించుకొన్నారు. తెరపై ఈ పాటని చూస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను. దేనికైనా అత్యున్నత దశ అంటూ ఒకటి ఉంటుంది. ఈ పాటని ఆ స్థాయిలో తీసుకెళ్లి కూర్చోబెట్టారు’’

చంద్రబోస్‌ (గీత రచయిత)

Updated Date - 2023-01-25T01:38:34+05:30 IST