Pathaan: విడుదలకి ముందే ‘బ్రహ్మాస్త్ర’ రికార్డుని బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ మూవీ

ABN , First Publish Date - 2023-01-22T16:21:51+05:30 IST

ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పఠాన్’ (Pathaan) ఒకటి.

Pathaan: విడుదలకి ముందే ‘బ్రహ్మాస్త్ర’ రికార్డుని బద్దలు కొట్టిన షారుఖ్ ఖాన్ మూవీ
Pathaan

ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పఠాన్’ (Pathaan) ఒకటి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి.

నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ భారీ డిమాండ్ కారణంగా ‘పఠాన్’ ఇప్పటికే మహమ్మారి తర్వాత అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ పొందిన మూవీగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు రణ్‌బీర్ కపూర్ నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త్ర (Brahmastra) పార్ట్ వన్ - శివ’ పేరిట ఉండేది. ఆ మూవీ తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 17.71 కోట్ల వసూళ్లు సాధించింది. కాగా.. పఠాన్ తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ దాదాపు రూ.18 కోట్లని ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే తెలుగు డబ్‌ వెర్షన్ కూడా 20 లక్షలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సాధించినట్లు తెలుస్తోంది.

కాగా.. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నందున.. అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ సులభంగా రూ.25 కోట్లు దాటుతుందని ట్రెండ్స్ సూచిస్తున్నాయి. కాగా.. ఈ విభాగంలో రూ.26.90 కోట్లతో ‘వార్’ ఇప్పటి వరకూ టాప్ 1 ప్లేస్‌లో ఉంది.

Updated Date - 2023-01-22T16:21:53+05:30 IST