Bollywood Multi talent : నటనే కాదు.. సీరియస్‌ సింగర్స్‌ కూడా!

ABN , First Publish Date - 2023-09-24T12:42:58+05:30 IST

‘జీ రహే థే హమ్‌ యూ హి బేవజా...’ ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన పాట. ఆ స్వరం మరెవ్వరిదో కాదు.. సల్మాన్‌ఖాన్‌ది. ఒక లైను, రెండు లైన్లు కాదు... మొత్తం పాటంతా కండల వీరుడే పాడాడు. సల్మాన్‌ ఒక్కడే కాదు... కొందరు ‘స్టార్స్‌’ అసలు సిసలు గాయకుల అవతారం ఎత్తుతూ ట్రెండ్‌ సృష్టిస్తున్నారు.

Bollywood Multi talent : నటనే కాదు.. సీరియస్‌ సింగర్స్‌ కూడా!

‘జీ రహే థే హమ్‌ యూ హి బేవజా...’ ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన పాట. ఆ స్వరం మరెవ్వరిదో కాదు.. సల్మాన్‌ఖాన్‌ది. ఒక లైను, రెండు లైన్లు కాదు... మొత్తం పాటంతా కండల వీరుడే పాడాడు. సల్మాన్‌ ఒక్కడే కాదు... కొందరు ‘స్టార్స్‌’ అసలు సిసలు గాయకుల అవతారం ఎత్తుతూ ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. విజయవంతమైన నటులుగా, గాయకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న వారెవరంటే... (Bollywood multi talened Artists)

Bollywood multi  (5).jpeg

రాక్‌ చేసే గాయకుడు (Farhan aktar)

మల్టీ టాలెంటెడ్‌ పదానికి ఉదాహరణగా ఫర్హాన్‌ అక్తర్‌ పేరు చెప్పొచ్చు. ఫర్హాన్‌... దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు, సంగీత కారుడు, నృత్యకారుడు, గాయకుడు. ఏ పని చేస్తున్నా తన మనసంతా అందులో పెట్టడం ఫర్హాన్‌ నైజం. సంగీత ప్రధానంగా వచ్చిన ‘రాక్‌ ఆన్‌’ చిత్రంలో ఫర్హాన్‌ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా 5 పాటలకు గాత్రాన్ని అందించాడు. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ చిత్రంలోని సూపర్‌డూపర్‌ హిట్టైన పాట ‘సైనోరీటా’ గాయకుడు కూడా. ఆ తరవాత ఎన్నో చిత్రాల్లో తన స్వరంతో అలరించాడు. మహేష్‌ బాబు హిట్‌ చిత్రం ‘భరత్‌ అనే నేను’లోని ‘ఐ డోంట్‌ నో’ పాట ఫర్హాన్‌ పాడిందే. ‘రాక్‌ఆన్‌’ పాటలని విని ఇంప్రెస్‌ అయిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మరీ పట్టుబట్టి ఫర్హాన్‌ చేత ఆ పాట పాడించారు.

Bollywood multi  (9).jpeg

తేనెలొలికే స్వరం(Alia bhatt)

అందం, అభినయం అలియాభట్‌ సొంతం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకీ దగ్గరైంది. ఆమెకి ఎన్నో కళల్లో అభినివేశం ఉంది. అందులో సంగీతం ఒకటి. అలియా చక్కని గాయని కూడా. ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’ చిత్రంలో తను పాడిన ‘మై తెను సముఝావా’ పాట పెద్ద హిట్‌. ‘హైవే’లో పాడిన ‘సూహ సాహ’ పాట కూడా హిట్టే. చిన్నప్పటి నుంచి అలియాకు సంగీతం అంటే చాలా మక్కువ. ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. గత ఏడాది బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో స్టేజ్‌ పై ‘కుంకుమలా...’ పాడి అందరినీ ఆశ్చర్యపరచింది. ‘దేవుడు ప్రసాదించిన వరం సంగీతం’ అని మురిసిపోతోంది అలియా.

Bollywood multi  (7).jpeg

భాయి తక్కువేం కాదు (Salman khan)

సల్మాన్‌ ఖాన్‌... యాక్టర్‌, ప్రొడ్యూసర్‌, టెలివిజన్‌ ప్రెజెంటర్‌, ఎంత్రప్రెన్యూర్‌, రైటర్‌, పెయింటర్‌... ఇంతేనా... సింగర్‌ కూడా. అలాగని ఏదో సరదాకి స్వరం కలిపే గాయకుడు కాదు. కాస్త సీరియస్‌ సింగరే. 1999 లో వచ్చిన ‘హలో బ్రదర్‌’లో ‘చాందీ కే దాల్‌ పర్‌’ పాటతో ప్లేబాక్‌ సింగర్‌గా మారాడు. అప్పటినుంచి అడపాదడపా పాడుతూనే ఉన్నాడు. తనవరకే కాదు ఇతరుల చిత్రాలకు కూడా పాడడం విశేషం. సూరజ్‌ పంచోలీ ‘హీరో’ చిత్రంలోని ‘మై హూ హీరో తెరా’ పాట సల్మాన్‌కు ఎంతో పేరు తెచ్చింది. ‘రేస్‌ 3’, ‘దబాంగ్‌ 3’లలో కూడా పాడాడు. తన చిత్రాలలో కనీసం ఓ పాటకైనా తన గాత్రాన్ని అందిస్తున్నాడు. కరోనా సమయంలో వీడియో ఆల్బమ్‌ కూడా చేశాడు. అందులో నటనే కాదు గాత్రమూ తనదే. ఈ మధ్యే విడుదలైన ‘కిసీ కా భాయి కిసీ కా జాన్‌’ చిత్రంలో ‘జీ రహే థే హమ్‌’ పాట భాయిజాన్‌ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది.

Bollywood multi  (11).jpeg

పాటలంటే శ్రద్ధ (Shradda Kapoor)

‘సున్‌ రహా హైనా తూ..’ అని తెరపై పాడుతోన్న ఆరోహిని చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. సంగీత ప్రధానమైన ’ఆషికీ 2’ చిత్రంలోని ఆరోహి పాత్రలో శ్రద్ధా కపూర్‌ జీవించేసింది. తను చక్కని గాయని కావడం వల్ల హావభావాలను అంత చక్కగా పండించగలిగింది. పైగా ఆమె కుటుంబానికి లతా మంగేష్కర్‌ కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది. అందుకేనేమో శ్రద్ధకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మహా ఇష్టం. శిక్షణ కూడా తీసుకుంది. ‘ఆషికీ 2’ తరువాత వచ్చిన ‘ఏక్‌ విలన్‌’, ‘హైదర్‌’, ‘గలియా’ చిత్రాలలో తన స్వరంతో అలరించింది. ‘ఏక్‌ విలన్‌’లోని ‘గలియా’, ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’లోని ‘ఫిర్‌ బీ తుమ్‌కో చాహూంగీ’ పాటలు ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌గా ప్లేలిస్టుల్లో స్థానం సంపాదించాయి. తన పాటలతో ఇన్‌స్టా ప్రేక్షకులని అప్పుడప్పుడూ పలుకరిస్తూ ఉంటుంది శ్రద్ధ.

Bollywood multi  (6).jpeg

గంధర్వ గాయని (Pariniti Chopra)

ప్రస్తుతం ఊహల పల్లకిలో ఊరేగుతున్న నవ వధువు పరిణీతి చోప్రా. ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌గా తెరంగేట్రం చేసినా అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సినిమాలు, ఎండార్స్‌మెంట్లు చేస్తూనే గాయనిగా కూడా సత్తా చాటి, మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుంది. హిందుస్థానీ సంగీతంలో సుశిక్షితురాలామె. స్టేజ్‌ షోలు కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చాక 2017లో ‘మేరి ప్యారీ బిందు’ చిత్రంలో ‘మానా కే హమ్‌ యార్‌ నహీ’ పాటతో గాయనిగా అరంగేట్రం చేసింది. ఆ తరవాత అక్షయ్‌ కుమార్‌ ‘కేసరి’ చిత్రంలో ‘తేరి మిట్టి’కి స్వరాన్ని అందించింది. 2021లో వచ్చిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రెయిన్‌’ చిత్రంలో ‘మత్లబీ యారియా’ గీతాన్నీ పాడి అభిమానుల మనసు గెలుచుకుంది. తరచూ ఇన్‌స్టా పేజీల్లో తనకు నచ్చిన పాటల్ని పాడుతూ పలుకరిస్తుంటుంది. మధురమైన ఆ స్వరం విన్న వాళ్లందరూ పరిణీతిని పొగడకుండా ఉండలేరు. కమనీయంగా పాడే పరిణీతిని అభిమానులు గాంధర్వ గాయనిగా సంబోధించడం విశేషం.

Bollywood multi  (3).jpeg

సంగీత ప్రియుడు (Ayushman khurana)

‘వికీ డోనర్‌’లోని ‘పానీ దా రంగ్‌దే..’ పాట విని ఆ గాయకుడి వివరాల కోసం ఆరా తీసిన వాళ్లెందరో. సూపర్‌డూపర్‌ హిట్టైన ఆ పాటని పాడిన గాయకుడు ఆయుష్మాన్‌ ఖురానా. నేటి తరం క్రేజీ నటుల్లో ఆయనొకరు. ‘సాది గల్లి’, ‘ఓ హీరియే’, ‘తు హి తు’, ‘మిటింట ది కుష్బూ’... ఇలా హిట్టైన పాటలు అతడి ఖాతాలో ఉన్నాయి. స్వరగతుల్ని పలికించడంలో ఆయుష్మాన్‌ది అందెవేసిన చేయి. బాల్యంలోనే సంగీతంలో శాస్త్రీయ శిక్షణ తీసుకున్నాడు. గాయకుడిగానే కాదు పాటల రచయిత, స్వరరచన కూడా అవలీలగా చేస్తాడు. వాళ్ల నాన్నమ్మ పాటలు పాడేదట. నాన్న వేణునాద కళాకారుడు. ‘నా జీన్స్‌లో సంగీతం ఉంద’ని చెబుతాడు ఆయుష్మాన్‌. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా సరే సంగీత సాధనను మరవడు. అడపాదడపా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని విడుదల చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నాడు.

Updated Date - 2023-09-24T12:43:26+05:30 IST