Tollywood Review(2022): టాలీవుడ్ హిస్టరీ!
ABN , First Publish Date - 2022-12-31T18:32:50+05:30 IST
క్యాలెండర్‌లో మరో సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది. చూస్తుండగానే 12 నెలలు అలా గడిచిపోయాయి. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనాతో సతమతమైన సినీ పరిశ్రమ 2022లో కాస్త ఊపిరి పీల్చుకుంది.

క్యాలెండర్‌లో (tollywood)మరో సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది. చూస్తుండగానే 12 నెలలు అలా గడిచిపోయాయి. కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనాతో సతమతమైన సినీ పరిశ్రమ 2022లో కాస్త ఊపిరి పీల్చుకుంది. నెలకు డజనుకు తక్కువ కాకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కొన్ని చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాయి. (Telugu film industry) మరికొన్ని అంచనాలను అందుకుంటే మరికొన్ని ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. మళ్లీ అదే అంచనాలు... కొత్త హుషారుతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. గత ఏడాది ఎలా గడిచిందో ఓ సారి రివైండ్ చేసుకుందాం. (tfi review 2022)
కరోనాతో రెండేళ్లపాటు కుదేలైపోయిన చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది ఊపిరి పోసింది. భారీ చిత్రాలు హంగులతో సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ ఏడాది 240కిపైగా తెలుగు చిత్రాలు విడుదల కాగా, అనువాద చిత్రాలు 65 నుంచి 70 విడుదలయ్యాయి. అయితే వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అంచనాలను అందుకున్న చిత్రాలు 40 లోపే. ఈ ఏడాది అంతా ప్యాన్ ఇండియా నామ స్మరణ జరిగింది. చాలా చిత్రాలు ప్యాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినవే! అయితే వాటిలో సక్సెస్ అయిన చిత్రాల సంఖ్య తక్కువే! (rrr)
సంక్రాంతి కళ తప్పింది. (Sarkaru vaari paata)
జనవరి నెలలో ఒమిక్రాన్ భయం మొదలుకావడంతో నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయడానికి వెనకాడరు. ఈ నెలలో పదిహేడు చిత్రాలు విడుదల కాగా సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ మాత్రమే ప్రేక్షకుల్ని అలరించింది. రానా నటించిన ‘1945’, హీరో, రౌడీభాయ్స్ చిత్రాలు సోసోగా సాగాయి. మొత్తానికీ ఈ ఏడాది సంక్రాంతి.. బంగార్రాజు ఒక్కటే బరిలో హిట్టైంది. నెలాఖరులో విడుదలైన కీర్తి సురేశ్ ‘గుడ్ లక్ సఖి’ కూడా నిరాశపరిచింది. ఫైనల్‌గా సంక్రాంతి నెల కళ తప్పిపోయింది. నాగార్జున మినహా ఇతర హీరోల చిత్రాలేమీ విడుదల కాలేదు.
భీమ్లా – డీజే మోత మోగింది...
రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో ఫిబ్రవరి నెల మొదలైంది. ఆ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండోవారంలో విడుదలైన ‘డీజీ టిల్లు’తో థియేటర్లు మార్మోగిపోయాయి. ఈ ఏడాదికి కిక్ ఇచ్చిన చిత్రమిదే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మోహన్‌బాబు కీలక పాత్రలో భారీ అంచనాలతో విడుదలైన ‘సన్నాప్ ఇండియా’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని నిరాశపరచింది. విడుదలకు ముందే ఈ చిత్రం విపరీతంగా ట్రోల్ కావడంతో కనీసం మూడు రోజులు కూడా థియేటర్స్‌లో నిలవలేదు. అదే నెలలో విడుదలైన పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంతో మళ్లీ థియేటర్ల దగ్గర పాత కళ కనిపించింది. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో అన్యాయం చేసినా సినిమా మాత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. కరోనా తర్వాత థియేటర్లను హౌస్‌ఫుల్ చేసిన చిత్రమిది.
పెద్ద చిత్రాల జోరు..
మార్చి తొలివారంలో విడుదలైన ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ శర్వానంద్ అభిమానులను నిరుత్సాహపరచింది. కరోనా మహమ్మారి వీడిన తర్వాత ఆగ్రతారలు నటించిన చిత్రాల హవా పెరిగింది ఈ నెలలోనే! ప్యాన్ ఇండియా చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఈ నెలలోనే విడుదలయ్యాయి. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నిరాశపరచినా ‘ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో బాక్సాఫీసు వసూళ్లతో కళకళలాడింది.
ఏప్రిల్ నిరాశే...
ఏప్రిల్ 8న విడుదలైన మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ‘గని’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అదే నెల చివర్లో చిరంజీవి–రామ్‌చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ విడుదల అయింది. అయితే ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అభిమానులను నిరుత్సాహ పరిచింది. సంక్రాంతి బరిలో విడుదల కావలసిన ‘సర్కారు వారి పాట’ ఒమిక్రాన్ ప్రభావంతో వాయిదా వేసుకుని మేలో విడుదలైంది. టాక్ నెగటివ్‌గా ఉన్నా మంచి వసూళ్లను రాబట్టింది. తదుపరి ‘ఎఫ్3’ చిత్రం విడుదలైంది. అదే నెల 5న విడుదలైన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ విమర్శకుల్ని మెప్పించింది. ‘భళా తందనాన’, ‘జయమ్మ పంచాయతీ’ చిత్రాలు ఓకే అనిపించాయి. రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా ఫైనాన్షియల్ సమస్యలు, కోర్టు కేసుల వల్ల సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
జూన్‌లో విడుదలైన మేజర్ ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. అడివి శేష్ హీరోగా మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ఈ చిత్రం దివంగత మేజర్ ఉన్ని కృష్ణన్‌కు అంకితమిచ్చారు. ఇదే నెలలో విడుదలైన ‘అంటే సుందరానికి’, ‘విరాటపర్వం’, ‘గాడ్సే’ తదితర చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఇలా ఈ ఏడాది ఫస్టాఫ్ ముగిసింది.
ఇక సెకెండాఫ్‌కు వస్తే
జూలై ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో మొదలైంది. తదుపరి ‘థ్యాంక్యూ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ద వారియర్ ‘విక్రాంత్ రోనా’ చిత్రాలు అంచనాల్ని రేకెత్తించాయి. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఆగస్టులో ఒకే రోజున పోటాపోటీగా విడుదలైన కల్యాణ్‌రామ్ ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాల విజయంతో సెకెండాఫ్‌కు మంచి ఊపొచ్చింది. మాచర్ల నియోజకవర్గం’ ‘లైగర్’ చిత్రాలు పరాజయాన్ని చవి చూసినా ‘కార్తికేయ2’ మాత్రం సత్తా చాటింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. సెప్టెంబర్‌లో ‘ఒకే ఒక జీవితం’తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు శర్వానంద్. నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఓకే అనిపించింది. ‘రంగరంగ వైభవంగా’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘నేను మీకు బాగా తెలుసు’, శాకినీ డాకినీ’ ‘అల్లూరి’ చిత్రాలు నిరుత్సాహపరిచాయి. దసరా కానుకగా ‘ద ఘోస్ట్’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఘోస్ట్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’తో మెప్పించారు. బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయం అయిన స్వాతిముత్యం విమర్శకుల్ని మెప్పించింది. నవంబరులో విడుదలైన ‘యశోద’, ‘మసూద’ మంచి వసూళ్లతో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ‘జిన్నా’, ‘ఓరి దేవుడా’, ‘ప్రిన్స్’ చిత్రాలు ఆకట్టుకోలేదు. సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ పర్వాలేదనిపించింది. ‘ఊర్వశివో రాక్షసివో’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాలు కూడా పాజిటవ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. ‘హిట్2’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు అడివి శేష్. రవితేజ ‘ ధమాకా’ మంచి వసూళ్లని సాధించింది. నిఖిల్ ‘18 పేజెస్’ చక్కని ప్రేమకథగా నిలిచింది. 30వ తేదిన విడుదలైన లక్కీ లక్ష్మణ్, రాజయోగం, టాప్ గేర్ చిత్రాలు సోసోగా సాగాయి. ఓటీటీలో విడుదలైన అనుపమా పరమేశ్వరన్ బటర్ ఫ్లై’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టికెట్ ధర కోసం చేతులు జోడించారు..
సినిమా టికెట్ ధరల వివాదం ఈ ఏడాది చిత్ర పరిశ్రమను కుదిపేసింది. టికెట్ రేటు తగ్గిస్లూ, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం.. పెద్ద దుమారాన్నే లేపింది. ‘థియేటర్ కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్ కలెక్షన్ ఎక్కువ’ అంటూ నాని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌తో చాలామంది సినీ ప్రముఖులు ఏకీ భవించారు. గొంత్తెత్తిన ప్రతి ఒక్కరిపై ఏపీ నాయకులు ఎదురుదాడి చేశారు. వర్మ వేసిన ప్రశ్నలు చర్చగా మారాయి. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ఫిబ్రవరిలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్,రాజమౌళి, ఆర్.నారయణమూర్తి లాంటి ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కలవడం... ఆ సమయంలో పరిశ్రమను ఆదుకోవాలంటూ చిరంజీవి చేతులు జోడించి ప్రార్థించడం లాంటివీ తీవ్రమైన చర్చకే దారితీశాయి. భీమ్లానాయక్ విడుదలయ్యాక ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ మార్చిలో జీవో విడుదల చేసింది. చిరంజీవి చేతులు జోడించి అడగడం అభిమానులు, కొందరు సినీ ప్రముఖులకు నచ్చలేదు. అది కూడా పెద్ద చర్చే జరిగింది.
అనువాదాలు అదరహో...
ఈ ఏడాది అనువాద చిత్రాలు కూడా సత్తా చాటాయి. కన్నడ ‘కె.జి.ఎఫ్2’కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార’, సుదీప్ ‘విక్రాంత్‌రోణ’ వసూళ్లతో హోరెత్తించాయి. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తి ‘సర్దార్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’తోపాటు ఇటీవల వచ్చిన ‘లవ్ టుడే’ కూడా ఆకట్టుకుంది. హిందీ నుంచి వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’, ‘ది కశ్మీర్‌ఫైల్స్’ కూడా మెప్పించాయి. ‘అవతార్ 2’ ప్రభంజనం సృష్టించింది.
జయాపజయాలే కాదు... వివాదాలు కూడా...
సినిమాల విడుదల, జయాపజయాలు కాకుండా మరెన్నో విషయాలు ఈ ఏడాది వార్తల్లో నిలిచాయి. ఆగస్టులో దిల్ రాజు ఆధ్వర్యంలో పలువురు నిర్మాతలు అందరూ కలిసి షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న 24 శాఖల సమస్యపై పంపిణీదారులు చర్చించారు. ప్రదర్శనకారులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యల్ని పరిష్కరించేందుకు తీసుకున్న ఈ బంద్ నిర్ణయంపై పరిశ్రమలోని సినీ పెద్దల నుంచి కామెంట్స్ వచ్చాయి. హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్, ఆర్టిస్ట్‌ల సిబ్బంది ఖర్చులు ఇలా పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు బంద్ నిర్ణయాన్ని సమర్థించగా.. మరికొందరు విమర్శించారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల వేతనాలు. పీఎఫ్ ఛార్జీలు, అగ్రతారల పారితోషికం, ఓటీటీ విడుదలపై చర్చ జరిగింది. త్వరలోనే ఈ సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబరు 1నుంచి చిత్రీకరణలు కొనసాగించవచ్చని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించడంతో బంద్‌కు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ఈ బంద్, జరిగిన చర్చల వల్ల పరిశ్రమకు ఒరిగిందేం లేదని ఇటీవల సి.కల్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే టికెట్ రేట్లు పెంచడం పట్ల డి.సురేశ్‌బాబు కూడా విమర్శించారు. టికెట్ సామాన్యుడికి అందుబాటులో ఉండాలని, టికెట్ ధరలు పెంచడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అందుకే టికెట్ ధరలు పెంపునకు సంబంధించిన చర్చలకు తాను వెళ్లలేదని వెల్లడించారు.
వరుస విషాదాలు
ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడాయి. దశాబ్దాల పాటు వెండితెరపై వెలుగులు నింపిన సినీ దిగ్గజాలు కన్నుమూశారు. సినీప్రియుల్ని శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సీనియర్ హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో జనవరి 8న మరణించారు. ఇదే నెల 3న సీనియర్ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూశారు. భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న కన్నుమూయగా, సంగీత దర్శకుడు బప్పీలహరి ఫిబ్రవరి 15న మరణించారు. ఏప్రిల్ 9న సీనియర్ నటుడు మన్నవ బాలయ్య, దర్శకుడు పోలవరపు శరత్ ఏప్రిల్ 1న, దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20న, నిర్మాత నారాయణదాస్ కె.నారంగ్ ఏప్రిల్ 19న అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సెప్టెంబరు 11న సూపర్‌స్టార్‌కృష్ణ నవంబరు 15న కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఓ శకం ముగిసినట్లైంది. ఇక రచయిత, దర్శకుడు మదన్ నవంబరు 19న మరణించగా, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న, చలపతిరావు 24న, 29న నటుడు, దర్శక నిర్మాత వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు.
అలరించిన పాటలు...
కథతోపాటు సినిమాకు పాటలు సగం బలం. ఈ ఏడాది 270లకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. సినిమాకు 5, 6 పాటలు వేసుకుంటే 1500లకుపైగా పాటలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సినిమాలో ఒక పాట ఆకట్టుకుందీ అంటే ఆ సినిమా ప్రచారం అదిరిపోయినట్లే. ఈ ఏడాది ప్రేక్షకుల్ని బాగా ఊపేసిన పాటల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు.. నాటు’ ఒకటి. అందులో ఎన్టీఆర్ – రామ్‌చరణ్ వేసిన ఊరమాస్ స్టెప్పులు ప్రేక్షకులను కూడా కలు కదిపేలా చేసింది. చిరంజీవి ‘ఆచార్య’లో ‘లాహే లాహే, భలే భలే బంజార పాటలు కూడా అలాగే అలరించాయి. ‘‘భీమ్లానాయక్’లోని టైటిల్‌సాంగ్, సర్కారు వారి పాట’లోని కళావతి, మ..మ.. మహేశా’ గీతాలు కుర్రకారును కట్టిపడేశాయి. ‘విక్రాంత్ రోణ’లోని ‘రా రా రక్కమ్మ’ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ‘సీతారామం’లో ప్రతిపాట అలరించింది. ‘కాంతార’లో ‘వరాహరూపం’, ‘ది వారియర్’లోని ‘‘విజిల్ విజిల్’’, ‘మాచర్ల నియోజకవర్గం’లోని ‘రా రా రెడ్డీ’ థియేటర్‌లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి