Rahul Ravindran: సమంత ఉక్కు మహిళ.. మయోసైటిస్‌ను జయించడం ఆమె జన్మహక్కు..

ABN , First Publish Date - 2022-12-25T19:35:48+05:30 IST

సమంతకు నటుడు, దర్శకుడు, స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఓ ఫొటోను బాహుమతిగా ఇచ్చారు. శక్తివంతమైన సందేశాన్ని ఆ పిక్‌లో రాశారు. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను షేర్ చేసింది.

Rahul Ravindran: సమంత ఉక్కు మహిళ.. మయోసైటిస్‌ను జయించడం ఆమె జన్మహక్కు..

హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, యశోద (Yashoda) సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంది. మూవీ ప్రమోషన్స్‌లోను పాల్గొంది. మయోసైటిస్‌తో బాధపడుతుండటంతో అనేక మంది సెలబ్రిటీలు ఆమె కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తాజాగా సమంతకు నటుడు, దర్శకుడు, స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఓ ఫొటోను బాహుమతిగా ఇచ్చారు. శక్తివంతమైన సందేశాన్ని ఆ పిక్‌లో రాశారు. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను షేర్ చేసింది. రాహుల్‌కు ధన్యవాదాలు చెప్పింది. త్వరలోనే మరింత బలంగా తిరిగి వస్తానని పేర్కొంది.

‘‘ప్రస్తుతం నువ్వు ప్రయాణిస్తున్న మార్గం చీకటిగా ఉంది. కనుచూపు మేరలో అంతం కనిపించడం లేదు. వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారాయి. అయినప్పటికి శక్తినంతా కూడదీసుకుని నువ్వు ముందుకు సాగుతావు. ఎందుకంటే నువ్వు ఉక్కు మనిషివి. ఈ బలహీనతను జయించడం అనేది నీ జన్మహక్కు. నువ్వు చీకట్లో నడుస్తున్నప్పటికి త్వరలోనే ప్రకాశిస్తావు. ఈ కష్ట కాలాన్ని నువ్వు ధైర్యంగా దాటగలుగుతావు. నువ్వు ఒక యోధురాలివి. ఏదీ నిన్ను ఓడించలేదు. ఇటువంటివి నిన్ను మరింత బలపరుస్తాయి’’ అని రాహుల్ రవీంద్రన్ రాశాడు. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. శాకుంతలం (Shaakuntalam) మూవీ షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేసింది. 3డీ వెర్షన్‌కు మారుస్తుండటంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ లోను నటిస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.

Updated Date - 2022-12-25T19:37:04+05:30 IST