Namrata shirodkar: గౌతమ్‌ విషయంలో ఏం చెప్పలేం అన్నారు!

ABN , First Publish Date - 2022-12-18T13:33:23+05:30 IST

‘పెళ్లికి ముందు నమ్రత వేరు. పెళ్లి తర్వాత వేరు. గౌతమ్‌-సితార మా జీవితంలోకి వచ్చాక మా జీవితం మారిపోయింది. మాతృత్వం అంటే ఏంటో తెలిసింది. తల్లిగా..

Namrata shirodkar: గౌతమ్‌ విషయంలో ఏం చెప్పలేం అన్నారు!

‘‘పెళ్లికి ముందు నమ్రత వేరు. పెళ్లి తర్వాత వేరు. గౌతమ్‌-సితార మా జీవితంలోకి వచ్చాక మా జీవితం మారిపోయింది. మాతృత్వం అంటే ఏంటో తెలిసింది. తల్లిగా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ప్రతి ఇంట్లో కష్టాలుంటాయి. నేను కూడా పిల్లల విషయంలో చాలా బాధ పడిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా గౌతమ్‌ విషయంలో’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు నమ్రతా శిరోద్కర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘గౌతమ్‌ తొమ్మిది నెలలు నిండకుండానే పుట్టాడు. తను పుట్టినరోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితం అతి భయంకరమైన రోజు. ఏడో నెలలో చెకప్‌ వెళ్తే బాబు పేగు మెడలో వేసుకున్నాడని, ఊపిరి తీసుకోలేకపోతున్నాడని, హార్ట్‌ బీట్‌ సరిగా లేదని డాక్టర్లు చెప్పారు. కంగారుతో మహేశ్‌కి ఫోన్‌ చేశా. అదృష్టం కొద్దీ ఆయన హైదరాబాద్‌లోనే షూటింగ్‌ చేస్తున్నారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. అప్పుడు గౌతమ్‌ 1.5 కేజీలు మాత్రమే ఉన్నాడు. బాబు విషయంలో డాక్టర్లు ఏమీ చెప్పలేం అని మహేశ్‌కు ముందే చెప్పేశారు. మూడు వారాలపాటటు బాబుని ఇంక్యుబేటర్‌లో ఉంచాం. తను రోజుకి 40 గ్రాముల పాలు పట్టించాలని, ప్రతి రోజు పది గ్రాములు బరువు పెరగాలని డాక్టర్లు చెప్పారు. రోజూ నిద్రపోయే ముందు వాడు బరువు పెరగాలని దేవుణ్ణి ప్రార్థించేవాళ్లం. వైద్యులు విశ్వప్రయత్నాలు చేశారు. తను ఇప్పుడు ఇలా ఉన్నాడంటే వైద్యులే కారణం’’ అని నమ్రత చెప్పారు.

ఫోన్లు చేసి విసిగించను...

మహేశ్‌ గురించి చెబుతూ ‘‘ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే బంధం బలంగా ఉంటుంది. మహేశ్‌తో నా వివాహమై 17 ఏళ్లు అవుతుంది. పెళ్లికి ముందు నుంచే మేం అన్ని విషయాలు షేర్‌ చేసుకునేవాళ్లం. మా మధ్య రహస్యాలు, అనుమానాలు, అపనమ్మకాలకు చోటు లేదు. ఆయన బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్లావు? ఎవరితో ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని పదిసార్లు ఫోన్లు చేసి విసిగించను, అనుమానించను. ఆయన కూడా అలాగే ఉంటారు’’ అని చెప్పారు.

Namratha.jpg

ఆయనది ప్రత్యేక స్థానం..

షిర్డీ సాయిబాబాను బాగా నమ్మడానికి తన తల్లే కారణమని నమ్రత చెప్పారు. ‘‘నేను దేవుణ్ణి బాగా నమ్ముతా. ఫలానా దేవుడు అంటే ఇష్టం... ఇంకో దేవుడంటే నమ్మకం లేదు అని నాకు ఉండదు. అందరు ఒకటే అని నమ్ముతా. అయితే ఎక్కువ బాబా పూజలు చేయడానికి అమ్మ కారణం. అమ్మ బాబా భక్తురాలు. ఆయన వల్ల మా కుటుంబంలో ఎన్నో మిరాకిల్స్‌ జరిగాయి. మా కుటుంబం మొత్తాన్ని ఆయన కాచి రక్షిస్తున్నారు. బాబాతో నాకు ఎన్నో మంచి అనుభవాలున్నాయి. మా ఇంట్లో ఆయనది ప్రత్యేక స్థానం. మా ఇంట్లో వినాయక చవితి, కిస్మస్‌ వేడుకలు బాగా జరుపుతాం’’ అని నమ్రత చెప్పారు.

Mahesh.jpg

Updated Date - 2022-12-19T10:00:04+05:30 IST