సూపర్‌మేన్ లాంటి పాత్ర... ‘బింబిసార’ దర్శకుడు
ABN , First Publish Date - 2022-08-02T06:33:10+05:30 IST
‘‘టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు అనగానే ఈతరం హీరో వేరే కాలానికి వెళ్లినట్టు చూపిస్తుంటారు. ‘బింబిసార’ మాత్రం అలా కాదు....

‘‘టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు అనగానే ఈతరం హీరో వేరే కాలానికి వెళ్లినట్టు చూపిస్తుంటారు. ‘బింబిసార’ మాత్రం అలా కాదు. వేరే కాలానికి చెందిన రాజు... ఈతరంలోకి అడుగు పెడతాడు. అదే ఈ కథలో వైవిధ్యం’’ అన్నారు వశిష్ట. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బింబిసార’. కల్యాణ్‌రామ్ కథానాయకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వశిష్ట చెప్పిన కబుర్లు...
‘‘నాకు ముందు నుంచీ దర్శకత్వం అంటేనే ఇష్టం. కానీ కెరీర్ ప్రారంభంలో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో నటించాను. ఆ సినిమా విడుదల కాలేదు. నాకు నచ్చిన, వచ్చిన పనే చేయాలనే నిర్ణయం తీసుకొన్నాను. ఆ తరవాత దర్శకత్వం వైపు గట్టిగా దృష్టి సారించాను. 2018లో ‘బింబిసార’ ఆలోచన వచ్చింది. దాన్ని పూర్తి స్థాయి కథగా తయారు చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ‘పటాస్’ నుంచీ కల్యాణ్ రామ్ గారితో అనుబంధం ఉంది. ఆయనైతే ఈ కథకు సరిగ్గా సరిపోతారనిపించి, ‘ఓ కథ ఉంది.. వింటారా’ అంటూ మెసేజ్ పంపాను. ఆయన రమ్మన్నారు. వినగానే కథ బాగా నచ్చింది. నిర్మాత హరిగారు కూడా విని ‘ఓకే’ అన్నారు. అలా ‘బింబిసార’ మొదలైంది’’
‘‘అవకాశం రావడం ఎంత కష్టమో, ఎంత గొప్ప విషయమో నాకు తెలుసు. ‘బింబిసార’ నాకు దొరికిన గొప్ప అదృష్టం. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో, అంతా కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో కల్యాణ్‌రామ్, హరి అందించిన సహకారం మర్చిపోలేను. నేను ఈ కథని నమ్మాను. నన్ను వాళ్లు నమ్మారు. అందుకే ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చింది. సెప్టెంబరులోనే చిత్రీకరణ పూర్తయింది. అయితే... విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సివచ్చింది’’
‘‘ఇది కల్పిత గాథ. మన దేశాన్ని పరిపాలించిన రాజులు ఎవరున్నారు? అనే విషయాన్ని రిసెర్చ్ చేస్తే ‘బింబిసారుడు’ అనే పేరు కనిపించింది. ఆ పేరు వినగానే ఆకట్టుకొనేలా ఉంది. అందుకే ఆ పేరు చుట్టూ కథ అల్లుకొన్నా. రోజూ ఆ కసరత్తు కొత్తగా అనిపించేది. ఓ కథకుడిగా నేను కూడా టైమ్ ట్రావెల్ చేసి.. ఆ కాలంలోకి వెళ్లి ఊహల్లో విహరించి ఈ కథ రాసుకొన్నా. కల్యాణ్ రామ్ గారి గెటప్పుల కోసం వివిధ స్కెచ్‌లు డిజైన్ చేసుకొన్నాం. చివరికి ఈ లుక్ ఓకే చేశాం’’
‘‘టెక్నికల్ టీమ్ చాలా సపోర్ట్ చేసింది. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. చోటా కె. ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. కొత్త దర్శకుడ్ని అయినా ఖర్చుకు ఎక్కడా వెనుకంజ వేయలేదు. ‘బింబిసార’ అనే పాత్ర సూపర్ మేన్ లాంటిది. ఎన్ని భాగాలైనా, ఎన్ని సీజన్‌లైనా తీసుకోవచ్చు. ‘బింబిసార 2’ తప్పకుండా ఉంటుంది. 3, 4 భాగాలకూ అవకాశం ఉంది’’.