Rajinikanth: సూపర్‌స్టార్‌ లేకుండానే పుట్టినరోజు వేడుకలు.. పోటెత్తిన అభిమానులు

ABN , First Publish Date - 2022-12-13T09:52:19+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) 72వ పుట్టినరోజు (Birthday) వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

Rajinikanth: సూపర్‌స్టార్‌ లేకుండానే పుట్టినరోజు వేడుకలు.. పోటెత్తిన అభిమానులు
rajinikanth

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) 72వ పుట్టినరోజు (Birthday) వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ పుట్టిన రోజున ఆయన చెన్నైలో లేరు. దీంతో ఆయనకు స్వయంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లిన ఆయన అభిమానులుకు తీవ్ర నిరాశ ఎదురైంది. వేకువజాము నుంచే వందలాది మంది అభిమానులు పోయెస్‌ గార్డెన్‌లోని ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఒక వైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వేచి ఉన్నారు. అభిమానుల అవస్థలు చూసిన సూపర్‌స్టార్‌ సతీమణి లతా రజనీకాంత్‌ (Latha Rajinikanth) అభిమానుల వద్దకు వచ్చి ఒక విజ్ఞప్తి చేశారు.

‘రజనీకాంత్‌ ఊరిలో లేరు. అందువల్ల అభిమానులు ఆయన కోసం ఎదురు చూడొద్దు. ఆయన తరఫున ప్రతి ఒక్కరికీ కృతజ్ఞ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వచ్చి అభిమానులను కలిసేవారు. అందువల్ల అభిమానులు ఎవరూ వర్షంలో తడుస్తూ ఇక్కడే ఉండొద్దు’ అని కోరారు. అయినప్పటికీ అభిమానులు అక్కడే వేచి ఉన్నారు. మరికొందరు అక్కడే భారీ కేక్‌ కట్‌ చేసి రజనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

మరోవైపు క్రోంపేటలోని వెట్రి సినిమా థియేటర్‌లో జరిగిన రజనీకాంత్‌ బర్త్‌డే వేడుకల్లో లతా రజనీకాంత్‌ పాల్గొని, కేక్‌ కట్‌ చేసి, సందడి చేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా రజనీ అభిమానులు ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రజనీ పేరుపై అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు అన్నదానం, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

160 కేజీలతో రజనీ బర్త్‌ డే కేక్‌

తిరుచ్చి జిల్లా దురైయూరులో కొత్తగా ప్రారంభించిన బేకరీలో 160 కేజీల బరువుతో రజనీకాంత్‌ ఆకారంతో రూపొందించిన భారీ కేక్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందుంది. రజనీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ కేక్‌ను తయారు చేశారు. ఈ కేకును నలుగురు సిబ్బంది 260 గంటలపాటు శ్రమించి 160 కేజీల చాక్లెట్‌ ఫేవర్‌తో తయారు చేశారు.

Updated Date - 2022-12-13T10:13:55+05:30 IST