Jean-Luc Godard: చివరి క్షణాలను సైతం కెమెరాలో రికార్డు చేస్తూ కన్నుమూయాలనుకున్న గొడార్డ్‌.. ప్రపంచ సినీ చరిత్రను మార్చేసి..

ABN , First Publish Date - 2022-09-14T19:43:27+05:30 IST

Godard - ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుంటారంటే ఆశ్చర్యమే. ప్రపంచ సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈయన గురించి రాయడమంటే తేనెతుట్టెపై రాయి వేసినట్టే. Godard ని పరిచయం చెయ్యాలంటే ఆయనొక్కరి గురించి చెప్తే సరిపోదు. ఈయన గురించి చెప్పాలంటే ముందు Andre Bazin ని పరిచయం చెయ్యాలి.

Jean-Luc Godard: చివరి క్షణాలను సైతం కెమెరాలో రికార్డు చేస్తూ కన్నుమూయాలనుకున్న గొడార్డ్‌.. ప్రపంచ సినీ చరిత్రను మార్చేసి..

Godard - ఈ పేరు తెలియని సినీ ప్రేమికులుంటారంటే ఆశ్చర్యమే. ప్రపంచ సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈయన గురించి రాయడమంటే తేనెతుట్టెపై రాయి వేసినట్టే. Godard ని పరిచయం చెయ్యాలంటే ఆయనొక్కరి గురించి చెప్తే సరిపోదు. ఈయన గురించి చెప్పాలంటే  ముందు Andre Bazin ని పరిచయం చెయ్యాలి. ఆయన పరిచయం చేయడంతో  సరిపోదు. Andre Bazin తర్వాత Cahiers du Cienma గురించి చెప్పకపోతే ఎట్లా? ఈ పెద్దాయన గురించి మొదలెట్టాక  Henri Langlois గురించి చెప్పకపోతే గీస్తున్న బొమ్మకు ఒక్క కన్ను మాత్రమే పెట్టినట్టుంటుంది.  ఇక Henri Langlois గురించి చెప్పాక Cinematheque గురించి చెప్పకపోతే పెద్ద నేరం కిందే లెక్క. Cinematheque వరకూ వచ్చాక మే, 1968 గురించీ చెప్పుకోవాలి. ఇంతా చెప్పాక Children of Cinematheque గురించి మర్చిపోగలమా? ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో నెలైనా కేటాయించాలి. అసలు వీళ్ళగురించి ఏమైనా చెప్పాలి అంటే మళ్ళీ కథ మొదలుపెట్టాలి. 


1950ల్లోని ఫ్రాన్స్ కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే Godard ని పరిచయం చెయ్యొచ్చు (But not with out introducing few of French Intellectual schools of thought like Marxism, feminism and structuralism). పరిచయం చేస్తే సరిపోదు కదా. ఆయనతో పాటు ఆయన సినిమాల గురించి చెప్పాలి. ప్రపంచంలో గొప్ప దర్శకులు అందరూ వారి వారి జీవిత కాలంలో ఒక పది సినిమాలు లేదా మహా అయితే రెండు మూడు డజన్ల సినిమాలు తీసుంటారు. కాబట్టి వారి సినిమాలన్నీ కాకపోయినా కొన్నైనా పరిచయం చెయ్యొచ్చు. కానీ ఒకటీ అరా కాదు Godard ఏకంగా 70-80 సినిమాలు తీసారు. వాటిల్లో ఎన్నని చూడగలం? ఎన్నని పరిచయం చెయ్యగలం? ఒక విధంగా ఈయన గురించి పరిచయం చేయడమంటే మొత్తం ప్రపంచ సినిమా చరిత్రను పరిచయం చేయాలి. అందుకే Godard ని పరిచయం చెయ్యాలంటే మహా కష్టం. 


Jean-Luc Godard, డిసెంబరు 3, 1930 న ప్యారిస్ లోని బాగా డబ్బున్న ఒక స్విస్ బూర్జువా కుటుంబంలో జన్మించాడు. ప్రపంచ యుద్ధ సమయంలో అతన్ని స్విట్జర్లాండ్ కి పంపించివేశారు. యుద్ధానంతరం ప్యారిస్ తిరిగివచ్చిన Godard 1949 లో సోర్బోన్ యూనివర్శిటీలో చేరాడు. ఆ రోజుల్లో ప్యారిస్ లో Henri Langlois అనే ఒకాయన సినిమాథెక్ అనే పేరుతో ఒక ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశారు. దీన్ని ఫిల్మ్ క్లబ్ అనడంకంటే ఒక సినిమాలయం అనవొచ్చు. ఈ రోజుల్లో సినిమా అంటే ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు హాయిగా చూడొచ్చు కానీ ఆ రోజుల్లో అలా కాదు. సినిమా అనేది కేవలం బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేది. వారి కోసం అప్పుడున్న కొన్ని సినిమా హాళ్లల్లో సినిమాలు ప్రదర్శించిన తర్వాత ఆ సినిమా ప్రింట్లు ఎక్కడో మూలన పడేసేవారు. అప్పట్లో ఉన్న నైట్రేట్ ఫిల్మ్ కొన్నాళ్ళకు బూజుపట్టి పాడైపోయేది. ఎన్నో విలువైన కళాఖండాలకు జరుగుతున్న ఈ నష్టాన్ని చూసి భరించలేక Henri Langlois తన స్వంత ఖర్చులతో ఆ సినిమా రీళ్ళను సేకరించి భద్రపరచడమే కాకుండా తను స్థాపించిన Cinematheque అనే ఫిల్మ్ క్లబ్ ద్వారా ఆ సినిమాలని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. (ఈయన శ్రమను గుర్తించి, సినిమా అనే కళాఖండాన్ని భద్రపరచడంలో ఆయన పోషించిన పాత్రకి గాను ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా ఇచ్చారు.)


యూనివర్శిటీ విద్యార్థిగా అప్పుడే ప్యారిస్ వచ్చిన Godard కి సినిమాలంటే ఎప్పట్నుంచో ఉన్న ఆసక్తి  కారణంగా యూనివర్శిటీ కంటే కూడా ఈ సినిమాథెక్ అధికంగా నచ్చింది. దానికి తోడు ఈయనలాంటి వారే మరికొంతమంది సినీ ఔత్సాహికులు (Truffaut, Rohmer, Rivette లాంటి చాలా మంది) పరిచయం కావడం కూడా Godard కి సినిమా అనే కళపై విపరీతమైన ఆసక్తి కలిగింది. ఇక్కడే Godard కి Andre Bazin తో కూడా పరిచయం ఏర్పడింది. Godard కంటే కాస్త పెద్దవాడైన Andre Bazin అప్పుడప్పుడే సినిమా విమర్శ, విశ్లేషణా రంగంలో కొత్త ఆలోచనలు ప్రతిపాదిస్తూ కొత్త ఓరవడిని సృష్టిస్తున్నారు. 


Andre Bazin దృష్టిలో మంచి సినిమా అంటే రియాలిటీని సినిమాలో ఎంత నిజంగా చిత్రీకరించగలిగారనే దానిమీద ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడేవారు. ఒక విధంగా ఈయనది అప్పటి రోజుల్లో ఒక వింత పోకడ. Andre Bazin ముందు వరకూ చాలామంది సినిమాలో రియాలిటిని ఎంత బాగా manipulate చెయ్యగలిగి ఉంటే అది అంత గొప్ప సినిమా అని ఒక భావన ఉండేది. Bazin ఆలోచనలు ఈ భావనకు పూర్తిగా విరుద్ధంగా ఉండేవి. సినిమా గురించి దాదాపు ఇలాంటి భావాలే కలిగిన Godard, అతని మిత్రులకు Andre Bazin గురువయ్యాడు. Cinematheque లో చూసిన వివిధ సినిమాల గురించి వీరంతా కలిసి చర్చిస్తుండేవారు కూడా.


Godara, అతని మిత్ర బృందం తాము చూసి, చర్చించిన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తే బావుంటుందనే ఆలోచనతో 1949 లో Gazette du Cinema పేరుతో ఒక పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో Godard తన పేరుతో కొన్ని వ్యాసాలు, Hans Lucas అనే మారుపేరుతో కొన్ని వ్యాసాలు ప్రచురించారు. ఐదు నెలలపాటు నడిపాక నిధులు లేక ఈ పత్రిక మూతపడింది. ఆ తర్వాత 1951లో Andre Bazin స్థాపించిన Cahiers du Cinema (Notebooks of Cinema) అనే పత్రికను స్థాపించారు. Godard , అతని మిత్రులు ఈ పత్రికలో తరచుగా తమ సినీ సమీక్షలు, విశ్లేషణలు ప్రచురించేవారు. ఒక వైపు రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే మరోవైపు తన మిత్రులతో కలిసి లఘు చిత్ర నిర్మాణంలోకి దిగారు Godard.


సినిమా నిర్మాణంలో డబ్బులు వృధా చేస్తున్న కారణంగా 1951లో Godard కుటుంబ సభ్యులు అతనికి డబ్బులివ్వడం ఆపేశారు. ఈ సమయంలో డబ్బులకోసం చిన్న చిన్న దొంగతనాలు కూడా చేశాడట ఆయన. చివరికి ఫ్రాన్స్ లో తన కలలు నిజం కాలేక నిరాశతో తండ్రితో కలిసి అమెరికా ప్రయాణం కట్టాడు Godard. అమెరికాలో ఒక లఘు చిత్రమైనా నిర్మించాలని పట్టుదలతో బయల్దేరిన Godard కేవలం కారు కిటికీలోనుంచి చిత్రీకరించిన ఒక షాట్ తో మాత్రమే తిరిగి ఫ్రాన్స్ చేరుకున్నాడు. 1954 లో ఒక డామ్ నిర్మాణ కార్యక్రమాల్లో రోజువారీ కూలీగా పని చేస్తూ అక్కడ సంపాదించిన డబ్బులతో Operation beton (Operation Concrete) పేరుతో తన మొదటి సినిమా నిర్మాణం పూర్తి చేశారు. ఇలా మొదలయిన ఆయన సినిమా ప్రస్థానం ఆ తర్వాత రోజుల్లో మరిన్ని లఘు చిత్రాల నిర్మాణంతో, Cahiers du Cinema లో వ్యాస రచనలతో కొనసాగింది.


Godard, అతని స్నేహితులు వారి గురువైన Andre Bazin తో కలిసి చర్చిస్తూ Cahiers లో ప్రచురించిన వ్యాసాలు నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగివున్నాయి. Cahiers లో ఉండగా వీరంతా కలిసి ప్రతిపాదించిన auteur థియరీ సినిమా విమర్శ మరియు విశ్లేషణ రంగాన్నే కాకుండా సినిమా దర్శకత్వానికి కూడా కొత్త అర్థాలు అద్దింది. వీరు ప్రతిపాదించిన ఈ థియరీ ఏంటంటే..


The auteur theory can be summarized most simply as an acknowledgement of the director as the primary and shaping force behind any film; those directors whose body of work tends to exhibit the features of any number of recurring themes that might reveal some personal vision or world-view are especially prized in the auteur-centric evaluation of cinema, for their work demonstrates an individual and authorial presence in spite of the outside influence of film-as-commodity production models or budgetary constraints. 


ఈ విధంగా Godard సినిమాలు తీయకముందునుంచే తన సినిమాలు ఇలా ఉండాలి అని మనసులో ఒక ఫ్రేమ్ వర్క్/థియరీలను ఏర్పరుచుకుంటూ వచ్చారు. నిజానికి Godard దృష్టిలో సినిమా విమర్శ/విశ్లేషణ, సినిమా నిర్మాణం రెండూ వేరు వేరు కాదు. ఇవి రెండూ ఒకే రకమైన కార్యకలాపానికి వేరు వేరు విధానాలని పేర్కొన్నారు (…criticism and filmmaking were for him two versions of the same activity.)


Godard అనగానే నాకెందుకో శ్రీ శ్రీ గుర్తుకొస్తాడు. తెలుగు సాహిత్యాన్ని శాసిస్తానని శ్రీశ్రీ పైకి చెప్పారుగానీ, పైకి చెప్పకపోయినా ప్రపంచ సినిమా చరిత్రను శాసిస్తానని Godard ఎప్పుడోకప్పుడు తప్పక అనుకుని ఉంటాడని నాకు గట్టి నమ్మకం. Godard స్థూలంగా సినిమా గురించి, తనకు నచ్చిని ఇతర సినిమా దర్శకుల గురించి ఏమన్నారో చూద్దాం. 


ప్రముఖ సినిమా దర్శకుడు Sergei Parajanov గురించి Godard చేసిన వ్యాఖ్య: 

In the temple of cinema there are imagens, light and reality. Sergei Parajanov was the master of that temple.

Godard సినిమాని ఒక ఆలయంగా పవిత్రతను ఆపాదిస్తూ, గొప్ప సినిమా దర్శకుణ్ణి ఆ ఆలయంలో పూజారిగా గుర్తిస్తాడు. ఈ ఒక్క వాక్యం చాలు Godardకి సినిమా అంటే ఎంత ప్రేమో చెప్పడానికి. 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమా నిర్మాణం ఆపలేదు. సరికదా తన జీవితంలోని చివరి క్షణాలను సైతం, వీలైతే, కెమెరా లో రికార్డు చేస్తూ కన్నుమూయాలని ఉందని ఈ మధ్యనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు Godard.


అలాగే సినిమా ని ఆహారంతో పోలుస్తూ చేసిన ఈ వ్యాఖ్య చూడండి:

“In the 1950s cinema was as important as bread – but it isn’t the case any more. We thought cinema would assert itself as an instrument of knowledge, a microscope…a telescope…At the cinematheque I discovered a world which nobody had spoken to me about..They’d told us about Goethe, but not Dreyer..We watched silent films in the era of talkies..We dreamed about film..


సినిమాని ఇంత పిచ్చిగా ప్రేమించిన Godard , అతని స్నేహితులు కొన్నాళ్ళకు తాము ప్రతిపాదించిన auteur థియరీ సిద్ధాంతాలను కేవలం రాతల్లోనే కాక చేతల్లో కూడా చూపించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్నేళ్ళు లఘుచిత్రాలు నిర్మాణం చేసారు. 1959 లో ఈ బృందంలో  ఒకరయిన Turffaut దర్శకత్వంలో వచ్చిన 400 Blows అనే సినిమా ఫ్రాన్స్ లో విడుదల కావడం, కాన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకోవడంతో వారిలో నూతన ఉత్సాహం పొంగిపొర్లింది. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల్లోనే Truffaut తో కలిసి  రూపొందించిన స్కీన్ప్లే ద్వారా À bout de souffle (Breathless) సినిమాని రూపొందించారు. ఈ ఒక్క సినిమాతో Godard ప్రపంచ సినీ ప్రేమికులనంతా ఆకట్టుకొన్నారు. ఈ సినిమాతో ప్రపంచ సినిమా చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగింది. అప్పటివరకూ కాగితాలకే పరిమితమైనా Godard, అతని మిత్రుల రాతలు ఈ సినిమా తర్వాత సినిమా అనే ప్రకియలోని సిధ్ధాంతాలను, నియమాలను తిరగరాసాయి. Godard, Truffaut ల మొదటి సినిమాలతో ఉవ్వెత్తున ఎగిసిన ప్రయత్నం న్యూ వేవ్ ఉద్యమంగా మారి ప్రపంచంలోని ఎంతో మంది ఔత్సాహిక దర్శకులకు నూతన ఉత్తేజాన్ని కల్పించింది.


Breathless సినిమాతో Godard చరిత్ర అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలయింది. 1959 - 1968 ల మధ్య Godard రూపొందించిన ఎన్నో సినిమాలు నేటికీ ప్రపంచ సినీ ప్రేమికుల మదిలో మెదులుతూనే ఉంటాయి. ఈ సినిమాల ద్వారా చలనచిత్రం అనే ప్రక్రియకు నూతన భాష్యం చెప్తూ, దిశా నిర్దేశం చేశారు. 1968 ల తర్వాత Godard చేసిన సినిమాలు మరో రకం. తెల్ల కాగితం ముందు రచయిత ఎంత ఒంటరో సినిమా సెట్లో దర్శకుడు కూడా అంతే ఒంటరి వాడని చెప్పుకొచ్చిన Godard,  1970 లో తీసిన సినిమాలు న్యూ వేవ్ సినిమాల్లాగా ప్రపంచ సినీ పరిశ్రమ గతి మార్చలేకపోయినా అప్పటినుండీ ఇప్పటివరకు కూడా తను నమ్మిన (ఎప్పటికప్పుడు) సిధ్ధాంతాల ఆధారంగా చిత్రనిర్మాణం కొనసాగించిన చిరస్మరణీయుడాయన. భౌతికంగా కనుమరుగైనా, తన సినిమాల ద్వారా గొడార్డ్ ఎప్పటికీ  చిరంజీవే!


(సెప్టెంబర్ 13 మంగళవారం కన్నుమూసిన Jean-Luc Godardకు నివాళిగా)



వెంకట్ శిధారెడ్డి 

(సినీ దర్శకులు, రచయిత)

+91 98498 88773

Updated Date - 2022-09-14T19:43:27+05:30 IST