Shiva Rajkumar: అసలు ఆ ఆలోచనే లేదు

ABN , First Publish Date - 2022-12-04T17:02:09+05:30 IST

నట జీవితంలోనే కొనసాగాలన్నది తన అభిమతమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన చేయనని ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌..

Shiva Rajkumar: అసలు ఆ ఆలోచనే లేదు

నట జీవితంలోనే కొనసాగాలన్నది తన అభిమతమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన చేయనని ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ (Dr. Shivrajkumar) స్పష్టం చేశారు. వేద చిత్రం ట్రైలర్‌ విడుదల సందర్భంగా శనివారం జిల్లాకు వచ్చిన శివరాజ్‌కుమార్‌ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాయచూరు ప్రాంతం పట్ల తమ కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తమ తండ్రి దివంగత డాక్టర్‌ రాజ్‌కుమార్‌ అనేక సార్లు ఈ జిల్లాను సందర్శించారని, ఈ గడ్డలోకి ప్రవేశించి తనకు మాతృ భూమిలోకి వచ్చిన అనుభూతి కలిగిందని తెలిపారు.


కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా తమ సోదరుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) అభిమానులు ఇక్కడ చేసిన సేవలను కొనియాడారు. వేద చిత్రం విభిన్న కోణాల్లో సమాజంలోని సమస్యలను, వ్యక్తి భావాలను ప్రతిబింబించేదిగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు శివరాజ్‌కుమార్‌ తెలిపారు. చిత్రం విడుదలకు పూర్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. జిల్లాకు తొలిసారిగా వచ్చిన శివరాజ్‌కుమార్‌ను సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివరాజ్‌ పాటిల్‌ ఘనంగా స్వాగతించారు. స్థానిక యరమరస్‌ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చం అందజేసి ఆయనను జిల్లాకు స్వాగతించారు.

Updated Date - 2022-12-04T17:02:09+05:30 IST