హిట్టు పడితే దర్శకులకు పొగరు పెరుగుతుందట!
ABN , First Publish Date - 2022-03-21T23:51:45+05:30 IST
దర్శకత్వం వహించిన తొలి చిత్రం హిట్ సాధిస్తే కొత్త దర్శకులకు తల పొగరు పెరిగిపోతుందని, దీంతో తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చవచ్చన్న భావనకు వస్తారని ప్రముఖ దర్శకుడు మిస్కిన్ విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న

దర్శకత్వం వహించిన తొలి చిత్రం హిట్ సాధిస్తే కొత్త దర్శకులకు తల పొగరు పెరిగిపోతుందని, దీంతో తమ తదుపరి చిత్రంతో ఈ ప్రపంచాన్నే మార్చవచ్చన్న భావనకు వస్తారని ప్రముఖ దర్శకుడు మిస్కిన్ విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న కొత్త డైరెక్టర్లు ఎవరూ ఆపై రాణించిన దాఖలాలు లేవన్నారు. తాజాగా జరిగిన ‘సెల్ఫీ’ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సినిమా రంగంలోకి అడుగుపెట్టే కొత్త దర్శకులు తమ తొలి సినిమా సక్సెస్ అయితే ఇక వారు ఈ ప్రపంచాన్ని మార్చేస్తామన్న ఫీలింగ్‌తో ఉంటారు. ఇలాంటి భావన రావడం చాలా తప్పు. ఆ విధంగానే నేను కూడా భావించాను. ఆ తర్వాత వాస్తవమేంటో గ్రహించాను. అదేసమయంలో తమ గురించి వచ్చే గాసిప్స్‌ను అస్సలు పట్టించుకోకూడదు. ఎల్లవేళలా నాలుగు మంచి విషయాలే మాట్లాడుకోవాలి. అవే మనల్ని విజయపథంలో నడిపిస్తాయి. ఈ విధంగానే అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ప్రారంభం నుంచి ఉన్నారు. మంచి విషయాలనే నిరంతరం చర్చిస్తూ వచ్చారు. అందుకే విజయపథంలో పయనిస్తున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్లుగా పనిచేసిన కొత్త దర్శకుడు మది మారన్‌తో పాటు ఇతరులు కూడా విజయవంతమైన చిత్రాలనే నిర్మిస్తూ విజయాలను సొంతం చేసుకోవాలి’’ అని మిస్కిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.