అలా ఉంటే హిందీ కంటే తమిళ సినిమానే గొప్పది: Kamal Haasan

ABN , First Publish Date - 2022-06-19T19:31:37+05:30 IST

చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ హీరో ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) తరహాలో నిజాలు మాట్లాడితే హిందీ చిత్రం కంటే తమిళ చిత్రపరిశ్రమే గొప్పగా ఉంటుందని ‘విశ్వనటుడు’ కమల్‌ హాసన్‌ అన్నారు.

అలా ఉంటే హిందీ కంటే తమిళ సినిమానే గొప్పది: Kamal Haasan

చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరూ హీరో ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) తరహాలో నిజాలు మాట్లాడితే హిందీ చిత్రం కంటే తమిళ చిత్రపరిశ్రమే గొప్పగా ఉంటుందని ‘విశ్వనటుడు’ కమల్‌ హాసన్‌ అన్నారు. నాలుగేళ్ళ తర్వాత ఆయన నటించిన ‘విక్రమ్‌’ (Vikram) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ శుక్రవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఇందులో సినీ హీరో ఉదయనిధి స్టాలిన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagraj), సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh), నిర్మాత అన్బుచెళియన్‌లతో కలిసి కమల్‌ హాసన్‌ పాల్గొన్నారు. ఇందులో కమల్‌ మాట్లాడుతూ.. ‘హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌లా ప్రతి ఒక్కరూ నిజాలు మాట్లాడితే హిందీ వంటి ఇతర చిత్ర పరిశ్రమల కంటే గొప్పగా ఉంటుంది. 


‘విక్రమ్‌’ విజయం నా ఒక్కడి సక్సెస్‌ కాదు. దీని వెనుక అనేక మంది ఉన్నారు. వారందరికీ చెందుతుంది. పదేళ్ళ కాలంలో ఎలాంటి చిక్కులు లేకుండా నా సినిమా రిలీజ్‌ కావడం ఇదే తొలిసారి. దీనికి కారణం ఉదయనిధి వంటి వారు పలువురు ఉన్నారు. టెక్నీషియన్‌ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కె.బాలచందర్‌ నటుడిగా ప్రోత్సహించారు. ఆయన వేసిన బాట ఇది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్‌కు ఓ విన్నపం. ఈ విజయాన్ని ఇంతటితో మరిచిపోయి కొత్త చిత్రానికి మరింత బాధ్యతతో పనిచేయాలి. ఆ చిత్రం కూడా ఇదే విధంగా సక్సెస్‌ సాధించాలి’.. అని ఆకాంక్షించారు. 


దర్శకుడు లోకేష్‌ మాట్లాడుతూ.. ‘ఈ రోజుతో నాలోని టెన్షన్‌ అంతా పోయింది. ఇప్పుడు రిలాక్స్‌గా ఉంది. ఈ సక్సెస్‌ మరింత బాధ్యతను పెంచింది. ‘అండవర్‌’ ఇచ్చిన సూచనను మనస్సులో పెట్టుకుని పనిచేస్తాను’ అని అన్నారు. హీరో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ విడుదల చేయడం చాలా సంతోషంగా వుంది. మూడు వారాల తర్వాత కూడా విక్రమ్‌ సినిమా హౌస్‌ఫుల్‌గా నడస్తోంది. ఇప్పటికే రూ.75 కోట్ల గ్రాస్‌ను ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే వసూలు చేసింది. కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇప్పటికే ఇదే అత్యధికం’ అన్నారు. 


నిర్మాత కేఆర్‌ మాట్లాడుతూ.. ‘కమల్‌ హాసన్‌ శ్వాస, ఊపిరి, ప్రసరించే రక్తం సినిమా. ఆయన ఒక్క మెట్టు దిగితే ఎలా ఉంటుందో ‘విక్రమ్‌’ రుజువు చేసింది. తమిళ చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టుకు చేర్చింది’ అన్నారు. మరో నిర్మాత అన్బుచెళియన్‌ మాట్లాడుతూ..‘ఇటీవలి కాలంలో పర భాషల హీరోల చిత్రాలు తమిళంలో వరుసగా సంచలన విజయాలు సాధించడంతో కోలీవుడ్‌ పనైపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ‘విక్రమ్‌’ సక్సెస్‌ సరైన సమాధానం’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ.. ‘విక్రమ్‌ వంటి చిత్రంలో పనిచేసే అవకాశం ఇవ్వడమే నాకు కమల్‌ ఇచ్చిన పెద్ద బహుమతి’ అన్నారు. 

Updated Date - 2022-06-19T19:31:37+05:30 IST

Read more