‘వజ్రాలదొంగ’: చిరంజీవి, శ్రీదేవి సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

ABN , First Publish Date - 2022-06-13T23:49:14+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi), అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi)... ఇద్దరూ పరిశ్రమలో ఎవరి సపోర్ట్‌ లేకుండా ఎదిగి, శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. నిర్మాతలుగా మారడం వీరిద్దరిలో కామన్‌గా కనిపించే పాయింట్‌. అయితే చిరంజీవి..

‘వజ్రాలదొంగ’: చిరంజీవి, శ్రీదేవి సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi), అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi)... ఇద్దరూ పరిశ్రమలో ఎవరి సపోర్ట్‌ లేకుండా ఎదిగి, శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. నిర్మాతలుగా మారడం వీరిద్దరిలో కామన్‌గా కనిపించే పాయింట్‌. అయితే చిరంజీవి నిర్మాతగా కొనసాగారు కానీ.. తన తొలి సినిమా ఆగిపోవడంతో ఆమె మళ్లీ నిర్మాణం వైపు తొంగి చూడలేదు. చిరంజీవి హీరోగా ఆమె తన సొంత సినిమాను ప్రారంభించారు. తను అభిమానించే దర్శకుడు కోదండరామిరెడ్డి(Kodandarami Reddy)కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తన చెల్లెలు శ్రీలత (Srilatha) నిర్మాతగా లతా ప్రొడక్షన్స్‌ (Latha Productions) బేనర్‌పై ఈ చిత్రాన్ని ప్రారంభించారు శ్రీదేవి. బప్పిలహరి (Bappi Lahiri) సంగీత సారథ్యంలో  ముంబైలో పాటలు రికార్డ్‌ చేశారు. రికార్డింగ్‌ సమయంలో తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు శ్రీదేవి. ఎప్పుడు ఎలా కలెక్ట్‌ చేశారో తెలీదు కానీ ఆమె దగ్గర బోలెడంత మ్యూజిక్‌ కలెక్షన్‌ ఉంది. అవన్నీ బప్పిలహరికి వినిపించి పాటలను రికార్డ్‌ చేయించుకున్నారు శ్రీదేవి. ఈ సినిమాకు ‘వజ్రాలదొంగ’ (Vajrala Donga) అని అనుకున్నారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. 


మణిరత్నం (Mani Ratnam) ‘మౌనరాగం’ (Mounaragam)లోని ఫ్లాష్‌బ్యాక్‌ స్ఫూర్తితో ‘వజ్రాల దొంగ’ కథ రెడీ చేశారు రచయిత  యండమూరి వీరేంద్రనాథ్‌ (Yandamuri Veerendranath). చెన్నైలో సెట్‌ వేసి ఓ పాట చిత్రీకరించారు. అప్పటికే సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. సాధారణంగా బయ్యర్స్‌ ఎప్పుడూ దర్శకుడు కోదండరామిరెడ్డి  దగ్గరకి వచ్చి ‘సినిమా మాకు ఇప్పించండి’ అని అడగలేదు. కానీ ఈ  సినిమాకు చాలామంది పోటీపడ్డారు. ఆయన దగ్గరకు వచ్చి రికమండ్‌ చేయమనే వారు. సినిమా క్రేజ్‌ చూసి కోదండరామిరెడ్డికి  డౌట్‌ వచ్చింది. వెంటనే  శ్రీదేవి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా... నాకెందుకో మనం ఇప్పుడు చేస్తున్న సబ్జెక్ట్‌, అంచనాలను అందుకుంటుందా? లేదా? అనే చిన్న డౌట్‌ ఉంది. ఏం చేద్దాం?’ అని అడిగారు. ‘సాంగ్స్‌  బాగున్నాయి. సబ్జెక్ట్‌ గురించి నాకు పెద్దగా తెలీదు. పోనీ  కొన్నాళ్ళు ఆపేసి, వేరే మంచి కథతో సినిమా చేద్దాం. లేదంటే ఇదే కథను ఇంకా బాగా చేసే అవకాశం ఉందేమో చూడండి’ అని శ్రీదేవి చెప్పారు. ఆ తర్వాత చాలామంది రచయితలతో కూర్చుని కథపై కసరత్తులు చేశారు అయినా సంతృప్తికరంగా రావడంలేదు. ‘మిస్టర్‌ ఇండియా’ (Mister India)ను తెలుగులో రీమేక్‌ చేద్దామా? అని శ్రీదేవి అడిగారు.  చిరంజీవిగారు కూడా ఆ సినిమా  చూశారు. పెద్దగా నచ్చలేదు. లెంగ్త్‌ ఎక్కువని భావించారు. చివరకు చిరంజీవి, శ్రీదేవి ఇమేజ్‌కు తగ్గ కథ దొరకక.. ఈ చిత్ర నిర్మాణం ఆపేశారు.

-వినాయకరావు

Updated Date - 2022-06-13T23:49:14+05:30 IST