TG Kamala Devi: విలక్షణ నటి.. బిలియర్డ్స్ ఛాంపియన్

ABN , First Publish Date - 2022-12-29T19:55:39+05:30 IST

అలనాటి సినీ నటి, సినీగాయని, డబ్బింగ్ కళాకారిణి, రంగస్థల నటి, రేడియో ఆర్టిస్ట్, బిలియర్డ్స్ ఛాంపియన్ టి.జి కమలా దేవి (TG Kamala Devi) జయంతి సందర్భంగా..

TG Kamala Devi: విలక్షణ నటి.. బిలియర్డ్స్ ఛాంపియన్
TG Kamala Devi

అలనాటి సినీ నటి, సినీగాయని, డబ్బింగ్ కళాకారిణి, రంగస్థల నటి, రేడియో ఆర్టిస్ట్, బిలియర్డ్స్ ఛాంపియన్ టి.జి కమలా దేవి (TG Kamala Devi) జయంతి నేడు. 29 డిసెంబర్ 1930లో జన్మించిన ఆమె తెలుగు, తమిళ సినిమాలకు సంబంధించి ఎన్నో పాత్రలను పోషించారు. సింగర్‌గా ఆమెకు ‘తేనె గొంతుక’ అని పేరు. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు తోట గోవిందమ్మ (Thota Govindamma). టి.జి అంటే అదే. ఆమె సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత కమలా దేవి (Kamala Devi)గా పేరు మార్చుకున్నారు. టి.జి అంటే ‘తేనె గొంతుక’ అని కూడా అర్థం. ఆమె గొంతు నుంచి జాలువారిన పాటలు అప్పుడు, ఇప్పుడు.. ఎప్పటికీ అభినందించదగినవిగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆమెను ‘నాటక కళా ప్రపూర్ణ’ (Nataka Kala Prapoorna) బిరుదుతో సత్కరించింది.

ఈ పురుషాధిక్య చలనచిత్ర పరిశ్రమలో నటిగా తమని తాము నిరూపించుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. కన్నాంబ, అంజలీదేవి, కృష్ణవేణి, భానుమతి రామకృష్ణ వంటి వారు నిర్మాతలగానూ తమదైన ముద్రవేశారు. ఆ సమయంలోనే.. వాళ్లంత స్థాయిలో కథానాయికగా కాకపోయినా.. విలక్షణ నటనతో, విలక్షణ పాత్రలలో నటిస్తూ.. నటిగా, గాయనిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు టి.జి. కమలా దేవి. ‘దక్షయజ్ఞం, బాలనాగమ్మ, ముగ్గురు మరాఠీలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళ భైరవి, పల్లెటూరు, ఇల్లరికం, వెలుగు నీడలు’ వంటి ఎన్నో చిత్రాలలో ఆమె విలక్షణమైన పాత్రలలో నటించారు.

ఆమెని కమలా చంద్రబాబు (Kamala Chandrababu) అని కూడా పిలిచేవారు. కమలా దేవి భర్త పేరు ఆవుల చంద్రబాబు. కమలా చంద్రబాబు అనే పేరు క్రీడారంగంలో ఆమెకు గుర్తింపు తెచ్చిన పేరు. ఆ సమయంలో ఏ భారతీయ మహిళా ప్రవేశించని రంగం బిలియర్డ్స్ క్రీడా రంగం. ఈ రంగంలో ఆమె ప్రవేశించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. రెండు సార్లు ఆమె భారత జాతీయ మహిళా బిలియర్డ్స్ (Indian National Billiards Women) టైటిల్‌ను గెలుచుకున్నారు. భారతదేశంలోని క్యూ స్పోర్ట్ ప్లేయర్లలో పేరొందిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 1954లో ఆంధ్ర మహాసభ ఆహ్వానం మేరకు చెన్నై వచ్చిన అప్పటి స్నూకర్ ప్రపంచ ఛాంపియన్ హోరేస్ లిండ్రమ్‌తో కమలా దేవి తలపడింది. ఆ తర్వాత అనతి కాలంలోనే కమలా దేవి రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఛాంపియన్‌గా మారింది. అలాగే అప్పటి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ బాబ్ మార్షల్‌తో కలిసి బెంగుళూరు మరియు మైసూర్‌లలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడే ఏకైక అవకాశం ఆమెను వరించింది. 62 సంవత్సరాల వయసులో ఒకసారి, 66 సంవత్సరాల వయసులో మరోసారి ఆమె బిలియర్డ్స్ నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. అనారోగ్య సమస్యలతో 16 ఆగస్ట్ 2012వ సంవత్సరంలో చెన్నైలో ఆమె మృతి చెందారు.

Updated Date - 2022-12-29T20:09:03+05:30 IST