NTR-Bhanumathi: ఇద్దరూ ఇద్దరే!

ABN , First Publish Date - 2022-11-09T22:40:16+05:30 IST

మినర్వా పిక్చర్స్ వారి ‘సారంగధర’ (Sarangadhara) (01-11-1957) లోని స్టిల్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన యీ చిత్రంలో కథానాయకుడైన సారంగధరుడి

NTR-Bhanumathi: ఇద్దరూ ఇద్దరే!

మినర్వా పిక్చర్స్ వారి ‘సారంగధర’ (Sarangadhara) (01-11-1957) లోని స్టిల్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన యీ చిత్రంలో కథానాయకుడైన సారంగధరుడి పాత్రను తెలుగులో ఎన్‌.టి.రామారావు (NT Ramarao), తమిళంలో శివాజీగణేశన్‌ (Sivaji Ganesan) పోషించారు. ఈ చిత్రకథ ఒక మూడుముక్కలాటలా ఉంటుంది. కొడుకుకు యిచ్చి పెళ్లి చేయాలనుకున్న అమ్మాయిని తండ్రి పెళ్లాడతాడు. ఆ అమ్మాయేమో ఆ తండ్రి కొడుకును మోహిస్తుంది. ఆ కొడుకేమో మరో అమ్మాయితో అది వరకే ప్రేమలో ఉంటాడు. ఇలా ప్రేమ విషయంలో జరిగిన గందరగోళం కథానాయకుడి జీవితంలో ఎంత అలజడి సృష్టిస్తుందో తెలియజేసేదే సినిమా కథ అంతా!


ఈ చిత్రానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘రాజరాజు’ (RajaRaju) నాటకం ఆధారం. కనకాంగి (రాజసులోచన)తో సారంగధరుడి ప్రణయగీతం ‘అన్నానా! భామినీ!’ పాట ఆల్‌ టైం సూపర్‌ హిట్‌గా నిలిచిపోయింది. మనసులో అనుకున్నదంతా ఓ వైపు తెలియజేస్తూనే, మరోవైపు ‘ఆదమరచి ఎపుడైనా అన్నానా?’; ‘మాట వరసకెపుడైనా అన్నానా?’ అని చిలిపిగా తప్పించుకుంటూ ఎదుటివారిని ఆట పట్టించే ఈ పాటలో అన్నగారి చిలిపినటన అపూర్వం.


ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ మరో ముఖ్య విషయం పావురాల నెపంతో సారంగధరుడిని, తన అంతఃపురానికి రప్పించుకుటుంది చిత్రాంగి (పి.భానుమతి). ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగే వాగ్వివాదం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. భానుమతి (Bhanumathi) - ఎన్‌.టి.రామారావు లిద్దరూ పోటీపడి నటించారు.

- డా. కంపల్లె రవిచంద్రన్‌ 

98487 20478.





Updated Date - 2022-11-09T22:40:16+05:30 IST