Pic story Jayasimha: కంటతడి పెట్టించింది

ABN , First Publish Date - 2022-10-02T21:47:14+05:30 IST

నేషనల్‌ ఆర్టు థియేటర్‌ వారి ‘జయసింహ’లోని స్టిల్‌ ఇది. ఎన్‌.టి.రామారావు అంతకు ముందు తీసిన రెండు చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో జానపదం వైపు దృష్టి సారించి దీన్ని నిర్మించారు.

Pic story Jayasimha: కంటతడి పెట్టించింది

నేషనల్‌ ఆర్టు థియేటర్‌ వారి ‘జయసింహ’(Jaya simha)లోని స్టిల్‌ ఇది. ఎన్‌.టి.రామారావు (N.T.Ramarao)అంతకు ముందు తీసిన రెండు చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో జానపదం వైపు దృష్టి సారించి దీన్ని నిర్మించారు. అంజలీదేవి, ఎస్‌.వి.రంగారావు(S.V.Rangarao), రేలంగి, గుమ్మడి వంటి భారీ తారాగణంతో (21-10-1955) విడుదలైంది. తర్వాత కాలంలో ఉత్తరాదిలో ప్రఖ్యాతి గాంచిన వహీదా రెహమాన్‌ ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌.కు జోడీగా నటించడం విశేషం.  

పువ్వులాంటి వహీదా అందంతో పాటు అంజలి, రామారావుల నటనా నైపుణ్యంతో ఈ చిత్రం రాణించింది. ముఖ్యంగా జయసింహుడు (ఎన్‌.టి.ఆర్‌) రాజ్యం విడిచి వెళ్తూ తనను అతిగారాబంగా పెంచిన పినతల్లి (ఋష్యేంద్రమణి) పాదాల దగ్గర కూర్చుని ‘‘కన్నతల్లి కరవైన ఈ దురుదృష్టవంతుడికి ఆ కొరత తీర్చిన నీ మాంగల్యానికే చిచ్చుపెట్టడానికి.. ఆవేశంలో చిన్నాన్న మీద కత్తి దూశాను. క్షమించు తల్లీ!’’ అంటూ బాధపడే సన్నివేశం ప్రేక్షకుల గుండెను బరువెక్కిస్తుంది. 

‘జయసింహ’ ఎన్‌.ఏ.టి.వారి అంచనాలకు మించి విజయం సాధించింది. ఆంధ్రాలో 17 కేంద్రాలతో పాటు, బెంగుళూరులో కూడా అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. తర్వాత ‘జయసింహన్‌’ పేరుతో తమిళంలో డబ్‌ చేసి విడుదల చేశారు. ‘జయసింహ’ ఎన్‌.ఏ.టి.వారి తొలి శతదినోత్సవ చిత్రంగా నిలిచిపోయింది. మంత్రతంత్రాలు లేకుండా విజయకేతనం ఎగురవేసిన తొలి జానపద సినిమా ‘జయసింహ.’

- డా. కంపల్లె రవిచంద్రన్‌ 

98487 20478

Updated Date - 2022-10-02T21:47:14+05:30 IST