రామానాయుడు తొలి మల్టీస్టారర్‌

ABN , First Publish Date - 2022-03-27T05:30:00+05:30 IST

సమాన స్థాయి కలిగిన ఇద్దరు అగ్ర కథానాయకుల కలయికలో మూవీ మొఘల్‌ రామానాయుడు నిర్మించిన తొలి మల్టీస్టారర్‌ ‘మండే గుండెలు’. సురేశ్‌ సంస్థలో హీరో...

రామానాయుడు తొలి మల్టీస్టారర్‌

సమాన స్థాయి కలిగిన ఇద్దరు అగ్ర కథానాయకుల కలయికలో మూవీ మొఘల్‌ రామానాయుడు నిర్మించిన తొలి మల్టీస్టారర్‌ ‘మండే గుండెలు’. సురేశ్‌ సంస్థలో హీరో కృష్ణకు ఇది నాలుగో సినిమా. శోభన్‌బాబుకు ఆరో చిత్రం. వీరిద్దరూ కలసి నటించిన ఏడో సినిమా. ఈ ఇద్దరు హీరోలకు తోడుగా మరో హీరో చంద్రమోహన్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురు హీరోల సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు.. జయప్రద, జయసుధ, మాధవి నటించారు. ‘మండే గుండెలు’ చిత్రంతోనే జయప్రద సురేశ్‌ సంస్థలోకి అడుగుపెట్టారు.


ఇక జయసుధకు ఆ సంస్థలో ఇది మూడో చిత్రం. ‘సోగ్గాడు’ సినిమాతో తన సత్తా చాటిన దర్శకుడు కె.బాపయ్య ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి దర్శకత్వం వహించి, మరో విజయాన్ని రామానాయుడు ఖాతాలో జమ చేశారు. మాస్‌ హీరోగా కృష్ణకు, క్లాస్‌ హీరోగా శోభన్‌బాబుకు ఉన్న ఇమేజ్‌, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని తమిళ రచయిత గుహనాథన్‌ ఈ చిత్రకథ తయారు చేశారు. లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌, కామెడీ, రివెంజ్‌ అంశాలతో చిత్రకథ తయారైంది. దీనికి తన మాటల చమత్కారం జోడించారు రచయిత జంధ్యాల. మరో విషయం ఏమిటంటే చాలా కాలం తర్వాత ఒక సినిమాలోని అన్ని పాటలూ రాసే అవకాశం ఆచార్య ఆత్రేయకు రావడం. ‘మండే గుండెలు’ చిత్రంలో ఆత్రేయ రాసిన పాటలకు మామ మహదేవన్‌ క్యాచీ ట్యూన్స్‌ ఇచ్చారు. 1979 అక్టోబర్‌ 5న విడుదలైన ‘మండే గుండెలు’ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్‌లో వంద  రోజులు ఆడింది.Updated Date - 2022-03-27T05:30:00+05:30 IST