హీరో కృష్ణకు తన మీద అంత నమ్మకం !
ABN , First Publish Date - 2022-02-13T05:30:00+05:30 IST
చెన్నైలోని శివాజీ గార్డెన్స్‌లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న

చెన్నైలోని శివాజీ గార్డెన్స్‌లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘దొంగోడొచ్చాడు’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందులో కృష్ణ హీరో. ఆయన మీద ఒక పాట తీస్తున్నారు. అదే లొకేషన్‌లో మెగాస్ఠార్ చిరంజీవి చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. హీరో కృష్ణ అక్కడే ఉన్నారని తెలియగానే మర్యాదపూర్వకంగా ఆయన్ని కలవడానికి చిరంజీవి ‘దొంగోడొచ్చాడు’ షూటింగ్‌కు వచ్చారు. ఆయన్ని చూడగానే కోడి రామకృష్ణలో టెన్షన్ మొదలైంది. పెద్ద డాన్స్ మూమెంట్ పెట్టాడు డాన్స్ డైరెక్టర్.
డాన్స్‌లో చిరంజీవి మాస్టర్ కనుక పాట తీస్తున్నప్పుడు ఆయన అక్కడే ఉంటే హీరో కృష్ణ ఏమన్నా ఇబ్బందిగా ఫీలవుతారేమోనని చిరంజీవి వెళ్లిన తర్వాత షాట్ తీద్దామని ఆగారు కోడి రామకృష్ణ. కాసేపు మాట్లాడిన తర్వాత చిరంజీవి వెళ్లిపోతారని అనుకున్నారు కానీ ఆయన వెళ్లలేదు. ఓ షాట్ చూసి వెళ్దామని చిరంజీవి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కృష్ణ గ్రహించలేదు. కోడి రామకృష్ణను పిలిచి. ‘ఏమిటీ షాట్ తియ్యరా?’ అని అడిగారు. ‘తీద్దాం సార్’ అన్నారే తప్ప తీసే ప్రయత్నం చేయలేదు. అప్పుడు కోడి రామకృష్ణ పడుతున్న ఇబ్బందిని హీరో కృష్ణ గమనించి ‘ఏం పరవాలేదు షాట్ తీద్దాం’ అని కుర్చీలోంచి లేచి కెమెరా ముందు నిలబడ్డారు. అంత పెద్ద డాన్స్ మూమెంట్‌నీ ఆయన ఏ మాత్రం తడబాటు లేకుండా సింగిల్ టేక్‌లో చేసేశారు.
తెల్లబోవడం చిరంజీవి వంతయింది. ఆయన కృష్ణ దగ్గరికి వెళ్లి అభినందిస్తూ ‘సార్ మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఇంత పెద్ద మూమెంట్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అవలీలగా చేసేశారు’ అని అభినందించారు. తన టాలెంట్ మీద, తన మీద అంత నమ్మకం హీరో కృష్ణకు. అదే ఆయనకు శ్రీరామరక్ష గా నిలిచింది.