సుమక్క పంచాయితీ

ABN , First Publish Date - 2022-05-01T05:30:00+05:30 IST

మాటల మూట సుమ!మైకు లేకపోయినా ఆమె కంఠం టంగుమంటుంది. అయితే ఆ మాటల్లో ఓ మెరుపు ఉంటుంది.

సుమక్క పంచాయితీ

మాటల మూట సుమ!మైకు లేకపోయినా ఆమె కంఠం టంగుమంటుంది. అయితే ఆ మాటల్లో ఓ మెరుపు ఉంటుంది.ఆ పలుకులో ఓ ఛమక్కు కనిపిస్తుంది.ఏ టీవీ ఛానల్‌ తిప్పినా తనే.ఏ సినిమా పోగ్రామ్‌ చూసినా తన మాటే.మనకు తెలియకుండానే సుమ మనింటి మనిషైపోయింది. అలాంటి సుమ- జయమ్మగా మారిపోయి పంచాయితీ చేస్తే? అది ‘జయమ్మ పంచాయితీ’ అవుతుంది.  చాలాకాలం తరువాత వెండితెరమీద పూర్తి స్థాయి పాత్రలో జయమ్మగా మన ముందుకొస్తున్న సుమను.. ఆమె భర్త రాజీవ్‌ను ‘నవ్య’ పలకరించింది. అప్పుడు సుమక్కతో జరిపిన పంచాయితీ ఎలా సాగిందంటే.. 


బయటకు వెళ్లినప్పుడు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే ఏం అనిపిస్తుంది?

సుమ: ఏళ్ల తరబడి ప్రతి రోజూ బుల్లితెరపై నన్ను చూస్తున్నారు. తమ ఇంట్లో మనిషిలా అనుకుంటారో ఏమో... నామీద చాలా ప్రేమ చూపిస్తారు. బయటకు వెళ్లినప్పుడు చుట్టూ మూగిపోతారు.  

చిన్న పిల్లలు కూడా ‘సుమక్క, ఆంటీ’ అంటూ మాటలు కలుపుతారు. పిల్లలతో బయటకు వెళ్లిన ప్పుడు వాళ్లు ఇబ్బందిపడేవారు. కానీ తర్వాత అలవాటైపోయింది. 


కెరీర్‌ వల్ల వ్యక్తిగత జీవితంలోని సంతోషాలు మిస్సయ్యారా?

రాజీవ్‌: ‘లక్కు కిక్కు’ షోకి నేను ప్రొడ్యూసర్‌ని. ఆ సమయంలో మా మామగారు చనిపోయారు. అయినా అత్యవసరం కావడంతో చనిపోయిన మూడో రోజుకే షూటింగ్‌ చేయాలి రమ్మంటే వచ్చింది. 

సుమ: నాన్న చనిపోయిన రోజు అమ్మ ఒక్కరే కేరళలో ఉన్నారు. నాకు తోడబుట్టినవాళ్లు లేరు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఆ బాధను పక్కనపెట్టి, మంచి ఎంటర్టైన్‌మెంట్‌తో నాలుగు ఎపిసోడ్స్‌ షూటింగ్‌ చేశాం. షో చేస్తున్నప్పుడు నాకు ఒక్క సెకన్‌ కూడా నాన్న గుర్తురాలేదు. ఎప్పుడైనా అంతే... షో స్టార్ట్‌ చేశానంటే ఇక గతం, భవిష్యత్‌ ఏవీ గుర్తుకు రాదు. ఆ క్షణంలోనే ఉండిపోతాను.


ఒక పాత్రలో నటించాక ఆ ప్రభావం నుంచి బయటకు రావడానికి ఎంతసేపు పడుతుంది?

సుమ: ఇప్పటిదాకా నేను ఎక్కువగా యాంకర్‌గానే చేశాను కాబట్టి అలాంటి ఇబ్బంది రాలేదు. 

రాజీవ్‌: ‘లవ్‌స్టోరి’లో పాత్ర చేసేటప్పుడు మాత్రం ‘ఇలా ఉందేంటి’ అని చాలా ఫీలయ్యాను.. ‘బయట ఇంకా దారుణంగా జరుగుతాయి. ఇది చాలా నయం’ అని శేఖర్‌ కమ్ముల గారు అన్నారు. 

సుమ: నేను ఒక మొట్టికాయ వేశానంటే ఆయన క్షణంలో మామూలుగా అయిపోతారు.


పిల్లలు మీమీద కోప్పడిన సందర్భాలు ఉన్నాయా?

సుమ: మా అబ్బాయి చిన్నతనంలో నామీద చాలా కోప్పడేవాడు. బయటకు వెళ్లిన ప్పుడు అభిమానులు ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్లమీద గట్టిగా అరిచేవాడు. ‘ఆది’ సినిమా చూసి ‘అమ్మతోడు వేసేస్తా’ లాంటి డైలాగ్‌లు చెప్పేవాడు. తర్వాత మారాడు. ఒక సందర్భంలో నేను షూటింగ్స్‌తో  రెండు రోజులు నా కూతురుకి కనిపించలేదు. తను ఫోన్‌ చేసి ‘నేను నిన్ను టీవీలోనే చూడాలా?’ అని అడిగింది. నా గుండె పిండేసినట్టయింది. అప్పుడే పిల్లల కోసం సమయం ఇవ్వాలని కొంచెం కొంచెంగా పని తగ్గించుకుంటూ వచ్చాను. 

రాజీవ్‌: అమ్మో... గడుసుదండోయి.. అంతా పక్కాగా ప్లాన్‌ చేస్తుంది. 

సుమ: కొన్ని శాఖలపైన లోతైన పరిజ్ఞానం ఉంది తనకు. మంచి అడ్మిస్ట్రేటర్‌, డైరెక్టర్‌ కూడా. అప్పట్లో ‘రుతురాగాలు’ సీరియల్‌లో నటిస్తూ, కొన్ని భాగాలు తెరకెక్కించారు.

రాజీవ్‌: నా చిన్నప్పుడు ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేశాను. అన్నం వడ్డించేవాళ్లం. కార్పెంటరీ వర్క్‌ కొంత నేర్చుకున్నాను. ఔట్‌డోర్‌లో లైటింగ్‌ యూనిట్‌ హ్యాండిల్‌ చేశాను. ఆ తర్వాత ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేశాను. ఆ తర్వాత యాక్టింగ్‌, డైరెక్షన్‌ వైపు వచ్చాను. 

సుమ: ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఏమీ తెలియదు. రావడం, చేయడం అన్నీ ఒకేసారి జరిగిపోయింది. 


మీ మధ్య సినిమాల ప్రస్తావన వస్తుందా?

రాజీవ్‌: మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం. నేను కావాలని ‘‘‘ప్రోగ్రాంకు ఎవరు వచ్చారు, ఏం జరిగింది?’’ అని అడుగుతాను. ‘మళ్లీ ఏం చెపుతాం?’ అన్నట్లు తను పైపైన ఏదో చెబుతుంది. 


యాంకర్‌గా ఎన్నో రకాల విషయాలను గుర్తుంచుకోవడం కష్టంగా అనిపించదా?

సుమ: పొద్దున్నే టీవీ ప్రోగ్రాం చేసి, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తాను. అక్కడ 12 మంది స్పాన్సర్ల పేర్లు ఉంటాయి. అవన్నీ గుర్తుంచుకోవాలంటే ప్రోగ్రాం అయిపోయాక ఆ విషయాలు అక్కడితో మర్చిపోవాలి. అందుకే నా బ్రెయిన్‌ ఎప్పటికప్పుడు పాత విషయాలను డిలీట్‌ కొట్టేస్తుంది. కొత్త విషయాలను మాత్రమే గుర్తుంచుకుంటాను. 


మీ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్‌తో మర్చిపోలేని అనుభ వాలు ఏవైనా...

సుమ: పార్టిసిపెంట్‌ కాదు గానీ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్‌ నాకిష్టం. బాలు గారు వెళ్లిపోయాక ‘స్వరాభిషేకం’ కూడా మానేశాను. ఒక పాట పాడాక... దాని వెనుక ఉన్న చరిత్రను బాలు గారు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు అరుదు. ఇంకా చిత్రగారు,  ఏసుదాసుగారు, బాలమురళీకృష్ణగారు లాంటి దిగ్గజాల మధ్య.. వ్యాఖ్యాతగా పని చేయడం నేను  ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం 72 ఎపిసోడ్లు చేశాను. అదో తీపి జ్ఞాపకం. ఆయన ఎంత గొప్పవారంటే ‘‘సుమకు ఖాళీ ఉన్నప్పుడే ప్రోగ్రాం పెట్టుకుందాంలే.. నేను ఇప్పుడు ఖాళీగానే  ఉన్నాను కదా’’ అనేవారు.  ‘‘నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావు. ఫర్వాలేదు. నీకు ఎప్పుడు ఖాళీ ఉందో డేట్‌ చెప్పు’’ అనేవారు. 


టీవీ షోల షూటింగ్‌కు ఎక్కువ టైమ్‌ పడుతుంది కదా?

సుమ: నా ప్రోగ్రాంకు ఫస్ట్‌కట్‌, ఫైనల్‌ కట్‌ ఒకటే. నేను మా ఎడిటర్లకు చాలా తక్కువ శ్రమ ఇస్తాను. ఎడిటింగ్‌లో తీసేయాల్సినవి అన్నీ నేనే ముందు తీసేస్తాను. అవసరమైన ఫుటేజి మాత్రమే వాళ్లకు ఇస్తాను. 

రాజీవ్‌: ఈవిడ షూటింగ్‌ ఉంటే వాళ్లంతా హ్యాపీ. టెక్నీషియన్స్‌ అంతా త్వరగా ఇంటికెళ్లిపోవచ్చని అనుకుంటారు. 


యాంకర్‌గా తిరుగులేని మీకు సినిమా షూటింగ్‌లో ఇబ్బందిగా అనిపించిందా?

సుమ: మా డైరెక్టర్‌ ఓ పట్టాన దేన్నీ ఒప్పుకోరు. శ్రీకాకుళం యాసలో డైలాగులు చెప్పడం నాకు అదే తొలిసారి. పైగా సింక్‌ సౌండ్‌. ఎంత చేసినా ఆఖరులో ‘ఇంకొంచెం గ్రేస్‌’ అనేవారు. ‘‘గ్రేస్‌ అంటే ఎలా ఉంటుందో చూపించండి’’ అని నేను సరదాగా అడిగా. అప్పటి నుంచి అతను ‘గ్రేస్‌’ అనడం మానేశారు. ఎవరైనా ‘వన్‌మోర్‌’ అంటే నాకు బీభత్సమైన కోపం వస్తుంది. ‘వాట్‌ ఆర్‌ యూ టాకింగ్‌... నేను యాంకరింగ్‌ చేస్తుంటే అలా వెళ్లిపోతుంది’ అని మనసులో అనుకునేదాన్ని. అయినా డైరెక్టర్‌ చెప్పాక తప్పదు కాబట్టి మళ్లీ టేక్‌ చేశాను. 


మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ!

సుమ: మా ఆయనకు గతంలో నాకంటే ఎక్కువ కోపం వచ్చేది. అప్పట్లో ‘షార్ట్‌టెంపర్‌’ అని పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు చాలా కూల్‌ అయ్యారు. ప్రశాంతంగా ఉంటున్నారు. ఒకప్పుడు సినిమాకు వస్తానని చెప్పి రాకపోతే రెండు మూడు రోజులు అలిగేదాన్ని. ఇప్పుడు రానన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. 

రాజీవ్‌: ఆవిడది లాంగ్‌ టెంపర్‌. అమ్మో చాలా గడుసు. చాలా సాధిస్తుంది. మన వైపు నుంచి  ఏదైనా పొరపాటు జరిగితే సరెండర్‌ అవ్వాల్సిందే. ఈ సినిమా ట్రైలర్‌లో కుర్రాణ్ణి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లే సీన్‌ నాకు బాగా నచ్చింది. ‘ఇంట్లో కోపాన్ని అక్కడ చూపించిందా?’ అనిపించింది. 


మీరు మలయాళం కూడా ఇంతే బాగా మాట్లాడ గలరా?

సుమ: ఇక్కడ తెలంగాణ మాండలికంలానే మాది మలయాళంలో పాలక్కడ్‌ మాండలికం. ‘నువ్వు ఇప్పటికీ చక్కగా మలయాళం మాట్లాడతావు’ అని మా పెద్దనాన్న వాళ్లు అంటుంటారు. 


యాక్టర్స్‌గా మీలో ఎవరిని మీ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు?

సుమ: మేము ఎప్పుడూ పిల్లలను అడగలేదు. మా అమ్మాయి అసలు సినిమాలు చూడడం తక్కువ. ఇప్పుడిప్పుడే వాళ్ల నాన్నతో కొంచెం సినిమాల గురించి చర్చిస్తోంది. 


‘జయమ్మ...’ సినిమాలో కష్టంగా అనిపించిన సన్నివేశం?

సుమ: ఫస్ట్‌ పంచాయితీలో సుదర్ఘీమైన డైలాగ్‌ ఒకటి ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తయితే మాండలికంలో చెప్పడం మరో ఎత్తు. డబ్బింగ్‌ లేదు కాబట్టి డైలాగ్‌ చెప్పేటప్పుడు ఎలాంటి డిస్ట్రబెన్స్‌ రాకూడదు. నిజంగా అది సవాల్‌గా అనిపించింది. సినిమాలో సుమ కనిపించదు. జయమ్మ కనిపిస్తుంది. ‘ఎన్ని ఇబ్బందులు ఉన్నా జీవితంలో అనుకుంటే ఏదైనా సాధించవచ్చు’ అనే స్ఫూర్తిని ఇస్తుంది. ట్రైలర్‌ చూశాక ‘‘బాగా చేశావు. పైకొస్తావు’’ అని మా ఆయన సరదాగా మెచ్చుకోవడం నాకొక అచీవ్‌మెంట్‌. 

నెగిటివ్‌ కామెంట్లు వచ్చినప్పుడు నొచ్చుకుంటారా?

సుమ: సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్లు చూసినప్పుడు మనసు చివుక్కుమంటుంది. 


వస్త్రధారణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు?

సుమ: చీరలోనే నేను ఎక్కువ కంఫర్ట్‌గా ఉంటాను. ఆధునిక వస్త్రధారణ నేను ఇష్టపడను. 

రాజీవ్‌: ఎక్కువగా వంద రూపాయల టీషర్ట్‌ వేసుకుంటాను. ‘‘బయటకెళ్లేటప్పుడు కూడా ఇవేనా?’’ అని సుమ కసురుతుంది.


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఫొటోలు: అశోకుడు



ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్‌ నాకిష్టం. బాలు గారు వెళ్లిపోయాక ‘స్వరాభిషేకం’ కూడా మానేశాను. ఒక పాట పాడాక... దాని వెనుక ఉన్న చరిత్రను బాలు గారు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు అరుదు. 


కాపురం అన్నాక గిల్లికజ్జాలు, అలకలు సహజమే కదా? మీమధ్యన అలాంటివి..

సుమ: సడెన్‌గా మధ్యాహ్నం ఇంటికొచ్చి ‘‘నేనూ హీరోయిన్‌తో బయటకు వెళ్తున్నాను’’ అని చెబితే భార్యకు ఎలా ఉంటుంది? ‘‘భోజనానికి తీసుకెళితే తప్పేం ఉంది?’’ అని తను అనుకోవచ్చు. అది తన ఫీలింగ్‌, ఇది నాఫీలింగ్‌. రెండింటిలోనూ తప్పేం లేదనుకుంటాను. అయితే కొన్నేళ్లు గడిచాక ‘ఇంకెక్కడికి పోతాడులే’ అనే నమ్మకం బలపడింది. 

రాజీవ్‌: ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయికి కమాండింగ్‌ పవర్‌ ఉంటుంది. పెళ్లయ్యాక భార్య మీద భర్తకు ఎక్కువ అధికారం వస్తుంది. భార్య అంటే తన ప్రాపర్టీ అన్న ఫీలింగ్‌ వస్తుంది. పెళ్లైన కొత్తలో అసూయ, కోపం, అభద్ర తాభావం అన్నీ కలిగాయి. మా పెళ్లై 23 ఏళ్లు.  కొంతకాలానికి అన్నీ సద్దుమణిగాయి. 


రాజీవ్‌: ఆవిడది లాంగ్‌ టెంపర్‌. అమ్మో చాలా గడుసు. చాలా సాధిస్తుంది. మన వైపు నుంచి  ఏదైనా పొరపాటు జరిగితే సరెండర్‌ అవ్వాల్సిందే. ఈ సినిమా ట్రైలర్‌లో కుర్రాణ్ణి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లే సీన్‌ నాకు బాగా నచ్చింది. ‘ఇంట్లో కోపాన్ని అక్కడ చూపించిందా?’అనిపించింది. 

Updated Date - 2022-05-01T05:30:00+05:30 IST