తొలి అడుగులో తడబడ్డారు!

ABN , First Publish Date - 2022-09-04T08:58:55+05:30 IST

ఒక సినిమా ఫ్లాప్‌ అయితే సీనియర్‌ హీరో, హీరోయిన్లకు పెద్ద నష్టం ఏం ఉండదు.

తొలి అడుగులో తడబడ్డారు!

క సినిమా ఫ్లాప్‌ అయితే సీనియర్‌ హీరో, హీరోయిన్లకు పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ తొలి సినిమా ఆడకపోతే కొత్త హీరో, హీరోయిన్లకు పరిస్థితి కొంచెం కష్టమే. ఫెయిల్యూర్‌ ముద్ర పడితే కొత్త అవకాశాలు అంత తొందరగా రావు. అందులోనూ తెలుగు చిత్రపరిశ్రమకు సెంటిమెంట్లు ఎక్కువ. మొదటి సినిమా ఆడిందా లేదా, ఆడకపోతే కారణం ఎవరు? .. వంటివి పరిశీలించాకే అవకాశాలు ఇస్తుంటారు. టాలెంట్‌ను నమ్ముకున్న తారలు ఓకే కానీ కేవలం గ్లామర్‌ మీదే ఆధారపడిన హీరోయిన్లు మాత్రం బ్రేక్‌ వచ్చేవరకూ కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ ఏడాది తెలుగులో అరంగేట్రం చేసిన పలువురు పరభాషా కథానాయికలను అపజయాలే పలకరించాయి. చాలామంది టాలీవుడ్‌ హీరోయిన్లుగా తొలి అడుగులో తడబడ్డారు. 


చేజారిన అవకాశం

న్నో అంచనాల నడుమ ప్రేక్షకుల మధ్యకు వచ్చిన చిత్రం ‘లైగర్‌’. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విజయ్‌ దేవరకొండకు పాన్‌ ఇండియా హీరో ఆశలను గల్లంతు చేసింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం గాలివాటం అనే విమర్శలకు తన టేకింగ్‌తో దర్శకుడు పూరి జగన్నాథ్‌ మరింత బలం చేకూర్చారు. అంతేకాదు ‘లైగర్‌’ కథానాయికగా తన రాత మారుస్తుందనుకున్న అనన్యాపాండే ఆశలను అడియాసలు చేసింది. తెలుగు చిత్రాల హవా దేశమంతా కొనసాగుతున్న వేళ పాన్‌ ఇండియా కథానాయికగా ఎదగడానికి ‘లైగర్‌’ మంచి అవకాశం అనుకున్నారామె. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర తడబడింది. పాన్‌ ఇండియా  కాదు ఏకంగా అనన్య కెరీర్‌కు ఒక కుదుపునిచ్చింది. ‘అనన్య మంచి అందగత్తె’ అనిపించుకోవడం ఒక్కటే ‘లైగర్‌’తో ఆమెకు టాలీవుడ్‌లో దక్కిన ఊరట. 


బ్యాలెన్స్‌ అయింది

మరో బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా ఈ ఏడాది ఎంట్రీ  ఇచ్చారు. తొలి తెలుగు చిత్రం ‘గని’ ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అల్లు అరవింద్‌ తనయుడు బాబీ నిర్మించారు. ఏరీ కోరి  సయీ మంజ్రేకర్‌ని కథానాయికగా తెచ్చారు. సౌత్‌ సినిమాలు బాక్సాఫీసు దగ్గర  దున్నేస్తుండడంతో తన కెరీర్‌ కు ‘గని’ ఊతమిస్తుంది అని సయీ భావించారు. ఈ సినిమా హిట్టయితే మరిన్ని అవకాశాలు ఆమెకు దక్కేవేమో. కానీ ప్లాప్‌ అవడంతో పరిస్థితి మారిపోయి హీరోయిన్‌గా సయీ కెరీర్‌కు భారీ డ్యామేజి చేసిందనే చెప్పాలి. కాకపోతే అడివిశేష్‌ ‘మేజర్‌’ చిత్రం హిందీ, తెలుగులో మంచి టాక్‌ రావడంతో నయూ మంజ్రేకర్‌ కొంతలో కొంత బెటర్‌. 


ఆ మ్యాజిక్‌ మిస్సయింది

కథానాయికగా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. కానీ ఒక్క స్ట్రెయిట్‌ చిత్రం కూడా చేయకుండానే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కథానాయికగా ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగారు నజ్రియా నజీమ్‌. అందుకు కారణం ‘రాజారాణి’ చిత్రం. అందులో  కీర్తన పాత్రలో నజ్రియా పండించిన గడుసుతనం, చివరకు ఆ పాత్ర తీసుకున్న విషాదాంతమలుపు ఇన్నాళ్ల పాటు  ప్రేక్షకులకు ఆమెను గుర్తుండిపోయేలా చేసింది. ‘రాజా రాణి’ సినిమా విడుదలైనప్పటి నుంచే ఆమె తెలుగు సినిమా కోసం  ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం, హీరో ఫహద్‌ ఫాజిల్‌ తో పెళ్లి కావడంతో తెలుగులో నజ్రియా స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది నాని సరసన ‘అంటే సుందరానికి’తో తొలిసారి కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా ఫలితం తేడా కొట్టింది. నజ్రియాను ఈ సినిమాలో చూసి ప్రేక్షకులు నిట్టూర్పు విడిచారు. ‘రాజా రాణి’ సినిమా చే సి దాదాపు పదే ళ్లు కావొస్తోంది. ఆమెది వంక పెట్టడానికి వీల్లేని నటనే అయినా ముఖంలో కళ తగ్గింది. మునుపటి ఛార్మింగ్‌ కనిపించలేదు. ఆమె అసలు మళ్లీ మరో తెలుగు చిత్రం చే స్తారా అంటే ‘కచ్చితంగా’ అని చెప్పలేని పరిస్థితి. 


హిట్‌ పడింది కానీ...

‘భీమ్లానాయక్‌’గా పవన్‌కల్యాణ్‌ బాక్సాఫీసు దగ్గర వేట కొనసాగించారు అలవోకగా వంద కోట్ల వసూళ్లను అధిగమించాడు. ఈ చిత్ర ంతోనే మలయాళ హీరోయిన్‌ సంయుక్తామీనన్‌ తెలుగు అరంగేట్రం చేశారు. సినిమా హిట్టయినా ఆమెకు హీరోయిన్‌ స్థాయి గుర్తింపు, అవకాశాలు మాత్రం దక్కలేదు. కారణం రానాకు జోడీగా అంతగా ప్రాధాన్యంలేని పాత్ర చేయడమే. ఇటీవల వచ్చిన కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ కొంతమేర ఆ లోటును పూడ్చింది. ప్రస్తుతం విజయ్‌ సరసన ‘సార్‌’ అనే ద్విభాష చిత్రంలో సంయుక్త నటిస్తున్నారు.

 

ఐశ్వర్యకు అచ్చిరాలేదు

ఈ ఏడాది హీరోయిన్‌గా  తెలుగులో అదృష్టం పరీక్షించుకున్న మరో మలయాళ కథానాయిక ఐశ్వర్యాలక్ష్మి. తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలతో జోరుమీదున్న అమ్మడు తెలుగులోనూ సత్తా చాటుదామనకున్నారు. అయితే తొలి ప్రయత్నం ఆమెకు అంతగా అచ్చిరాలేదు. సత్యదేవ్‌ హీరోగా నటించిన ‘గాడ్సే’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించారు. సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టడంతో ఐశ్వర్యాలక్ష్మి గురించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇందులో హీరోయిన్‌ ఫీచర్స్‌ ఉన్న పాత్ర కాకపోవడంతో కనీసం ఒక వర్గం ప్రేక్షకులకు కూడా  చేరువకాలేకపోయారు. ఇప్పుడు ‘అమ్ము’ చిత్రంతో ఐశ్వర్య తెలుగులో మలి ప్రయత్నం చేస్తున్నారు. 


ఫ్లాప్‌తో మొదలుపెట్టారు

తెలుగు సినిమాల్లో సత్తా చాటాలనే ఆశ తో ఇంకా మరికొందరు పరభాషా తారలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. తొలి చిత్రంలోనే రవితేజ లాంటి అగ్రహీరో సరసన అవకాశం దక్కినా ఆశించిన హిట్‌ మాత్రం అందుకోలేకపోయారు రజిషా విజయన్‌. మలయాళ, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రజిషాకు ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రంలో  పేలవ ప్రదర్శనతో పేరు దక్కలేదు. విష్వక్‌సేన్‌ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రితికానాయక్‌. నటన పరంగా మంచి మార్కులు పడినా సినిమా కమర్షియల్‌గా విఫలమవడం రితికకు మైనస్‌ అయింది. తొలి, మలి రెండు చిత్రాలు నువేక్షకు హీరోయిన్‌గా సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పి.సి 524’, ఆది సాయికుమార్‌ ‘అతిథి దేవోభవ’ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. 

Updated Date - 2022-09-04T08:58:55+05:30 IST

Read more