బాలుగారు ముద్దు మందారం అనేవారు..
ABN , First Publish Date - 2022-03-27T05:39:20+05:30 IST
నా వాయి్‌సలో చిన్న జీర ఉంటుందని బాలుగారు తరచూ చెబుతుండేవారు. అలాగే ‘‘పి.సుశీలగారి తరహాలో గమకాలు అవలీలగా పలుకుతావు....

నా వాయి్‌సలో చిన్న జీర ఉంటుందని బాలుగారు తరచూ చెబుతుండేవారు. అలాగే ‘‘పి.సుశీలగారి తరహాలో గమకాలు అవలీలగా పలుకుతావు, మంచినీళ్లు తాగినట్లు పాడేస్తావు’’ అని చెప్పారు. నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవే. ఓ మనిషి ఎంత స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండడం ఎలా? అనేది బాలుగారి నుంచి నేర్చుకున్నా.
చిన్నప్పటి నుంచీ సంగీతమే లోకంగా... ఎన్నో వేదికల మీద తన ప్రతిభను ప్రదర్శించి... ప్రేక్షకుల మన్ననలను, ప్రముఖుల ప్రశంసలను అందుకుంటున్న వర్థమాన గాయని శ్రీలలిత భమిడిపాటి.తన సంగీత ప్రయాణం గురించి ‘నవ్య’తో ఆమె పంచుకున్న ముచ్చట్లివి...
‘‘మా నాన్న రాజశేఖర్ బ్యాంక్ ఉద్యోగి. అమ్మ సత్యవాణి గృహిణి. నేను పుట్టింది విజయవాడ. అమ్మ, నాన్న... ఇద్దరికీ కర్ణాటక శాస్ర్తీయ సంగీతం మీద పట్టుంది. అమ్మమ్మ, అమ్మ వాళ్ల అక్క చెల్లెళ్లు వీణ వయోలిన్, మృదంగం లెక్చరర్స్‌గా పని చేశారు. అలా మా కుటుంబంలో సంగీతం ఒక భాగం. అమ్మాయి పుడితే ఎలాగైనా గాయని చేయాలని చిన్నతనంలోనే అమ్మావాళ్లు అనుకున్నారట. స్టేజ్ ఫియర్ ఉండకూడదని ఎనిమిది నెలల వయసులోనే నన్ను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలకు తీసుకువెళ్లేవారు.
నాకు మూడున్నర ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్లాను. ఆ వేదికపై నన్ను ఒక రైమ్ చెప్పమన్నారు. నేను లింగాష్టకం పాడాను. అమ్మతో సహా వేదికపై ఉన్నవారంతా షాక్ అయ్యారు. సంగీతంలో నా మొదటి గురువులు మా అమ్మా, నాన్న. నాన్న సినిమా పాటలు... అమ్మ, అమ్మమ్మ శాస్ర్తీయ గీతాలు నేర్పించారు. ఆ తర్వాత మా అమ్మమ్మ సోదరి లంకా విజయలక్ష్మి గారి దగ్గర ఐదేళ్లు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. ప్రస్తుతం మోదుమూడి సుధాకర్‌గారి దగ్గర నేర్చుకుంటున్నా. త్యాగరాజ శిష్య పరంపరలో మా గురువు అయిదో తరం వారు.
అమ్మ నా వెన్నంటే...
ఆరేళ్ల వయసులో సరిగమప ‘లిటిల్ చాంప్స్’ (2008), ఆ తర్వాత ‘సంగీత మహాయుద్ధం’, ‘స్వరనీరాజనం’, ‘పాడుతా తీయగా’ ‘బోల్ బేబీ బోల్’, సూపర్ సింగర్స్, ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’... ఇలా చాలా షోల్లో పాడాను. ‘బోల్ బేబీ బోల్’లో రన్నర్‌గా, మెంటర్‌గా, రెండు సీజన్లకు యాంకర్‌గా చేశా.
తొమ్మిదేళ్ల వయసులో ‘పాడుతా తీయగా’ కోసం ప్రయత్నించా. అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత రెండేళ్లకు అవకాశం వచ్చింది. ఆ వేదికపై అడుగుపెట్టగానే ఎస్.పి.బాలు గారిని చూసి భయపడ్డాను. కానీ ఆయన పాడడానికి వచ్చిన పిల్లలందరినీ దగ్గరకు తీసుకొని, అన్నీ వివరించేవారు. బాలుగారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఆయన ముద్దుగా ‘ముద్దు మందారం’ అని పిలిచేవారు.. నా సంగీత ప్రయాణంలో మొదలైనప్పటి నుంచీ ప్రతి క్షణం అమ్మ నా వెన్నంటే ఉంది.
ఆ పాట కోసం నెల రోజులు...
శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఆల్బమ్స్, డివోషనల్ సాంగ్స్ పాడుతూ... నాలోని మరో టాలెంట్‌ను బయటపెట్టడానికి ‘యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. అందులో నాకు నచ్చిన పాటల్ని చేస్తుంటాను. నా వీడియో చూసి యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ వెళ్లలేదు. కోటిగారు పిలిచి తర్వాతి షోలో నువ్వే పాడాలని చెప్పారు. చాలా పెద్ద పాట అది. పాడటం కూడా చాలా కష్టం. నెల రోజులు ప్రాక్టీస్ చేసి పాడాను. ఆ రోజు కోటిగారు అభినందనలు మరచిపోలేను. సోనునిగమ్, శ్రేయా ఘోషల్గారు మెచ్చుకుని వీడియో షేర్ చేశారు.
సోషల్ అవేర్నెస్ కోసం...
పాటలు పాడడంతో పాటు సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ‘ఈశా ఫౌండేషన్’కు వాలంటీర్‌గా పని చేస్తున్నాను. ‘కావేరి కాలింగ్’, ‘సేవ్ సాయిల్’ కార్యక్రమాలకు ప్రచారం చేస్తుంటా. ఇప్పుడు డిప్లమో పూర్తయింది. బీఏ మ్యూజిక్ పూర్తయ్యాక పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. ఆ తరువాత ఇన్స్టిట్యూట్ ప్రారంభించి కర్ణాటక సంగీతం నేర్పించాలనుకుంటున్నా. ప్రస్తుతానికి నాకున్న లక్ష్యం ఇదే!
ఆలపాటి మధు