Sobhan Babu ‘మానవుడు-దానవుడు’ చిత్రానికి 50 ఏళ్లు

ABN , First Publish Date - 2022-06-23T02:02:32+05:30 IST

అంతవరకూ సాఫ్ట్‌ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న శోభన్‌బాబు నటజీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పి, కొత్త ఇమేజ్‌ ఏర్పరచి మాస్‌ ఆడియన్స్‌కి కూడా ఆయన్ని దగ్గర చేసిన చిత్రం ‘మానవుడు-దానవుడు’ (Manavudu Danavudu). బాపు (Bapu) దర్శకత్వంలో శోభన్‌బాబు (Sobhan Babu) నటించిన..

Sobhan Babu ‘మానవుడు-దానవుడు’ చిత్రానికి 50 ఏళ్లు

Manavudu Danavudu: అంతవరకూ సాఫ్ట్‌ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న శోభన్‌బాబు నటజీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పి, కొత్త ఇమేజ్‌ ఏర్పరచి మాస్‌ ఆడియన్స్‌కి కూడా ఆయన్ని దగ్గర చేసిన చిత్రం ‘మానవుడు-దానవుడు’ (Manavudu Danavudu).  బాపు (Bapu) దర్శకత్వంలో శోభన్‌బాబు (Sobhan Babu) నటించిన ‘సంపూర్ణ రామాయణం’ (Sampoorna Ramayanam) చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న రోజునే (1972 జూన్‌ 23) ‘మానవుడు-దానవుడు’ చిత్రం విడుదల కావడం ఓ విశేషం. ఈ  చిత్రం విడుదలై 2022, జూన్ 23కి సరిగ్గా 50 ఏళ్లు. ‘పసిడి మనసులు’, ‘విచిత్ర దాంపత్యం’ వంటి చిత్రాలను శోభన్‌బాబుతో నిర్మించిన ఉషశ్రీ పిక్చర్స్‌ అధినేత చిన్నపరెడ్డి ఆయనతో తీసిన మూడో సినిమా ‘మానవుడు-దానవుడు’. పి.చంద్రశేఖరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘అఖల్‌ అండ్‌ జేన్‌’ అనే ఆంగ్ల నవల స్పూర్తితో ఈ చిత్రకథను తయారు చేశారు. 


ఈ సినిమాలో డాక్టర్‌ వేణుగా, రౌడీ జగన్‌గా రెండు విభిన్నమైన పాత్రలను శోభన్‌బాబు పోషించారు. 14వ రీలుకి వచ్చేవరకూ శోభన్‌బాబు ద్విపాత్రాభినయం చేశారనే అనిపిస్తుంది. అయితే ఒకే వ్యక్తి సందర్భానుసారంగా ఇలా రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడన్నది పతాక సన్నివేశాల్లో మాత్రమే బయట పెట్టడం ఆ రోజుల్లో చాలా వెరైటీగా ఫీలయ్యారు ఆడియన్స్‌. తన అక్కకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి.. కానీ చేస్తున్నది డాక్టర్‌ వృత్తి. దెబ్బ తగిలితే ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టాలి కానీ.. తనే ఇతరుల్ని గాయపరచకూడదు. కానీ పగ తీర్చు కోవాలి.. ఎలా? అందుకే  డాక్టర్‌ వేణు దానవుడి అవతారం ఎత్తి జగన్‌ పేరుతో దుష్టశిక్షణ చేస్తుంటాడు. ఇటువంటి స్ప్లిట్‌ పర్సనాలిటీ గురించి తరువాతి కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ వాటికి మూలం ‘మానవుడు-దానవుడు’ చిత్రమే. ఈ చిత్రంలో శోభన్‌బాబు సరసన శారద నటించారు. 


తెలుగులో చిత్రం విజయం సాధించగానే శారద హక్కులు కొనుక్కుని మలయాళంలో నిర్మించారు. మధు, శారద జంటగా నటించారు. శోభన్‌బాబు అక్క పాత్రను కృష్ణకుమారి, ఆమెని మోసం చేసిన వ్యక్తిగా సత్యనారాయణ, తల్లిగా మాలతి, జగన్‌ అసిస్టెంట్‌గా రాజబాబు, పోలీస్‌ అధికారిగా అతిథి పాత్రలో కృష్ణంరాజు నటించారు. మరో విషయమేమిటంటే ఈ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన మోహనగాంధీ ‘కొప్పు చూడు కొప్పందం చూడు’ అనే పాటలో జ్యోతిలక్ష్మితో కలిసి నటించారు.  నిర్మాత చిన్నపరెడ్డి, ఏడిద నాగేశ్వరరావు మిత్రులు కావడంతో ఆయన ఈ చిత్రనిర్మాణంలో చురుకుగా పాల్గొవడమే కాదు ఓ వేషం కూడా వేశారు. 


20 రోజుల్లో ఆ పాట తీశారు

‘మానవుడు-దానవుడు’ చిత్రం కోసం నారాయణరెడ్డి రెండు అద్భుతమైన పాటలు రాశారు. అందులో ‘ఎవరు వీరు.. ఎవరు వీరు’ అంటూ వ్యభిచార గృహల్లో మగ్గుతున్న మహిళల గురించి రాసిన పాట ఒకటి. ఈ పాటను రోజుకి రెండు మూడు షాట్స్‌ చొప్పున 20 రోజుల పాటు తీయడం విశేషం. చెన్నైలోని ప్రసాద్‌ రికార్డింగ్‌ థియేటర్‌లో తొలిసారిగా రికార్డ్‌ చేసిన పాట ఇదే. సంగీత దర్శకుడు అశ్వద్ధామ స్వరపరిచిన ఈ పాటను బాలు అద్భుతంగా పాడారు. నేపథ్యంలో వచ్చే పాట ఇది. ‘అదేమిటి సార్‌.. ఇంత మంచి పాటను నేను పాడకుండా నేపథ్యగీతంలా చిత్రీకరిస్తారా’ అని శోభన్‌బాబు దర్శకుడు పి.సి.రెడ్డిని అడిగారు. ‘ఒక కొత్త స్కీమ్‌లో ఈ పాటను తీస్తున్నాం. పాట పాడుతూ ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తావో, లిప్‌ మూమెంట్‌ లేకుండా అటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలి’ అని చెప్పారు పి.సి.రెడ్డి. చాలా అద్భుతంగా నటించాడాయన. పాట చిత్రీకరణ పూర్తయ్యాక రష్‌ చూసి ఆయన చాలా సంతృప్తి చెంది, ‘మీరు చెప్పింది నిజమే రెడ్డిగారు.. లిప్‌ మూమెంట్‌ లేకుండానే పాట బాగా వచ్చింది’ అన్నారు. తమిళంలో ఈ సినిమాని నిర్మించినప్పుడు ఈ పాటలో శివాజీగణేశన్‌కు లిప్‌ మూమెంట్‌ పెట్టారు. అది అక్కడి ప్రేక్షకులకు రుచించలేదు. అలాగే  శోభన్‌బాబుపై చిత్రీకరించిన ‘అణువు అణువున వెలసిన దేవా ... కను వెలుగై మము నడిపించరావా’ పాటను కూడా నారాయణరెడ్డి రాశారు. ఈనాటికీ వినిపించే అద్భుతగీతం ఇది.


ఇతర భాషల్లో..

మలయాళంలో శారద ఈ చిత్రాన్ని నిర్మిస్తే, తమిళంలో శివాజీగణేశన్‌తో వి.బి.రాజేంద్రప్రసాద్‌ తీశారు. హిందీలో డూండీ దర్శకత్వంలో వినోద్‌ఖన్నా హీరోగా ఈ సినిమా తయారైంది. అయితే సాఫ్ట్‌ హీరో శోభన్‌బాబు జగన్‌ పాత్ర చేయడం తెలుగులో ప్లస్‌ అయినట్లుగా ఇతర భాషల్లో ఆ యా హీరోలకున్న ఇమేజ్‌ వల్ల కాలేదు. శోభన్‌బాబు నటజీవితాన్ని ఓ మలుపు తిప్పడమే కాకుండా, ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి దర్శకనిర్మాతలకు  ‘మానవుడు-దానవుడు’ మిగిల్చింది. అదే టైటిల్‌తో ఆ తర్వాత హీరో కృష్ణ ద్విపాత్రాభినయంతో ఒక సినిమా, మోహన్‌బాబు ద్విపాత్రాభినయంతో మరో  చిత్రం వచ్చాయి. కానీ ఇవి రెండూ విజయం సాధించలేదు. 

-వినాయకరావు

Updated Date - 2022-06-23T02:02:32+05:30 IST