‘సంపూర్ణ రామాయణం’: ఆది నుంచీ విమర్శలే.. అయినా సంచలన విజయం
ABN , First Publish Date - 2022-03-16T03:38:47+05:30 IST
రాముడి పాత్రలో ఎన్టీఆర్‌ను తప్ప మరో నటుడిని ఊహించుకోవడానికి సైతం జనం ఇష్టపడని రోజుల్లో శోభన్‌బాబుని శ్రీరాముడిగా చూపిస్తూ బాపు, రమణల ద్వయం చేసిన సాహసం ఇదని చెప్పాలి. ఆరేడు లక్షల రూపాయల బడ్జెటే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో 17 లక్షల 34 వేల రూపాయల వ్యయంతో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని తీశారు

ఆది నుంచీ విమర్శలే.. అయినా అంచనాలను మించి విజయం
‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి 50 ఏళ్లు
తెలుగు సినిమాకు సంబంధించి రాముడంటే ఎన్టీ రామారావే. ఆయన తప్ప ఆ పాత్ర ఎవరు చేసినా చూడరు అనే అభిప్రాయం బలంగా ఉన్న రోజుల్లో విడుదలైన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. శోభన్‌బాబు శ్రీరాముడిగా, చంద్రకళ సీతగా, ఎస్వీ రంగారావు రావణుడిగా.. దర్శకుడు బాపు ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పటివరకూ వచ్చిన పౌరాణిక చిత్రాల్లో ‘రహస్యం’, ‘సతీ అనసూయ’ చిత్రాల తర్వాత భారీ వ్యయంతో రూపుదిద్దుకొన్న పౌరాణిక సినిమా ఇదే. అంతే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఔట్‌డోర్‌లో సెట్స్ వేసి షూటింగ్ జరిపిన తొలి చిత్రం కూడా ఇదే! 1972 మార్చి 16న ఉగాది పండుగ సందర్భంగా ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి.
ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’( 1963) చిత్రంతో తెలుగులో రంగుల చిత్ర నిర్మాణం మొదలైంది. వాణిజ్యపరంగా ఈ చిత్రం సాధించిన విజయం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. ఆ రోజుల్లోనే ఈ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ చిత్రం తర్వాత రాముడి కథతో వచ్చిన మరో చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. రాముడి పాత్రలో ఎన్టీఆర్‌ను తప్ప మరో నటుడిని ఊహించుకోవడానికి సైతం జనం ఇష్టపడని రోజుల్లో శోభన్‌బాబుని శ్రీరాముడిగా చూపిస్తూ బాపు, రమణల ద్వయం చేసిన సాహసం ఇదని చెప్పాలి. ఆరేడు లక్షల రూపాయల బడ్జెటే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో 17 లక్షల 34 వేల రూపాయల వ్యయంతో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని తీశారు బాపు. 1936లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని నిర్మించిన నిడమర్తి కృష్ణమూర్తి సోదరుల తనయుడు సత్యం తన భార్య పద్మాక్షి పేరుతో ఈ సినిమాను నిర్మించడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన బాలాగౌడ్, బెంగళూర్‌కు చెందిన మూలా భక్తవత్సలం ఆయన భాగస్తులు.
ఎన్టీఆర్ ఆశీస్సులు
‘సంపూర్ణ రామాయణం’ చిత్రం షూటింగ్ ప్రారంభించే ముందు ఎన్టీఆర్‌ని కలిశారు బాపు, రమణ. అప్పటికే సముద్రాల రాఘవాచార్యతో ‘శ్రీరామ పట్టాభిషేకం’ స్ర్కిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు ఎన్టీఆర్. బాపు ఈ విషయం చెప్పగానే ‘మా దగ్గర స్ర్కిప్ట్ రెడీగా ఉంది. ఏ క్షణమైన తీసే అవకాశం ఉంది. మీరు ఇబ్బంది పడతారేమో’ అన్నారు రామారావు. ‘మీరు ఆ సినిమా తీయడానికి ఇంకా వ్యవధి ఉంది కనుక ఈ లోపు శోభన్‌బాబుతో మేం ప్రయత్నిస్తాం సార్’ అని చెప్పారు రమణ. ఎన్టీఆర్ నవ్వేసి ఆశీస్సులు అందజేశారు.
విమర్శలే.. విమర్శలు
శోభన్‌బాబుతో ‘సంపూర్ణ రామాయణం’ తీస్తున్నట్లు బాపు, రమణ ప్రకటించగానే విమర్శలు మొదలయ్యాయి. కమ్యూనిస్ట్ ఆరుద్ర, కామెడీ రైటర్ రమణ, కార్టూనిస్ట్ బాపు.. రామాయణం కథను తీయడం, అందులో రాముడిగా శోభన్‌బాబు నటించడమా.. జనం చూడడానికే! అంటూ రకరకాల కామెంట్స్ మొదలు కావడంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని ఓ దృశ్య కావ్యంలా చిత్రాన్ని తీర్చిదిద్దారు బాపు. తెర మీద శోభన్‌బాబు, ఎస్వీ రంగారావు.. తెర వెనుక రచయిత ఆరుద్ర, సంగీత దర్శకుడు మహదేవన్, ట్రిక్ ఫొటోగ్రఫీ నిర్వహించిన రవికాంత నగాయిచ్ ఆయనకు అండగా నిలిచారు.
సీతగా నటిస్తానన్న జమున
ఈ చిత్రంలోని ఇతర పాత్రల విషయానికి వస్తే ఆంజనేయుడిగా అర్జా జనార్థనరావు, లక్ష్మణుడిగా నాగరాజు, భరతుడిగా చంద్రమోహన్, దశరధుడిగా గుమ్మడి, ఇంద్రజిత్‌గా సత్యనారాయణ, విభీషణుడిగా ధూళిపాళ, కౌసల్యగా హేమలత, కైకగా జమున తదితరులు నటించారు. కైక వేషం వేయడానికి జమున మొదట ఒప్పుకోలేదు. సీత పాత్ర పోషిస్తానని బాపుని అడిగారామె. ఆమెకు నచ్చజెప్పి కైక పాత్రకు ఒప్పించారు. వాల్మీకి రామాయణాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా చిత్రంగా మలిచారు బాపు. ‘సంపూర్ణ రామాయణం’ మొదలు పెట్టే సమయానికి తెలుగులో కలర్ చిత్రాల నిర్మాణం ఎక్కువైంది. అయితే పేరున్న సంస్థలకు తప్ప కొత్త నిర్మాతలకు కలర్ ఫిల్మ్ దొరకడం కష్టంగా ఉండేది. ఓపెన్ మార్కెట్లో దొరకదు కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సి వచ్చేది. కానీ ఎల్వీ ప్రసాద్ తనయుడు ఆనందబాబు సహకారంతో అతి కష్టం మీద 75 కలర్ ఫిల్మ్ రోల్స్ సంపాదించారు బాపు, రమణ. అందులోనే చిత్రాన్ని పూర్తి చేశారు.
శోభన్‌బాబుకు ఎన్టీఆర్ అభినందనలు
‘సంపూర్ణ రామాయణం’ చిత్రం విడుదలకు ముందు రోజున ఎన్టీఆర్‌ను కలిశారు శోభన్‌బాబు. రామాయణం చేశానని చెప్పారు. రిలీజ్ ఎప్పుడని రామారావు అడిగారు. రేపు అని చెప్పగానే ‘ఎలా వచ్చింది?’ అని అడిగారు ఎన్టీఆర్. ‘ బాగుందండి’ అని చెప్పారు శోభన్‌బాబు. ‘ఆ విషయం ఎల్లుండి వచ్చి చెప్పు’ అన్నారు రామారావు. సినిమా కలెక్షన్లు వీక్‌గా ఉండడంతో ఎల్లుండి వెళ్లి ఆయన్ని కలవడానికి శోభన్‌బాబుకు ముఖం చెల్లలేదు. ‘సంపూర్ణ రామాయణం’ చిత్ర రిపోర్ట్ డల్‌గా ఉందని తెలియగానే శోభన్‌బాబు బాధ పడి, వారం రోజులు షూటింగ్స్‌కు వెళ్లలేదు. ఎన్టీఆర్ ఉండగా రాముడి పాత్ర మరో హీరోతో వేయించడానికి ఎంత ధైర్యం.. అన్నారు కొందరు ప్రేక్షకులు. తొలి వారం వసూళ్లు తక్కువగానే ఉన్నాయి. అవి చూసి నీరసించిపోకుండా మనసు పెట్టి సినిమా తీశాం.. ప్లాప్ కాదు.. బాగా ఆడుతుందనే నమ్మకం బాపు, రమణలకు ఉండేది. చివరికి వారి నమ్మకమే సినిమాను నిలబెట్టింది. సినిమా పెద్ద హిట్ అయింది. ‘లవకుశ’ చిత్రం తర్వాత మళ్లీ పల్లెల నుంచి జనం బళ్లు కట్టుకుని రావడం ‘సంపూర్ణ రామాయణం’ విషయంలోనే జరిగింది. శోభన్‌బాబు సొంత థియేటర్లో ఎన్టీఆర్ ఈ సినిమా వేయించుకుని చూశారు. పూర్తయిన తర్వాత ఆయన్ని గుండెలకు హత్తుకుని అభినందించారు. సాయంత్రం ఆరు దాటిన తర్వాత పని చేయకూడదు, ఆదివారాలు షూటింగ్స్‌కు సెలవు తీసుకోవాలనే నియమాన్ని ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం నుంచే శోభన్‌బాబు అమలు చేయడం ప్రారంభించారు.

అదో రికార్డ్
ఈస్ట్‌మన్ కలర్ పౌరాణిక చిత్రాల్లో పది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక 70 ఎం ఎం థియేటర్లో వంద రోజులు ఆడిన తొలి చిత్రం ‘సంపూర్ణ రామాయణం’. హైదరాబాద్ వెంకటేశ 70 ఎం ఎం చిత్రం ఈ రికార్డ్‌కు వేదికగా నిలిచింది. అలాగే 15 ఏళ్ల తర్వాత 1987లో మళ్లీ అదే థియేటర్లో విడుదలై వంద రోజులు ఆడడం మరో రికార్డ్.
హిందీలోనూ ఘన విజయం
‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేశారు. ఈ చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించడమే కాకుండా.. 1973లో హిందీ చిత్రరంగంలో అద్భుతమైన వసూళ్లు సాధించిన ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం.
శోభన్‌బాబుకు మరో సూపర్ హిట్
‘తాసీల్దారుగారమ్మాయి’, ‘చెల్లెలి కాపురం’, ‘జగత్కంత్రీలు’, ‘అమ్మ మాట’ వంటి వరుస విజయాలతో జోరు మీదున్న శోభన్‌బాబుకు ‘సంపూర్ణ రామాయణం’ మరో సూపర్ హిట్‌ను అందించింది.
-వినాయకరావు

