వ్యక్తిత్వమే గొప్ప అలంకారం

ABN , First Publish Date - 2022-04-17T05:30:00+05:30 IST

‘భల్లాల దేవ’ కావచ్చు... డానియల్‌ శేఖర్‌ కావచ్చు... పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడంలో దిట్ట... దగ్గుబాటి రానా.

వ్యక్తిత్వమే గొప్ప అలంకారం

‘భల్లాల దేవ’ కావచ్చు...  డానియల్‌ శేఖర్‌ కావచ్చు... పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడంలో దిట్ట... దగ్గుబాటి రానా. టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా సినిమా వరకూ.. మల్టీస్టారర్‌ చిత్రాల దర్శకుల తొలి ఎంపిక ఆయన. బిజినెస్‌మాన్‌గా సరికొత్త పాత్రలోకి అడుగుపెట్టి... పురుషుల సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోనూ సక్సెస్‌ కొడుతున్న రానా...సినిమాలు, స్టైల్‌, ఫ్యాషన్‌... ఇలా ఎన్నో అంశాలపై ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...


‘భీమ్లానాయక్‌’ సక్సెస్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారు?

వెరీ ఎగ్జైటింగ్‌. డానియల్‌ శేఖర్‌ క్యారెక్టర్‌లో ఉన్న ఫన్‌ ఇప్పుడు నా లైఫ్‌లో కూడా ఉంది. 


‘బాహుబలి’ తర్వాత మల్టీస్టారర్‌ చిత్రాల సంఖ్య పెరగడం ఎలా అనిపిస్తోంది?

మల్టీస్టారర్‌ కథల వల్ల ఒక కొత్త తరహా సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతోంది. వారు సినిమాను మరింత ఆస్వాదించే వీలుంటుంది.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌తో రెండోసారి రూ. వెయ్యి కోట్ల వసూళ్లను రాజమౌళి తెచ్చిపెట్టారు. ఇది గర్వించదగిన విషయం. ఇలా పెద్ద హీరోలు కలసి పనిచేయడానికి అనువైన వాతావరణం ఇండస్ట్రీలో ఉంది కాబట్టే వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయి. కలసి పనిచేయడంలో ‘పవర్‌’ ఎక్కువగా ఉంటుంది. మూడు గంటల సినిమాలో కొత్త కొత్త కాంబినేషన్లను చూస్తుంటే ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. 


మల్టీస్టారర్లు చేసేటప్పుడు ‘మన పాత్రకు ప్రాధాన్యం తగ్గిందే’ అనిపిస్తుందా?

గతంలో అలాంటి అభిప్రాయాలు ఉండేవి. నాకయితే ఎప్పుడూ లేవు. నేను వరుసగా మల్టీస్టారర్లు చేస్తూ వచ్చాను. మిగతావాళ్లకు కూడా అలాంటి అభిప్రాయం లేదనే అనుకుంటున్నాను. 


కొత్తగా సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టారు కదా... కారణం...

అవును. ‘గడ్డం కూడా మాట్లాడుతుంది సార్‌’ అని మావాళ్లు నాతో అనేవారు. ఇప్పుడు సినిమాల్లోనూ హీరోలు అందరూ పెద్ద గడ్డాలు వేసుకొని కనిపిస్తున్నారు. గతంలో అందంగా కనిపించడమనేది స్త్రీలకు మాత్రమే పరిమితమైన విషయంగా చూసేవాళ్లు. మగవాళ్లలో కూడా అందంగా కనిపించాలనే ధోరణి కొన్నేళ్లుగా పెరుగుతోంది. కేశాలంకరణ అనేది పెద్ద విషయం.  కొన్నేళ్లుగా పురుషులు కూడా అందంగా కనిపించడం మీద శ్రద్ధ పెడుతున్నారు. తమకు కావాల్సిన విషయాలను మాత్రమే పట్టించుకుంటున్నారు. మేము కెమెరా ముందు ఉంటాం. నా ముఖం, గడ్డంతో సహా నాలో ప్రతి భాగం ఆకర్షణీయంగా కనిపించాలి. ప్రతి సినిమాకి ఒక కొత్త లుక్‌లో కనిపించాలి. హెయిర్‌స్టైల్‌ కొత్తగా ఉండాలి. కాబట్టి దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే ఇదంతా చాలా క్లిష్టమైన అంశం. దాన్ని సరళం చేసి DCRAF అనే ప్రొడక్ట్‌ (పేరెంట్ సంస్థ ROPOSO ద్వారా ప్రమోషన్) రూపంలో మార్కెట్లోకి తెస్తున్నాం. ఫారిన్‌ బ్రాండ్స్‌ చాలా వరకూ అక్కడి వినియోగదారుల చర్మతత్వానికి సరిపోయేలా ఉంటాయి.  భారతీయుల చర్మతత్వం పూర్తి భిన్నంగా ఉంటుంది... కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేం ఈ ఉత్పత్తులు రూపొందించాం. 


సినిమా, వీఎఫ్‌ఎక్స్‌ వ్యాపారానికీ... ఫ్యాషన్‌, సౌందర్య ఉత్పత్తుల వ్యాపారానికీ మధ్య ఏదైనా తేడా గమనించారా?

ఏదైనా కొత్త ఉత్పత్తి తయారుచేసినప్పుడు ‘ఈ బ్రాండ్‌ ఎందుకు తయారుచేశారు, దీన్ని ఎందుకు వాడాలి?’ అనేది వినియోగదారులకి అర్థమయ్యేలా చెప్పాలి. ‘మన ప్రొడక్ట్‌ వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయనేది కొద్ది సమయంలోనే మనసుకి హత్తుకునేలా కస్టమర్‌కు వివరించాలి. అప్పుడే వారు ఉత్పత్తిని కొనేందుకు మొగ్గు చూపుతారు. 


పురుషుల సౌందర్య ఉత్పత్తుల విభాగంపైనే ఎందుకు దృష్టి పెట్టారు?

పురుషుల అలంకరణ అనేది ఇప్పుడు పెద్ద కేటగిరీ. ఫేస్‌వాష్‌లు, మాయిశ్చరైజర్లు, సన్‌స్ర్కీన్‌లు ఎలాంటివి వాడాలనే విషయంలో వారికి అవగాహన చాలా తక్కువగా ఉంది. గతంలో పురుషుల కోసం ప్రత్యేకంగా ఇలాంటివి ఉండేవి కావు. ఇప్పుడు ఇండియాలోనే నాలుగైదు సంస్థలు మొదలయ్యాయి. పురుషుల కోసం ప్రత్యేకంగా సెలూన్లు స్టార్టయ్యాయి. ఇంతకు ముందు హెయిర్‌ కట్‌ చేసుకున్నామా, మంచిగా దువ్వుకున్నామా? అన్నంత వరకే ఆలోచించేవారు. ఇప్పుడు దాన్ని తరువాతి స్థాయికి తీసుకెళ్తున్నాం.

 

సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు

ఎలా పడితే అలా ఉండేవాణ్ణి. దేన్నీ అసలు పట్టించుకునేవాణ్ణి కాదు. యాక్టరయిన చాలా సంవత్సరాల వరకూ అలంకరణ మీద పెద్దగా కేర్‌ తీసుకోలేదు. మిగతా యాక్టర్స్‌ ‘హెయిర్‌ డ్రై అవుతోంది...ఇలా చెయ్‌... అలా చెయ్‌’ అని సలహాలు ఇచ్చేవారు. నేను వినలేదు. కానీ వాళ్లు చెప్పిందే సరైనదనీ, నేనే పాటించలేదనీ ఆ తరువాత అర్థమైంది.


పద్ధతిగా తయారయ్యే విషయంలో మీ నాన్నగారు, తాతగారు ఏవైనా సలహాలిచ్చేవారా? 

‘ఏ దుస్తులువేసుకున్నాడు, తల దువ్వుకున్నాడా? లేదా?’ అనే విషయాలు నాన్నగారు అసలు పట్టించుకునేవారు కాదు. మా తాతగారు మాత్రం ఎంతో పట్టింపుతో ఉండేవారు. చక్కగా తల దువ్వుకునేవారు. చాలా స్టైలిష్‌గా ఉండేవారు. చిన్నాన్న కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టే చాలా అందంగా కనిపిస్తున్నారు.


మీ తరం నటుల్లో ఎక్కువ స్టైలిష్‌గా ఉండే హీరోలు ఎవరనుకుంటున్నారు?

బన్నీ, రామ్‌చరణ్‌ చాలా స్టైలిష్‌గా ఉంటారు. ఆ విషయంలో నా మీద వారి ప్రభావం ఉంది. వాళ్లిద్దరికి తమదైన స్టైల్‌ ఉంది. మంచి ఫ్యాషన్‌ సెన్స్‌ ఉంది. 


 స్టైల్‌ను మీరు ఎలా నిర్వచిస్తారు?

మనిషికి వ్యక్తిత్వం ఫస్ట్‌. అదే గొప్ప అలంకరణ. దాని నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం నలుగురిలో మిమ్మల్ని భిన్నంగా చూపిస్తుంది. మిగిలిన పైపై మెరుగులన్నీ మిమ్మల్ని ప్రపంచానికి ఆకర్షణీయంగా చూపించడంలో కొంతమేర తోడ్పడతాయి, అంతే!       

       ఫ సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


 పెద్ద హీరోలు కలసి పనిచేయడానికి అనువైన వాతావరణం ఇండస్ట్రీలో ఉంది కాబట్టే వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయి. కలసి పనిచేయడంలో ‘పవర్‌’ ఎక్కువగా ఉంటుంది.

Updated Date - 2022-04-17T05:30:00+05:30 IST