సంగీత దర్శకులు ఇన్ని జిమ్మిక్కులు చేస్తున్నారా?
ABN , First Publish Date - 2022-03-05T05:51:36+05:30 IST
ఓ సినిమా సక్సెస్ కావాలంటే కథ, దాని తగ్గ ఆర్టిస్ట్‌లు, నిర్మాణ విలువలు దర్శకుడి రాత, తీత చాలా ముఖ్యం. వీటితో పాటు సంగీతం కూడా సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర వహిస్తుంది. అందుకే సినిమాకు సంగీతం సగం బలం అంటారు. పాటలే సగం సక్సెస్‌ని నిర్ధారిస్తాయి. ఈ మఽధ్య కాలంలో అయితే రీ రికార్డింగ్ కూడా అదిరేలా ఉంటేనే సినిమాకు మంచి మార్కులు పడుతున్నాయి.

ఓ సినిమా సక్సెస్ కావాలంటే కథ, దాని తగ్గ ఆర్టిస్ట్‌లు, నిర్మాణ విలువలు దర్శకుడి రాత, తీత చాలా ముఖ్యం. వీటితో పాటు సంగీతం కూడా సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర వహిస్తుంది. అందుకే సినిమాకు సంగీతం సగం బలం అంటారు. పాటలే సగం సక్సెస్‌ని నిర్ధారిస్తాయి. ఈ మఽధ్య కాలంలో అయితే రీ రికార్డింగ్ కూడా అదిరేలా ఉంటేనే సినిమాకు మంచి మార్కులు పడుతున్నాయి. అంటే రీ రికార్డింగ్ ప్రస్తావన గతంలో లేదని కాదు. పెరుగుతున్న టెక్నాలజీని బట్టి అందులోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేమకథకు అయితే ఒక టైప్ ఆర్ఆర్, సెంటిమెంట్ సినిమా అయితే ప్రేక్షకుడిని కట్టి పడేసే బీజీఎమ్, అదే... మాస్ యాక్షన్ సినిమా అయితే దద్దరిల్లిపోయే నేపథ్య సంగీతం ఉండాలి. మాస్ సినిమాలకు కొందరు సంగీత దర్శకులు ఇచ్చే సంగీతంతోరోమాలు నిక్కబోడుచుకుంటాయి. అభిమానులకు పూనకాలు వస్తుంటాయి. అందుకు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా చిత్రాలు ఉదాహరణ. రీ రికార్డింగ్‌తో కూడా సాధారణ హిట్ సినిమాను సూపర్‌హిట్ చేయొచ్చని కొందరు సంగీత విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి ఆర్ఆర్ ఇవ్వడం వెనుక చాలా జిమ్మిక్కులు, మ్యాజిక్‌లు ఉన్నాయి. సంగీత దర్శకులు ట్యూన్లు చేసి, దానికి పాటలు సిద్ధం చేస్తుంటారు. అయితే రీ రికార్డింగ్ అలా కాదు. దాని వెనుక ఎంతోమంది హస్తం ఉంటుంది. కొన్ని సినిమాలకు సంగీతం ఒకరు అందిస్తారు. ఆర్ఆర్ మరో సంగీత దర్శకుడు సారథ్యంలో జరుగుతుంటుంది. ఒక సినిమాకు చేసిన ట్యూన్‌ని రిజెక్ట్ చేస్తే.. దానిని బయటకు రానివ్వకుండా మరో సినిమాకు వాడటం అనేది చాలాకాలంగా సంగీత రంగంలో ఉంది. అయితే ఈ విషయం బయటకు రాదు. కొందరు సంగీత దర్శకులు ఆర్ఆర్ జోలికి వెళ్లకుండా ఉంటారని వినికిడి. సీజీ చేయడానికి పలు స్టూడియోలు, గ్రాఫిక్ కంపెనీలు ఉన్నట్లే రీ–రికార్డింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు, గ్రూపులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది సంగీత దర్శకులు ఆయా కంపెనీలతో సిచ్చుయేషన్కి తగ్గ ఆర్ఆర్ చేయించుకుని సినిమాల్లో వాడుతున్నారని తెలిసింది. టాలీవుడ్లో ఓ అగ్ర సంగీత దర్శకుడు గత రెండేళ్ల నుంచీ ఇలానే తన సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కంపెనీలతో చేయించుకుంటున్నాడని, ముఖ్యమైన ఎలివేషన్లకు మాత్రం ట్రాకులు తాను సిద్థం చేస్తున్నాడని తెలుస్తోంది.
ఒక సినిమాకు రీ రికార్డింగ్ చేయడానికి కనీసం నెల రోజులు సమయం పడుతుంది. ఇప్పుడున్న సంగీత దర్శకులు చేతి నిండా సినిమాలతో బిజీ కావడంతో వారి దగ్గర అంత సమయం దొరకడం లేదు. అందుకే ఇలా సిచ్చుయేషన్కి తగ్గ ట్రాకులు కొట్టించుకుని, వాటిని తమ సినిమాల్లో వాడుకుంటుంటారు. ట్యూన్లు కట్టే విషయంలోనూ సంగీత దర్శకుల విధానం మారింది. కొంతమంది అగ్ర దర్శకులు తమకు కావల్సినట్టుగా ట్యూన్లు రాబట్టుకుంటారు. వాళ్ల కోసం 20, 30 ట్యూన్లు చేయడానికి సిద్థంగా ఉంటారు. ఇదే మాటను వేదికలపైనా చెబుతుంటారు. అయితే కొత్తగా సినిమా తీసేవాళ్లకు మాత్రం ఈ ఆఫర్ ఉండదు. సంగీత దర్శకుడు ఇచ్చిందే ట్యూన్. నేటి మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్తగా సినిమాలు తీసేవాళ్ల దగ్గర వీర ప్రతాపం చూపిస్తుంటారని చాలామంది వాపోతున్నారు. పెద్ద సినిమాల్లో రిజెక్ట్ అయిన ట్యూన్లన్నీ.. కొత్తవాళ్లకు అంటగడుతున్నారని టాలీవుడ్ కొన్నాళ్లగా వినిపిస్తోంది. గంటలో లేదా మూడు రోజుల్లో ట్యూన్స్, పాటలు అన్నీ రెడీ అయిపోయాయి అనే మాటలు ఈ కోవకే చెందుతాయని వినికిడి. నచ్చితే వాడుకోండి.. లేదంటే లేదు అని ఖరాఖండిగా చెబుతున్నారట. ప్రస్తుతం కాలంలో సినిమాలు గుర్తింపు ఉన్న టెక్నిషియన్ పేరు కనిపిస్తేనే బిజినెస్ అవుతుంది. ఇది గ్రహించిన దర్శకనిర్మాతలు గతి లేక, ఈ విషయంలో ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారు. తెలివైన దర్శకులు మాత్రం రిజెక్ట్ చేసిన ట్యూన్ల సంగతి ముందుగానే ఇత ర దర్శకులకు తెలియజేసి ‘నేను ఫలానా ట్యూన్ రిజెక్ట్ చేశా. అది మీ దగ్గరకు వస్తుందేమో చూసుకోండి’ అని అలర్ట్ చేస్తున్నారట. రిజెక్ట్ చేసిన ట్యూన్లు ‘ఇది మీ కోసమే చేసిన ట్యూను’ అని మాయ మాటలు చెప్పి దర్శకులను బట్టులో పడేస్తున్నారట. చేసే పనిలో నిజాయతీ, నిబద్ధత ఉంటేనే విజయం వరిస్తుందని ఎప్పుడు గ్రహిస్తారో..!
