అలాంటి దర్శకులు అరుదుగా ఉంటారు: కోట (పార్ట్ 64)

ABN , First Publish Date - 2022-04-27T00:38:19+05:30 IST

అలీకి ఎదురైన ఓ గమ్మత్తైన విషయాన్ని ఆ నోటా ఈ నోటా విన్నాను.. అదేంటంటే.. రాఘవేంద్రరావుగారు ఓ సినిమా మొదలుపెట్టారు. అందులో ఓ సీనియర్‌ ఆర్టిస్టునే తీసుకున్నారు. నాలుగు రోజుల షూటింగ్‌ తర్వాత ఆ ఆర్టిస్టుతో..

అలాంటి దర్శకులు అరుదుగా ఉంటారు: కోట (పార్ట్ 64)

అలీకి ఎదురైన ఓ గమ్మత్తైన విషయాన్ని ఆ నోటా ఈ నోటా విన్నాను.. అదేంటంటే.. రాఘవేంద్రరావుగారు ఓ సినిమా మొదలుపెట్టారు. అందులో ఓ సీనియర్‌ ఆర్టిస్టునే తీసుకున్నారు. నాలుగు రోజుల షూటింగ్‌ తర్వాత ఆ ఆర్టిస్టుతో ఏదో సమస్య వచ్చింది, అతను రాలేదో, లేకుంటే డైరెక్టర్‌గారికి నచ్చలేదో మొత్తానికి ఏదో జరిగింది. షూటింగ్‌ కంటిన్యుటీ ఉంది.. అదీ వేరియస్‌ ఆర్టిస్టుల కాంబినేషనలో. ఏం చెయ్యాలా అని కో డైరెక్టర్లు తల పట్టుకుని కూర్చున్నారట. ఆ విషయాన్నే సాయంత్రంపూట డైరెక్టర్‌గారితో అంటే ‘అలీ ఎక్కడున్నాడో కనుక్కోండి’‍ అన్నారట. ఆరా తీస్తే అలీకి అప్పుడే పెళ్ళయిందని తెలిసింది. 


అలీ ఫోన్ అటెండ్ చేసి ‘నాకు పెళ్ళి సార్‌. ఇవాళ‌ నేను షూటింగ్‌కి రావ‌డానికి కుద‌ర‌దు. ఇవాళ ఇంట్లో వాళ్ళు ఏవో అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. రావ‌డానికి కుద‌ర‌దండీ’ అన్నాడ‌ట‌. ఇక కో–డైరెక్ట‌ర్ చేసేదేమీ లేక రాఘ‌వేంద్ర‌రావుగారికి విష‌యం చేర‌వేశాడ‌ట‌. ఆయ‌న అంతా విని ‘అవ‌న్నీ నేను చూసుకుంటాన‌ని చెప్పు. అర్జంటుగా అలీని, ఫ్యామిలీతో పాటు ఫ్లైట్ ఎక్కి హైద‌రాబాద్‌ వ‌చ్చేయ‌మ‌ని చెప్పు’ అన్నార‌ట. కో డైరెక్ట‌ర్ ద్వారా అంతా విన్న అలీ...ఎంతో అర్జంట్‌ అయితే త‌ప్ప ద‌ర్శ‌కేంద్రుడు ఇలా పిల‌వ‌డ‌ని అర్థం చేసుకుని ఫ్యామిలీతో సహా భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చేశాడ‌ట‌. ఆ వేళ చాలామంది ఆర్టిస్టుల కాంబినేష‌న్‌లో అలీ సీన్లు చేశాడ‌ట‌. సాయంత్రం రాఘ‌వేంద్ర‌రావుగారే అలీకి ఓ మంచి హోట‌ల్‌లో ఫ‌స్ట్ నైట్‌ అరేంజ్ చేశార‌ని విన్నాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అవ‌త‌లి వ్య‌క్తి మంచీచెడుల‌ గురించి ఆలోచించే ద‌ర్శ‌కులు ఉండ‌టం అరుదు. అలా అన్నిటినీ అర్థం చేసుకుంటారు కాబట్టే రాఘవేంద్ర‌రావుగారితో ప‌నిచేయాల‌ని అంద‌రూ మ‌ళ్ళీ మళ్ళీ కోరుకుంటారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-04-27T00:38:19+05:30 IST