ఇప్పుడు చూసినా కూడా.. ‘మన శ్రీకాంతే చేశాడా’ అనిపిస్తుంది: కోట (పార్ట్ 62)

ABN , First Publish Date - 2022-01-14T04:02:41+05:30 IST

నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత కొంతమంది నటీనటులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి వారిలో శ్రీకాంత్‌ ఒకరు. అజాతశత్రువు అంటారే.. ఆ తరహా కుర్రాడు శ్రీకాంత్‌. అతని శరీర సౌష్టవం చాలా గొప్పగా ఉంటుంది. అతను అటు విలనీకి సరిపోయాడు. ఇటు హీరోగా వేస్తే

ఇప్పుడు చూసినా కూడా.. ‘మన శ్రీకాంతే చేశాడా’ అనిపిస్తుంది: కోట (పార్ట్ 62)

నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత కొంతమంది నటీనటులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాంటి వారిలో శ్రీకాంత్‌ ఒకరు. అజాతశత్రువు అంటారే.. ఆ తరహా కుర్రాడు శ్రీకాంత్‌. అతని శరీర సౌష్టవం చాలా గొప్పగా ఉంటుంది. అతను అటు విలనీకి సరిపోయాడు. ఇటు హీరోగా వేస్తే ‘వారెవా.. ఏమున్నాడురా’ అని అనిపించగలిగాడు. రొమాంటిక్‌ సీన్లు చేస్తే ‘ప్రియుడంటే ఇలా ఉండాలి’ అని అనిపించేవాడు. భర్తగా వేశాడంటే ప్రతి మహిళా ‘తన భర్త అలా ఉండాలి’ అని అనుకోవాల్సిందే. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో వేషాలు వేశాడు. ఈ రకంగా అన్ని చోట్లా ఒదిగిపోగలిగిన నటులు చాలా అరుదుగా ఉంటారు. స్టార్టింగ్‌లో అతను విలన్‌ వేషాలు వేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అప్పట్లో నేను విలన్‌గా వేస్తే, అతను నాకు కొడుకుగా, అంటే విలన్‌ కొడుకుగా నటించేవాడు. మొదటి నుంచీ నన్ను బాబాయ్‌ అని పిలిచేవాడు. హీరోగా శ్రీకాంత్ చేసిన మూడు, నాలుగు సినిమాల్లో నాకు చాలా మంచి పాత్రలున్నాయి.


వాటిలో మొదటిది ‘మా నాన్నకు పెళ్ళి’. ఇప్పుడు చాలావరకు సినిమా షూటింగ్‌లు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నాయి. నాకు గుర్తున్నంత వరకు రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుపుకున్న తొలి చిత్రం ‘మా నాన్నకు పెళ్ళి’. రామోజీరావుగారు మా యూనిట్‌ అందరితోనూ చాలా బాగా మాట్లాడేవారు. దాంతో నాకు ఆయనతో అంతకు ముందు ఉన్న పరిచయం ఇంకాస్త పెరిగింది. వ్యక్తులను గౌరవించడంలోనూ, నైపుణ్యం గుర్తించడంలోనూ ఆయనెప్పుడూ ముందుండేవారు. సిన్సియర్‌గా మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటలకు ఆయన నిదర్శనం. అలాంటి మహానుభావుడితో నాకు పరిచయం ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఇక శ్రీకాంత్‌ విషయానికి వస్తే ‘మా నాన్నకు పెళ్ళి’ సెట్‌లో అతను హీరోగా నటిస్తుంటే చూసి నాకు ఆశ్చర్యం వేసింది.


అప్పటిదాకా విలన్‌గా చేసినవాడు.. హీరోగా చేస్తుంటే సెట్‌లో అలా చూస్తూ ఉండిపోయేవాణ్ణి. అందులోనూ హీరోయిన్‌ సిమ్రాన్‌తో కొన్ని సీన్లలో ‘శభాష్‌’ అనిపించుకునేలా చేశాడు. ఆ సినిమాలో ఫ్లైట్‌లో కొన్ని సీన్లుంటాయి. ఇప్పుడు వాటిని చూసినా ‘మన శ్రీకాంతే చేశాడా’ అనిపిస్తుంది. ఆర్టిస్టుగా అతనిలోని వేరియేషన్‌కి నేను తెగ ఆనందపడ్డ చిత్రం ‘ఆమె’. నాది అందులో చండాలపు వేషం. ఆ వేషం ఒప్పుకోవడానికే చాలా ధైర్యం కావాలి. ఆ చివరి సీన్‌ మరీ భరించలేం. సుధ కూడా చాలా బాగా చేసింది. ఆ సినిమా తర్వాతే అనుకుంటా శ్రీకాంత్‌కి తిరుపతిలో పెళ్ళి జరిగింది. పగటిపూట ముహూర్తమే. ‘తప్పక రావాలి బాబాయ్‌’ అని పిలిచాడు. అప్పుడు నేను మద్రాసులో ఉండేవాణ్ణి. వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదించాను. ఇప్పటికీ అతని ప్రతి పుట్టినరోజుకీ విష్‌ చేస్తా.


అతనితో నేను చేసిన మరో చిత్రం ‘నాటుకోడి’. ఆ చిత్ర దర్శకుడు నానికృష్ణ చాలా మంచివాడు. ఆ సినిమా చాలా బాగా తీశాడు. అందులో శ్రీకాంత్‌ ఫాదర్‌ వేషం వేశా. సిన్సియర్‌ కానిస్టేబుల్‌ని. నా కొడుకుని ఎస్‌.ఐ.గా చూడాలని తాపత్రయపడుతుంటాను. నాకూ -శ్రీకాంత్‌కి మధ్య అక్కడక్కడా చాలా మంచి సీన్లుంటాయి. ఈ వయసులో నేను సైకిల్‌ తొక్కుతానంటే ఎవరైనా నమ్ముతారా? నానికృష్ణ నాతో ఇందులో సైకిల్‌ తొక్కించారు. నా వయసుతో ప్రమేయం లేకుండా చాలా చేయించారు. వాటికోసం వాళ్లు ముందుగా చాలా ప్రిపేర్‌ అయ్యారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-01-14T04:02:41+05:30 IST

Read more