అలాంటి మహానుభావులతో పనిచేయడం నా అదృష్టం: కోట (పార్ట్ 61)

ABN , First Publish Date - 2022-01-04T03:02:05+05:30 IST

అంతో ఇంతో పాత, కొత్త దర్శకులందరితోనూ నాకు పరిచయం ఉందండీ. నాకు తెలిసి పూర్వం దర్శకులందరూ అకౌంటెంట్‌లుగా ఉండేవారు. ఇక్కడ అకౌంటెంట్‌ అంటే డైలాగ్‌ అకౌంటెన్సీ, స్ర్కీన్‌ప్లే అకౌంటెన్సీ, మ్యూజిక్‌ ఎకౌంటెన్సీ అన్నమాట. 24 శాఖల మీదా వాళ్ళకు

అలాంటి మహానుభావులతో పనిచేయడం నా అదృష్టం: కోట (పార్ట్ 61)

అంతో ఇంతో పాత, కొత్త దర్శకులందరితోనూ నాకు పరిచయం ఉందండీ. నాకు తెలిసి పూర్వం దర్శకులందరూ అకౌంటెంట్‌లుగా ఉండేవారు. ఇక్కడ అకౌంటెంట్‌ అంటే డైలాగ్‌ అకౌంటెన్సీ, స్ర్కీన్‌ప్లే అకౌంటెన్సీ, మ్యూజిక్‌ ఎకౌంటెన్సీ అన్నమాట. 24 శాఖల మీదా వాళ్ళకు పట్టు ఉండేది. అన్ని శాఖల్లోనూ ఏది ఎంత ఉండాలో, దేన్ని ఎంత మేర ఉపయోగించుకోవాలో వారికి బాగా తెలిసేది. నేను పరిశ్రమకి వచ్చిన కొత్తలో సి.ఎస్‌.రావుగారి దగ్గర ఒక సినిమా చేశా. తొలి రోజు సెట్‌లో 13 మంది ఆర్టిస్టులం ఉన్నాం. సత్యనారాయణగారు, నేను, గిరిబాబుగారు, జయలలిత.. ఇలా మొత్తం 13 మంది అన్నమాట. జయలలిత అంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి, ఇటీవల చనిపోయిన ఆవిడ కాదు. మన తెలుగమ్మాయి జయలలిత.


ఈ అమ్మాయి చాలా అందంగా ఉండేది. డ్యాన్సులు కూడా బాగా చేసేది. ఇప్పుడు కేరక్టర్లు చేస్తోంది కదా.. మేమంతా సెట్‌కి రాగానే సి.ఎస్‌.రావుగారు అందరినీ కూర్చోబట్టి ‘విత్‌ ఫుల్‌ మూడ్‌లో ఒక రిహార్సల్‌ చేయండి. ఎందుకంటే వి ఆర్‌ డీలింగ్‌ విత్‌ ఫిల్మ్‌... ఫిల్మ్‌తో ఆడుకోకూడదు’ అనేవారు. పూర్వం రచయితలు డైలాగులను ముందే పంపేసేవారు. దాంతో ఎవరి డైలాగులు వాళ్ళకి ముందే ఇచ్చేయడంతో మేమంతా కూడా ప్రిపేర్‌ అయి వచ్చేవాళ్లం. ఆ రోజు కూడా సెట్‌కి రాగానే అందరం రిహార్సల్‌ మొదలుపెట్టాం. ఆఖరు డైలాగ్‌ నాదే. నా డైలాగ్‌ నేను చెప్పాక ఎక్కడినుంచో కటక్‌ కటక్‌మని సౌండ్‌ వచ్చింది. ఏంటా? అని చూస్తే సీఎస్‌ రావుగారు జేబులో నుంచి స్టాప్‌ వాచ్‌ తీసి , ‘మ్‌... 30 సెకన్లు తేడా వచ్చింది. ఎవరో డైలాగు లాగుతున్నారు..’ అన్నారు. సెకన్లకు కూడా ఇంత ప్రాధాన్యమిస్తారా? అని మనసులోనే అనుకున్నా. అంతలోనే సి.యస్‌.రావుగారు వచ్చి ‘‘సత్యనారాయణ పలానా చోట నువ్వు చెప్పింది ఆర్టిఫిషియల్‌గా ఉంది. ఇదిగో శ్రీనివాసరావు పౌరాణికానికి నువ్వింకా అలవాటుపడలేదు. కాస్త పౌరాణికం స్టైల్‌లో చెప్పు డైలాగు.. అబ్బాయ్‌.. గిరిబాబు నువ్వు కాస్త నిదానంగా చెప్పు’’ అని మేం చేసిన నటనలో మంచీచెడులు చెప్పారు. 


ప్రతిరోజూ అలాగే చెప్పేవారు. అప్పట్లో స్ర్కిప్ట్‌ బుక్‌లో రైట్‌సైడ్‌ యాక్టింగ్‌, లెఫ్ట్‌సైడ్‌ ఎలా చేయాలి? ఏం చేయాలి? వంటి వివరాలన్నీ రాసుకునేవారు. దానికి తోడు సి.యస్‌.రావుగారికి అపారమైన జ్ఞాపకశక్తి ఉండేది. సెట్లో ఎంత మంది ఉన్నా అందరి డైలాగులూ ఆయనకి గుర్తుండేవి. అందరికీ ప్రాంప్టింగ్‌ చెబుతుండేవారు. ఒకవేళ ఏదైనా ఒక డైలాగ్‌ మిస్‌ అయిందనుకోండి.. అసిస్టెంట్లను పిలిచి చెక్‌ చేయమనేవారు. వాళ్ళు పరాపరా పేజీలు తిప్పుతుంటే ‘పేజీలు చిరుగుతయిరా.. అంతలా తిప్పడం ఎందుకు.. ఆ 36వ పేజీలో అట్టడుగున ఉంది చూడు ఆ డైలాగ్‌..’ అని పేజీ నెంబర్లతో సహా చెప్పేసేవారు. అలాంటి మహానుభావులతో పనిచేయడం నిజంగా నా అదృష్టం.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-01-04T03:02:05+05:30 IST

Read more