చిరంజీవి, దాసరి.. నాపై కక్ష కట్టారు!: కోట (పార్ట్ 60)

ABN , First Publish Date - 2022-01-03T04:29:44+05:30 IST

దీక్ష సెగ నా నటజీవితాన్ని కొద్దిగా తాకింది. చిరంజీవిగారి సినిమాలు, ఆయన తాలూకు నిర్మాతలు తీసిన చిత్రాలు, దాసరి గారి సినిమాల్లో నాకు అవకాశాలు సన్నగిల్లాయి. అలాగని నేను ఏ పూటా ఖాళీగా కూర్చోలేదు. కృష్ణ, శోభన్ బాబు, రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌... ఇలా మిగిలిన వారి

చిరంజీవి, దాసరి.. నాపై కక్ష కట్టారు!: కోట (పార్ట్ 60)

పరిశ్రమకు మంచి చేయడం కోసం నేను దీక్షలో కూర్చున్నాను. పెద్దవాళ్ళంతా మద్దతు ఇచ్చారు. పెద్దహీరోలందరూ తలో రోజూ వచ్చి శిబిరంలో కూర్చుంటాం అన్నారు. జనాన్ని కంట్రోల్‌ చెయ్యడం సాధ్యం కాదని నేనే సున్నితంగా వద్దని చెప్పాను. వాళ్ళంతా సహృదయంతో అర్థం చేసుకున్నారు. రెండో రోజో, మూడో రోజో అనుకుంటా, శిబిరంలో కూర్చుని ఉన్నా. మా అబ్బాయి ఇంటి నుంచి అప్పుడే వచ్చాడు. వచ్చినవాడల్లా నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు, ‘మీకెందుకు నాన్నగారు ఈ దీక్షలు? పరిశ్రమలో ఇంకా చాలామంది ఉన్నారు.. వాళ్ళు చేస్తారు కదా, మీ సినిమాలు మీకున్నాయి, ఎవరెన్ని రూల్సు పెట్టుకున్నా మీకొచ్చిన నష్టమేమీ లేదు. అలాంటప్పుడు వీటిని మీరు వదిలేయండి, పట్టించుకోకండి’ అని నాకు చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ‘అలా అనకూడదురా నాయనా, కాసింత పేరు ప్రతిష్ట వచ్చిన తర్వాత, మనం చెబితే నలుగురూ వింటారన్న నమ్మకం ఉన్నప్పుడు.. ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి. ఎప్పుడూ స్వార్థం చూసుకోకూడదు’ అని నా వంతుగా నేను వాడికి చెప్పా.


మావాడు చెప్పింది నిజమే. నా సినిమాలు నాకున్నాయి. ఇలాంటి దీక్షల వల్ల ఎవరో ఒకరి ఆగ్రహానికి గురైతే, వారి తాలూకు సినిమాల్లో మనకి వేషాలివ్వరు. అయినా ఒక పనిచేస్తే అందరికీ నచ్చాలని ఏముంది? అప్పట్లో నేను దీక్ష చేయడం దాసరి నారాయణరావుగారికి కూడా నచ్చలేదని తెలిసింది. ‘వాడిని అక్కడి నుంచి లేపండి ముందు’ అని ఆయన చాలామందికి ఫోన్లు చేశారట. రాజేంద్రప్రసాద్‌గారు, రామానాయుడుగారు వచ్చి ‘దీక్ష విరమించమని చెప్పమని దాసరిగారు అంటున్నారు, ఏం చెయ్యమంటావయ్యా’ అని అడిగారు. ‘ఏవండీ, నేను ఎవరో చెబితే చేయడం లేదు, ఎవరికీ చెప్పి చెయ్యలేదు. నా తపన నేను పడుతున్నా, ఆయన మాట పెడచెవిన పెట్టాలని కాదుగానీ, ఏదో మొదలుపెట్టాను కదా పూర్తి చేయనివ్వండి’ అని నిదానంగా చెప్పా. వారికి నా పట్టుదల మరోసారి అర్థమైంది. చిరంజీవిగారు కూడా ‘ఇప్పుడెందుకు ఈ దీక్షలు’ అన్నారని విన్నాను.


అయినా దీక్ష విరమించే రోజు చిరంజీవిగారు వచ్చారు. ఆయన నిమ్మరసం ఇస్తే తాగి, దీక్ష ఆపమని చుట్టూ ఉన్నవారు చెప్పారు. అయితే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను దీక్ష మొదలుపెడుతున్నట్టు రాజేంద్రప్రసాద్‌గారికి చెప్పాను. కాబట్టి విరమించే సమయంలో కూడా ఆయన చేతుల మీదుగానే నిమ్మరసం ఇప్పించమని అక్కడివారిని కోరాను. వాళ్ళు కూడా సరేనన్నారు. నా ప్రవర్తనకు చిరంజీవిగారు చిరుకోపం చేసుకున్నారని అర్థమైంది. కట్‌చేస్తే మరుసటిరోజు హైదరాబాద్‌లో చాలా సినిమాలు మొదలయ్యాయి. వాటిలో చాలా వాటికి నాచేత క్లాప్‌ కూడా కొట్టించారు. రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌ వంటి హీరోలు పరిశ్రమలో బాగా నిలదొక్కుకున్నది ఆ సమయంలోనే హైదరాబాద్‌లో మొదలైన చిత్రాలతోనే. అప్పటిదాకా మద్రాసులో కో డైరెక్టర్లుగా, అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా ఉన్న చాలా మంది ప్రమోషన్లు తీసుకుని దర్శకులైన తరుణం అదే.


ఫైనాన్షియర్లు కూడా బాగా సపోర్ట్‌ చేయడంతో భాగ్యనగరంలో సినిమాల సందడి మొదలైంది. పరిశ్రమపరంగా అంతా బానే ఉంది కానీ, నా నటజీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్న మాట కూడా వాస్తవమే. దీక్ష సెగ నా నటజీవితాన్ని కొద్దిగా తాకింది. చిరంజీవిగారి సినిమాలు, ఆయన తాలూకు నిర్మాతలు తీసిన చిత్రాలు, దాసరి గారి సినిమాల్లో నాకు అవకాశాలు సన్నగిల్లాయి. అలాగని నేను ఏ పూటా ఖాళీగా కూర్చోలేదు. కృష్ణ, శోభన్ బాబు, రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌... ఇలా మిగిలిన వారి సినిమాలు చేతినిండా ఉండటంతో నాకు ఆ సెగ స్పెషల్‌గా తెలియలేదు. పరిశ్రమ మొత్తం కక్ష కట్టి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో!

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2022-01-03T04:29:44+05:30 IST

Read more