Jean-Luc Godard: తెలుగు సినీ రంగంపై గోడార్డ్ ప్రభావం.. దర్శకుడు నరసింగరావు జంప్ కట్స్ సీన్ల వెనుక..

ABN , First Publish Date - 2022-09-16T03:45:53+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సినీ నిర్మాణానికి సంబంధించి విప్లవాత్మకమైన మార్పుకు కారణమైన ఆ దిగ్దర్శకుడి ప్రభావం మన తెలుగు సినిమా మీద ఉందా? ఉందని చెప్పడానికి పెద్ద నిదర్శనం - తెలుగులో ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి మార్గదర్శకుడు, తెలుగు సినిమాని అంతర్జాతీయ నవ్య చలనచిత్ర వేదిక మీద నిలబెట్టిన బి నరసింగరావు!

Jean-Luc Godard: తెలుగు సినీ రంగంపై గోడార్డ్ ప్రభావం.. దర్శకుడు నరసింగరావు జంప్ కట్స్ సీన్ల వెనుక..

సినిమా స్థితిగతుల్ని, రూపురేఖల్ని మార్చేయడంతో పాటు సాహిత్యరంగం మీద కూడా తన ప్రభావం చూపించిన మహా దర్శకుడు, ఫ్రెంచ్ న్యూ వేవ్ (Nouvelle Vague) సినిమాకి ఆద్యుడైన దర్శకుడు గొడార్డ్ (Jean-Luc Godard ఝా-లుక్ గోడా) మంగళవారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ నిర్మాణానికి సంబంధించి విప్లవాత్మకమైన మార్పుకు కారణమైన ఆ దిగ్దర్శకుడి ప్రభావం మన తెలుగు సినిమా మీద ఉందా? 


ఉందని చెప్పడానికి పెద్ద నిదర్శనం - తెలుగులో ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి మార్గదర్శకుడు, తెలుగు సినిమాని అంతర్జాతీయ నవ్య చలనచిత్ర వేదిక మీద నిలబెట్టిన బి నరసింగరావు! ‘జబ్ ఖేత్ జాగే ‘అనే కిషన్ చందర్ నవలను మా భూమి పేరిట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చిత్రంగా తెరకెక్కించిన నరసింగరావు ఆ తర్వాత దాసి, మట్టిమనుషులు, హరివిల్లు వంటి సినిమాలు తీసి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. 


"గొడార్డ్ ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ప్రభావంతోనే నా రంగుల కలలో జంప్ కట్స్ (jump cuts) పలు సన్నివేశాల్లో తొలిసారిగా వాడాను," అన్నారు నరసింగరావు, చిత్రజ్యోతితో మాట్లాడుతూ. 


కళ కళ కోసం కాదు, సమాజం కోసం అనే సందేశమే కథాంశంగా తీసిన సినిమా రంగులకల (1983). స్వీయదర్శకత్వంలో నిర్మించడమే కాకుండా అందులో కథానాయకుడిగా నటించారు నరసింగరావు. సమాజం పట్ల కళాకారుడి బాధ్యతని గుర్తుచేసే ఆ సినిమా, ఆంధ్రాంగ్ల కవి, దర్శకుడు, చిత్రకారుడు అయిన ఆయన ఆటోబయోగ్రాఫికల్ అంటారు విశ్లేషకులు. ఆ సినిమాలో కొన్ని షాట్స్, సీన్స్ గమనిస్తే కచ్చితంగా గోడార్డ్ ప్రభావం కనబడుతుందని అంటారు నరసింగరావు.


జంప్ కట్స్ అంటే ఏమిటి?  

జీవితం- ఎవరి జీవితమైనా నల్లేరు మీద బండి నడక కాదు. ఎన్నో ఒడిదుడుకులు... మిట్టపల్లాలు... ఆటుపోట్లు. అటువంటి జీవితాన్ని చిత్రిస్తున్నప్పుడు అంతా సరళరేఖలా సజావుగా ఎలా ఉంటుంది? కాబట్టి లీనియర్ కథన శైలి కుదరదు, నాన్ లీనియర్ పద్ధతేదో కావాలి. అస్తవ్యస్తంగా... అడ్డదిడ్డంగా దూకుతుంది కాలమనే కళ్లాలు లేని గుర్రం. చిత్రనిర్మాణంలో ఒక షాట్ నుంచి మరో షాట్ కి దూకుతుంది. అలా మారిపోయే షాట్స్ మధ్య అంతసూత్రం వంటి సబ్జెట్ మారదు, కానీ, దృశ్యం మారిపోతుంది. ఆ జంప్ కట్స్ వల్ల కాలంతో పాటు కథ కదను తొక్కుతుంది. 


"బ్రెత్ లెస్ - సినిమాలో ఎన్నో సీన్లు ఉన్నాయి. ఒకటి చెబుతాను. హీరో Michel Poiccard దొంగతనం చేసిన కారులో హీరోయిన్ Patricia Franchini ని ఎక్కించుకొని పారిస్ నగరవీధుల్లో తిరుగుతూ చెప్పే ఒకే డైలాగులో ఎన్నో షాట్లు మారిపోతుంటాయి. అదే టెక్నిక్ రంగులకల సినిమాలో కనిపిస్తూంది. జబ్బుపడిన హీరో లేచి, పక్క గదిలోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకొని, మళ్లీ మంచం మీద పడుకునేంత వరకూ మధ్యలో జఫ్ కట్స్ వాడాను,” అన్నారు నరసింగరావు.  


అయితే, గొడార్డ్ ప్రభావం రంగులకలతో ముగిసిపోయిందని, తర్వాత తార్కోవిస్కీ వైపు మరలిపోయాననీ చెప్పారాయన. 


"సినీరంగంలోకి అడుగుపెట్టక ముందే గొడార్డ్ సినిమాలన్నీ చూసేశాను. అన్నీ గొప్పవే. ముగ్గురు వ్యక్తుల మధ్య ప్రణయబంధాన్ని పలుకోణాల్లో వివిధ దృక్కోణాల్లో అద్భుతంగా చూపిన గొడార్డ్ సినిమా 'Every Man for Himself (Sauve Qui Peut (la vie)' సినిమా అంటే ఎక్కువ ఇష్టం. ఆ తర్వాత నా మీద అమిత ప్రభావం చూపినవాడు తార్కోవిస్కీ," అన్నారు.   

                                                           ***

Updated Date - 2022-09-16T03:45:53+05:30 IST