మూడో వారానికే బాక్సులు తిరిగెళ్లాయి!

ABN , First Publish Date - 2022-09-04T08:45:23+05:30 IST

దర్శక మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘గీతాంజలి.’ ప్రేమ కథాచిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచి పోయిన ఈ చిత్రం నాగార్జునకు మంచి గుర్తింపు తెచ్చింది.

మూడో వారానికే బాక్సులు తిరిగెళ్లాయి!

ర్శక మణిరత్నం తెలుగులో  దర్శకత్వం వహించిన ఏకైక  చిత్రం ‘గీతాంజలి.’   ప్రేమ కథాచిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచి పోయిన ఈ చిత్రం నాగార్జునకు మంచి గుర్తింపు తెచ్చింది. మూడేళ్ల మూస  నట జీవితం నుండి బయటపడి,   నాగార్జున తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో గీతాంజలి నటించే అవకాశం రావడం ఆయన అదృష్టమేనని చెప్పాలి. ఇందులోని హీరో పాత్ర  కోసం ముందు ఏవేవో పేర్లు అనుకున్నా తన కథకు తగ్గ నాయకుడు నాగార్జున అని మణిరత్నం ఫిక్స్‌ అయ్యారు. కొత్త నటి గిరిజను  హీరోయిన్‌గా ఎన్నుకొన్నారు. ఊటీ బ్యాక్‌ డ్రాప్‌ లో గీతాంజలి చిత్రాన్ని రూపొందించారు. మరి కొన్ని నెలల్లో  మరణించ బోయే ఓ యువ జంట మధ్య జరిగే  ప్రేమ, గొడవలను అద్భుతంగా తెరకెక్కించారు మణిరత్నం. ఇళయరాజా సంగీతం  ఈ సినిమాకు  ఓ ఎస్సెట్‌ అయింది. 


అయితే ఈ సినిమా కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. ‘హీరో, హీరోయిన్లు ఇద్దరికీ క్యాన్సరా.. ఇదేం సినిమా బాబోయ్‌’ అన్నారు. తప్పకుండా ప్లాప్‌ అవుతుందని ఫిక్స్‌ అయి, ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. కానీ సినిమా మీద నమ్మకంతో నిర్మాత నరసారెడ్డి తనే స్వయంగా ముఖ్య మైన కేంద్రాల్లో విడుదల చేశారు. ఊహించినట్లుగానే మొదటి మూడు వారాలూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రమే. చాలా ఊళ్లలో 21 రోజులకే బాక్సులు తిరిగి వెళ్లిపోయాయి. అయినా నిర్మాత నరసారెడ్డి వెనక్కి తగ్గలేదు. నాలుగో వారం కూడా సినిమాను కొనసాగించమన్నారు. చివరకు సినిమా మీద ఆయనకు ఉన్న నమ్మకమే నిజమైంది. నాలుగో వారం నుండి ‘సినిమా బాగుంది... పాటలు సూపర్‌’ అనే టాక్‌ రావడంతో క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. సినిమా సూపర్‌ హిట్‌ అయి, క్లాసిక్స్‌లో  ఒకటిగా నిలిచింది. సినిమాలో హీరోయిన్‌గా నటించిన గిరిజకు కూడా మంచి పేరు వచ్చింది. ఆమెకు తెలుగు రాకపోయినా, భాష నేర్పించారు. తన అభినయంతో, అల్లరితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు గిరిజ. ఆమెకే కాదు ఆమె ధరించిన దుస్తులు కూడా ఆ రోజుల్లో పాపులర్‌ అయ్యాయి. ‘గీతాంజలి డ్రెస్‌’ పేరుతో ఆ రకమైన దుస్తులు తయారు చేసి, చాలా మంది సొమ్ము చేసుకున్నారు. ‘గీతాంజలి’ చిత్రం తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటించిన గిరిజ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 

Updated Date - 2022-09-04T08:45:23+05:30 IST

Read more