‘భీమ్లానాయక్‌’ విడుదల.. ఏపీ సర్కారు వ్యూహం ఏంటి?

ABN , First Publish Date - 2022-02-01T21:05:40+05:30 IST

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏం చర్చించుకున్నారో, కొన్ని నెలలుగా వాయిదాలకే పరిమితమైన సినిమాల విడుదల గురించి ప్రణాళికలు ఎలా రాశారో తెలీదు కానీ సోమవారం ఒక్కసారిగా భారీ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సంక్రాంతికి విడుదల అనుకుని ఆగిన సినిమాలు ఒక్కసారిగా క్యూ కట్టాయి. దీనిని బట్టి నిర్మాతలంతా కూర్చుని రిలీజ్‌ డేట్లు క్లాష్‌ అవ్వకుండా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘భీమ్లానాయక్‌’ విడుదల.. ఏపీ సర్కారు వ్యూహం ఏంటి?

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏం చర్చించుకున్నారో, కొన్ని నెలలుగా వాయిదాలకే పరిమితమైన సినిమాల విడుదల గురించి ప్రణాళికలు ఎలా రాశారో తెలీదు కానీ సోమవారం ఒక్కసారిగా భారీ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సంక్రాంతికి విడుదల అనుకుని ఆగిన సినిమాలు ఒక్కసారిగా క్యూ కట్టాయి. దీనిని బట్టి నిర్మాతలంతా కూర్చుని రిలీజ్‌ డేట్లు క్లాష్‌ అవ్వకుండా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల వ్యవస్థ, టికెట్‌ రేట్ల గురించి ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే. సినీ పెద్దలు ఎన్ని చర్చలు జరిపినా ఈ సమస్య ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. రాజకీయపరమైన కారణాలతో ‘వకీల్‌ సాబ్‌’ విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కటువుగా వ్యవహరించి బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్లకు అనుమతులు ఇవ్వని సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌ చిత్రాలకు బెనిఫిట్‌ షోలకు అనుమతి, టికెట్‌ రేట్లు బావుంటేనే మంచి వసూళ్లు రాబడతాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్‌ రేట్స్‌ ప్రకారం  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, భీమ్లానాయక్‌’, ‘సర్కారువారి పాట’ చిత్రాలను విడుదల చేస్తే లాభాల బాటను పక్కనపెడితే  పెట్టుబడికి తగ్గ వసూళ్లు రావడం కూడా కష్టమే. 

ఈ సమస్యలను చర్చించడానికి ఇటీవల చిరంజీవి, వై.ఎస్‌ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ‘జగన్‌ సినిమా పరిశ్రమ పట్ల సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’ అని చిరంజీవి చెప్పడంతో మున్ముందు పరిశ్రమకు అంతా మంచి రోజులే అని మేకర్స్‌ భావించారు. అయితే చిరంజీవి జగన్‌ని కలిసి రెండువారాలు కావొస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కనీసం ఈ నెలాఖరుకైనా టికెట్‌ రేట్స్‌ పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంటుందని టాలీవుడ్‌ నిర్మాతలు ఆశిస్తున్నారు. ఆ ధైర్యంతోనే నిర్మాతలంతా  తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారని తెలుస్తోంది. 


అయితే ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచితే పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదలకు ముందు పెంచుతారా? తర్వాత పెంచుతారా అన్న అనుమానం కూడా ఉంది.  ఎందుకంటే జగన్‌ – పవన్‌ల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వాటికి చెక్‌ పెడుతూ... ‘భీమ్లా నాయక్‌’ చిత్ర బృందం తెలివిగా అడుగులు వేసిందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 25, ఏప్రిల్‌ 1న ‘భీమ్లానాయక్‌’ సినిమా విడుదల అంటూ రెండు తేదీలను ప్రకటించారు. అయితే ఏప్రిల్‌ ఒకటో  తేదినే సినిమాను విడుదల చేస్తారని సమాచారం. మార్చి 11న ‘రాధేశ్యామ్‌’, 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైతే... ఆ రెండు సినిమాలకూ బెనిఫిట్‌ షోలకు అనుమతి, టికెట్‌ రేట్స్‌ పెంచుకోవడానికి పర్మిషన్స్‌ వస్తే.. ఆ తర్వాత విడుదలయ్యే ‘భీమ్లా నాయక్‌’కు కూడా బెనిఫిట్‌ షోస్‌ వేసుకోవడానికి, టికెట్‌ రేట్స్‌ పెంచుకోవడానికి వీలు ఉంటుంది. ఆ తర్వాత రానున్న ‘ఎఫ్‌ 3’, ‘ఆచార్య’. ‘సర్కారు వారి పాట’కు కూడా అదే రూల్‌ వర్తిస్తుంది. మధ్యలో విడుదలయ్యే ఒక సినిమా కోసం కొత్త నిబంధనలు తీసుకురావడం కుదరదు. ఒకవేళ అలా చేస్తే పవన్‌పై కక్ష సాధింపు చర్య అని జనాలకు తెలియక మానదు. దీనితో ‘భీమ్లానాయక్‌’ విడుదల విషయంలో ఏపీ సర్కార్‌ వ్యూహాలు ఎలా ఉంటాయనే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది.  


Updated Date - 2022-02-01T21:05:40+05:30 IST