Aditi Rao Hydari: బాత్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చా.. మణిరత్నం వల్లే ఇలా..
ABN , First Publish Date - 2022-10-30T15:07:47+05:30 IST
సినీ పరిశ్రమలో ఎవరి అండ లేకుండా ఎదిగి, స్టార్ హోదా దక్కించుకొన్న కథానాయికలు అరుదుగా ఉంటారు. అదితిరావు హైదరీని ఈ జాబితాలో చేర్చొచ్చు...

సినీ పరిశ్రమలో ఎవరి అండ లేకుండా ఎదిగి, స్టార్ హోదా దక్కించుకొన్న కథానాయికలు అరుదుగా ఉంటారు. అదితిరావు హైదరీని ఈ జాబితాలో చేర్చొచ్చు. ‘చెలియా’, ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’... ఇలా ఏ సినిమా చేసినా తన ముద్ర తప్పకుండా ఉండేలా చూసుకుందామె. బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి హిట్లున్నాయి. తన ప్రస్థానం గురించి చెప్పమంటే... ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయింది.
మణిరత్నం వల్లే...
‘‘ అమ్మానాన్నది ప్రేమ వివాహం. మొదట్లో బాగానే ఉండేవారు. కానీ ఆ తరవాత విడిపోయారు. అమ్మ నన్ను ఢిల్లీ తీసుకొని వెళ్లిపోయింది. అక్కడ వ్యాపారాలు చూసుకుంటూ అమ్మ బిజీ అయ్యింది. నాన్న మరో పెళ్లి చేసుకొన్నారు. అయితే మా మీద ఆయనకు ప్రేమ ఉండేది. తరచూ మమ్మల్ని చూడడానికి ఢిల్లీ వచ్చేవారు. అందుకే నాన్నపై కోపం ఉండేది కాదు. నా జీవితాన్ని తీర్చిదిద్దింది, నాలో స్ఫూర్తి నింపింది అమ్మే. నాన్నతో విడిపోయాక... అమ్మ కూడా మరో పెళ్లి చేసుకోవొచ్చు. కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించి ఒంటరిగా ఉండిపోయింది. చిన్నప్పుడు మణిరత్నం సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ఆయన వల్లే సినిమాలపై ప్రేమ పుట్టింది. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకొన్నా. అది కూడా ఇటువైపు రావడానికి ఉపయోగపడింది. సినిమాలపై నాకున్న ప్రేమ చూసి, అమ్మ భయపడలేదు. ‘నెగ్గుకు రాగలవా?’ అని అడిగేదంతే.’’
అమ్మనాన్న పేరుతో కలిపి..
‘‘నా పేరు చూసి అంతా ఉత్తరాది అమ్మాయిని అనుకుంటారు. కానీ నేను అచ్చమైన తెలుగు అమ్మాయిని. తెలంగాణలోని వనపర్తిలో పుట్టా. అమ్మ పేరు విద్యారావు. నాన్న నిషాన్ హైదరీ. అమ్మానాన్న పేరు కలుపుకొని అదితిరావు హైదరీ అయ్యాను. తాతయ్య నిజాం కాలంలో హైదరాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మా అమ్మమ్మ శాంతారామేశ్వరరావుకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ‘లేడీ హైదరీ’ పేరుతో ఓ టెన్నిస్ క్లబ్ కూడా నిర్వహించేవారు. అక్కడ మహిళలకు టెన్నిస్‌లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. నాన్న కూడా టెన్నిస్ ప్లేయరే. నేను కూడా బాగానే ఆడేదాన్ని. నన్ను జాతీయ జట్టుకు పంపాలని అనుకొన్నారు. కానీ అనుకోకుండా సినిమా నటినయ్యా.’’
తొలి అవకాశం అలా..
‘‘భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన తరవాత... దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శలు ఇచ్చాను. ఓసారి నా నృత్య ప్రదర్శనకు తమిళ దర్శకురాలు శారద రామనాథ్ వచ్చారు. ఆమెకు నా నాట్యం బాగా నచ్చింది. ఆమె నాట్యం తెలిసిన ఓ కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. తన సినిమాలో నాకు హీరోయిన్ పాత్ర ఇచ్చేశారు. కానీ ఆ సినిమా విడుదలలో చాలా జాప్యం జరిగింది. అయినా సరే ఇక్కడే రాణించాలని ఫిక్సయిపోయాను. ఎక్కడకు వెళ్లినా అవమానాలే. కానీ అమ్మ ముందు ఏడిస్తే తను బాధ పడుతుందని బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని.’’
ఆ ప్రశంస చాలు..
‘‘తొలి సినిమా ఆగిపోయినా, రెండో సినిమా విడుదలైంది. నటిగా నాకు మంచి పేరొచ్చింది. ఆ సినిమా చూశాక మణిరత్నం సార్ ‘చెలియా’లో ఛాన్స్ వచ్చింది. అది చూసే ఇంద్రగంటి మోహనకృష్ణ గారు ‘సమ్మోహనం’లో ఆఫర్ ఇచ్చారు. దాంతో తెలుగునాట మంచి గుర్తింపు వచ్చింది. ఓసారి అమితాబ్ ‘నీలో ఏదో మ్యాజిక్ ఉంది. తెరపై నువ్వు కనిపిస్తే చూపు తిప్పుకోలేం’ అన్నారు. అంత గొప్ప వ్యక్తి మెచ్చుకుంటే ఆస్కార్ అందుకొన్నట్టు అనిపించింది.’’
గర్వంగా ఉంటుంది..
‘‘ప్రతి రంగంలోనూ పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. సినిమాల్లో కూడా అంతే. నా గురించి కూడా చాలా రాశారు. చాలాసార్లు బాధపడ్డా. నెగిటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ల గురించి ఆలోచిస్తే మనక్కూడా ఆ దుర్గంధం అంటుతుంది. ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రన ఎవరూ ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్లిపోరు. ‘ఎప్పటికైనా హిట్టు కొడతాం’ అనే సానుకూల దృక్పథంతోనే ఆలోచిస్తారు. ఇంత గొప్ప రంగంలో ఉన్నందుకు గర్వపడుతుంటా.’’

