సినిమా రివ్యూ: ‘విరాట పర్వం’(Virata parvam)
ABN , First Publish Date - 2022-06-17T19:54:18+05:30 IST
‘విరాటపర్వం’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ బజ్ ఉన్న సినిమా. నక్సలిజానికి ప్రేమకథను జోడించిన ఈ చిత్రానికి ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైప ట్రైలర్‌లో ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇదీ నా కథ’ అంటూ సాయిపల్లవి చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తి రేకెత్తించింది. 1990–92 వరంగల్‌కు చెందిన మహిళ తూము సరళను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇతివృత్తానికి ప్రేమకథను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నక్సలిజం నేపథ్యంలో ఈ ప్రేమకథ ఎలా సాగిందోచూద్దాం.

సినిమా రివ్యూ: ‘విరాట పర్వం’(Virata parvam)
విడుదల తేది: 17–06–2022
నటీనటులు: రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, సాయిచంద్, ఈశ్వరీరావు, నందితా దాస్, నవీన్‌చంద్ర, బెనర్జీ, వీరశంకర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, డానీ సాంచెజ్ లోపేజ్
సంగీతం: సురేశ్ బొబ్బిలి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, డి.సురేశ్‌బాబు
దర్శకుడు: వేణు ఊడుగుల. (Venu udugula)
‘విరాటపర్వం’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ బజ్ ఉన్న సినిమా. నక్సలిజానికి ప్రేమకథను జోడించిన ఈ చిత్రానికి ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న వేణు ఊడుగుల దర్శకత్వం వహించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైప ట్రైలర్‌లో ‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇదీ నా కథ’ అంటూ సాయిపల్లవి చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తి రేకెత్తించింది. 1990–92 వరంగల్‌కు చెందిన మహిళ తూము సరళను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇతివృత్తానికి ప్రేమకథను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నక్సలిజం నేపథ్యంలో ఈ ప్రేమకథ ఎలా సాగిందోచూద్దాం. (Virata parvam movie review)
కథ:
ములుగు జిల్లాలో ఒగ్గుకథలు చెప్పే కుటుంబంలో పుట్టిన అమ్మాయి వెన్నెల (సాయిపల్లవి). తల్లిదండ్రులు (సాయిచంద్, ఈశ్వరీరావు)లకు ఏకైక బిడ్డ. ఆమె జననమే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎదురు కాల్పులు జరిగే సమయంలో డాక్టరు, మహిళా మావోయిస్టు అయిన నివేదా పేతురాజ్ ఒకావిడకి పురుడు పోసి పుట్టిన బిడ్డకు వెన్నెల అని నామకరణం చేస్తుంది. వెన్నెల పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న (రానా దగ్గుబాటి) రాసిన విప్లవాత్మక పుస్తకాలు చదివి అతని ప్రేమలో పడుతుంది. పెళ్లి, పిల్లలు, సంసారం ఇవేమీ కోరుకోకుండా తనతో జీవితాంతం దళంలో ఉండాలని ఆశపడుతుంది. తల్లిదండ్రులు తన బావ రాహుల్ రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ పెళ్లి నిర్ణయం నచ్చని వెన్నెల రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులకు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. రవన్న కోసం పల్లెలు, అడవుల చుట్టూ తిరిగి అతనిని కలుసుకుంటుంది. తన ప్రేమ వ్యవహారాన్ని అతనితో పంచుకుంటుంది. ‘దళం అంటేనే ఎన్నో త్యాగాలు చేయాలి’ అంటూ అతను తిరస్కరిస్తాడు. వెన్నెల రవన్నను కలవడానికి, కలిసిన తర్వాత ఎలాంటి సవాళ్లలను ఎదుర్కొంది. తన ప్రేమ సఫలం అయిందా. చివకికి ఆమె జీవితం ఏమైంది? అన్నది మిగతా కథ. (Virata parvam movie review)
విశ్లేషణ...
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నక్సల్స్ నేపథ్యంలో ఎన్నో సినినిమాలొచ్చాయి. అయితే వాటిలో నక్సల్స్, రాజకీయ నాయకులు, పోలీసులతో పోరు ఈ అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు. నక్సలిజం కథకు ఓ అందమైన ప్రేమకథను జోడించి చూపించడం ‘విరాట పర్వం’ ప్రత్యేకత. 1992లో జరిగినయథార్థ సంఘటన తూము సరళను మావోయిస్ట్‌లు కాల్పి చంపడం అప్పట్లో చర్చనీయాశంమైంది. ఆమె కథే ఈ సినిమాకు ముడి సరుకు అయింది. సరళ కథ స్ఫూర్తితోనే ఈ సినిమా తీసినట్లు దర్శకుడు కూడా చెప్పుకొచ్చారు. ఒక వీరుడు మరణిస్తే వందల వీరులు పుడతారు అనే నానుడికి అద్దంపట్టేలా. ఓ విప్లవ నేత నేలకొరిగింది. మరో విప్లవ స్వాప్నికురాలు (వెన్నెల) జన్మించింది అనే భావాన్ని పండించారు దర్శకుడు. అక్కడి నుంచేకథ మొదలవుతుంది. ‘ఒక యుద్థం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ అదే యుద్థం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల. ఇది నా కథ’ అంటూ సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకులు వెన్నెల ప్రేమకథతో ట్రావెల్ అయ్యేలా చేశారు. ఆంక్షలు, హద్దులు గీయని తండ్రి ప్రేమలో వెన్నెల పెరుగుతుంది. స్వేచ్చగా విహరించే పిల్లల హృదయవికాసం ఎంత సున్నితంగా ఉంటుందో చక్కగా చెప్పారు దర్శకుడు. వెన్నెల ఎదుగుదల అంతా వికాసమే. అది ఎంత అంటే నా జీవితం నాకు ఇష్టమొచ్చినట్లు ఉంటా అనేంత. హద్దులు లేని పిల్లలు ఎంత దైర్యంగా హుందాగా ఉంటారో.. అన్యాయాలను అంతే తెగువతో ఎదుర్కొంటారని, విప్లవ భావాలున్నవారు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని తెరపై ఆవిష్కరించారు. పస్టాఫ్ అంతా వెన్నెల మీదే సాగుతుంది. తన తండ్రిపై పోలీసులు చేసిన దౌర్జన్యంపై తిరగబడిన సన్నివేశంలో సాయిపల్లవి నటన ఆకట్టుకుంది. అదే సమయంలో రవన్న ఎంట్రీ, పేదలను రక్షించడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ప్రథమార్ధానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే పోలీసులు ఎంటర్ అయిన ప్రతిసారీ సీన్‌లు రిపీట్ అయిన భావన కలిగింది. ఆ సందర్భంలో రవన్న పాత్ర కొంత వరకూ ఆ భావన కలగకుండా చేసింది. సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్ లో ఉన్న వెన్నెలను రవన్న దళం వ్యూహాత్మకంగా తప్పించడం, ప్రొఫెసర్ శకుంతల(నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్ అందుకుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. వెన్నెల కోవర్టు అని నమ్మించడానికి పోలీసులు ఆడిన నాటకంతో నిజంగానే వెన్నెల ఇన్‌ఫార్మర్ అని నమ్మి భారతక్క ఇన్‌వెస్టిగేట్ చేసే సన్నివేశం, ఆ సందర్భంలో వెన్నెల పాత్ర తన ఆలోచనలు వివరించే తీరు మనసుకు హత్తుకుంటుంది. రవన్న తల్లిని కలిసిన సందర్భంలో పోలీస్ ఫైరింగ్ సన్నివేశం, రవన్నపై వెన్నెలకు ఉన్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సమాజానికి మంచి చేయాలనే తపన, రవన్న విప్లవాత్మక రచనల ప్రభావంతో ఆతనిపై మనసుపడి, తనతోనే జీవితం అనుకుని దళంలో అడుగుపెట్టిన ఓ మహిళ చేయని పొరపాటుకు ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో భావోద్వేగాన్ని కలిగించాలి, గుండెల్ని పిండేలా సన్నివేశం చిత్రీకరించాలి. అయితే సినిమా క్లైమాక్స్‌లో సాగే ఆ సన్నివేశంలో దర్శకుడు ఆ భావోద్వేగాన్ని కలిగించలేకపోయాడు. చాలా సన్నివేశాల్లో అదే జరిగింది.
వేణు రచయిత కావడంతో మాటల్ని తూటాల్లా రాశారు.
‘మీరాభాయి కృష్ణుడు కోసం కుటుంబ సభ్యులను ఎలా వదిలేసి వెళ్లిపోయిందో! అలానే నీకోసం నేను వస్తున్నాను’
నీ ప్రేమ కోసం కమ్యూనిస్ట్‌లా మారిన నా కళ్లల్లో నిజాయతీ కనిపిస్తలేదా...
‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది’
నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ అంటూ వెన్నెల చెప్పిన మాటలు
‘చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థ్థాపించగ ఎళ్లినాడు’,
‘రక్తపాతం లేనిదెప్పుడు చెప్పు..మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’.
‘మా ఊళ్లో ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీవాళ్లు వచ్చారు సార్? పోలీసులు కూడా పట్టించుకోలేదు. అన్నలు వచ్చారు.. నోరు లేని సమాజానికి నోరు అందించారు’ అంటూ సాగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
(Virata parvam movie review)

ఆర్టిస్ట్‌ల నటన విషయానికొస్తే రవన్న పాత్రలో రానా ఇమిడిపోయారు. ఆయన గళం, నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కథ అనుకున్నప్పుడు వెన్నెల పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారు దర్శకుడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెన్నెల పాత్రలో జీవించింది సాయి పల్లవి. సగటు పల్లెటూరి అమ్మాయిగా అద్భుతమైన నటన కనబర్చింది. కట్టు, బొట్టు, యాస అంతా కూడా చక్కగా కుదిరాయి. దళ సభ్యులుగా ప్రియమణి కీలక పాత్రలో కనిపించారు. అలాగే రఘన్న పాత్రలో నవీన్‌చంద్ర ఇమిడిపోయారు. ఇతర పాత్రధారులు సాయిచంద్; ఈశ్వరీరావు, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే... ఈ సినిమా సురేశ్ బొబ్బిల సంగీతం ప్రధాన బలం. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ కథ కాలానికి తగ్గట్టు కుదిరింది. ఫస్టాఫ్‌లో శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కాస్త క్రిస్ప్ చేసుండాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి. భావోద్వేగాలు పండించడంపై దర్శకుడు కాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. విప్లవాత్మక సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ రియాలిటీ మిస్ అయిన భావన కలిగింది. 1990ల్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో దర్శకుడు చక్కగా చూపించారు.
మనిషి మాట్లాడే ఏ భాషలోనైనా విప్లవం అనే పదం నిరీక్షణను రేకెత్తించేదిగా, ప్రేమను పురికొల్పేదిగా నమ్మకాన్ని ఉద్రేకపరిచేదిగా ఉంటుంది. చరిత్రలో విప్లవం కావాలన్న ఆలోచన అనేక మంది విప్లవకారులను తయారు చేసింది. దారి తెన్ను తెలియని స్ర్తీ, పురుషులకు ఒక గమ్యం ఏర్పరచి దాని కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం విప్లవం అంటే. ప్రేమ విప్లవం ఈ రెండు విడదీయలేని అంశాలు. ఆ మాట కొేస్త ప్రేమించలేని వ్యక్తి విప్లవకారుడు కాలేడు. ఇప్పుడు ప్రేమనూ విప్లవాన్ని ఒక జుగల్ బందిగా ‘విరాటపర్వం’ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల తెరమీద ఆవిష్కరించారు. విప్లవం ఒక ప్రేమైక చర్య అని ఈ చిత్రంలో చెప్పారు. (Virata parvam movie review)
ట్యాగ్‌లైన్: విప్లవం ప్రేమైక చర్య.
