Alluri film review: మాస్ యాక్షన్ సినిమా

ABN , First Publish Date - 2022-09-24T01:49:02+05:30 IST

శ్రీవిష్ణు నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరుంది. అందువల్ల అతని సినిమాలు విడుదల అయినపుడు కొంతమంది ప్రేక్షకులు ఆసక్తితో వుంటారు. ఇప్పుడు మొదటి సారిగా శ్రీవిష్ణు పోలీస్ పాత్రలో 'అల్లూరి' సినిమా చేసాడు.

Alluri film review: మాస్ యాక్షన్ సినిమా

సినిమా: అల్లూరి(Alluri)

నటీనటులు: శ్రీ విష్ణు(Sri vishnu), కాయదు లోహర్, సుమన్, తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర తదితరులు 

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రాఫర్: రాజ్ తోట

నిర్మాత: బెక్కెం వేణుగోపాల్ 

రచన - దర్శకత్వం: ప్రదీప్ వర్మ (Pradeep varma)


- సురేష్ కవిరాయని 


శ్రీవిష్ణు (Sri vishnu)నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తాడన్న పేరుంది. అందువల్ల అతని సినిమాలు విడుదల అయినపుడు కొంతమంది ప్రేక్షకులు ఆసక్తితో వుంటారు. ఇప్పుడు మొదటి సారిగా శ్రీవిష్ణు పోలీస్ పాత్రలో 'అల్లూరి'  సినిమా చేసాడు. ఇది ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు కి సంబందించినది కాదు, కానీ కథానాయకుడు అయిన పోలీస్ పాత్రకి ఆ పేరు పెట్టారు. ప్రదీప్ వర్మ దీనికి దర్శకుడు. ఈ సినిమా ఆర్ధిక పరమైన  ఇబ్బందుల వల్ల మధ్యాహ్నం నుండి విడుదల చేసారు. (Alluri film review)


కథ: 

హైదరాబాద్ లో పదవీ విరమణ చేసిన పోలీస్ కానిస్టేబుల్ (తనికెళ్ళ భరణి) కొడుకు ఎస్ ఐ ట్రైనింగ్ కోసం మూడు సంవత్సరాలు కష్ట పడతాడు కానీ, నోటిఫికేషన్ రాకపోతే, ఇంకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అంటాడు. అప్పుడు తనికెళ్ళ భరణి కొడుకుని అల్లూరి (శ్రీ విష్ణు) అనే పోలీస్ ఆఫీసర్ గురించి తెలుసుకోమంటాడు. కొత్తవలస అనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అల్లూరి గురించి అక్కడ వున్న కానిస్టేబుల్ ని అడగమంటాడు. ఆ కానిస్టేబుల్ అల్లూరి గురించి చెప్పడం ఆరంభిస్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ కథ మొదలవుతుంది. అల్లూరి సీతారామరాజు (శ్రీ విష్ణు) అలియాస్ ఎ ఎస్ రామరాజు కొత్తవలస పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా చేరి, తన వంటి మీదున్న ఖాకీ బట్టలకి ప్రాముఖ్యం ఇస్తూ, చాలా హానెస్ట్, సిన్సియర్ గా తన భాద్యతలు నెరవేరుస్తూ ఉంటాడు. మొదట లోకల్ ఎం. పి. అండతో చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటాడు. పై అధికారులు అల్లూరి ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికి చేసిన, తన భాద్యతలు సక్రమంగా చేస్తూ వున్నా అల్లూరి ని కమిషనర్ (సుమన్) హైదరాబాద్ రమ్మంటాడు. హైదరాబాద్ వచ్చి, ఏమి  చేసాడు, అక్కడ  వున్న ప్రొబ్లెమ్స్ ఎలా సాల్వ్ చేసాడు అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ: 

దర్శకుడు ప్రదీప్ వర్మ అల్లూరి కథలో కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ కథ కొన్ని జరిగిన సంఘటనల ఆధారంగా తీసినవి అని చెప్పారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆలా అనిపించదు. ఎక్కువగా సినిమాటిక్ సన్నివేశాలే  ఉంటాయి. అయితే అల్లూరి క్యారెక్టర్ ని డిజైన్ చేసే విధానం బాగుంది. మొదటి నుండీ సినిమా ఎక్కువగా యాక్షన్ మీదే ఎక్కువ నడుస్తుంది. ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ కథ అన్నప్పుడు, కథ కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటే బాగుండేది. అలాగే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటే బాగుండేది. ప్రదీప్ వర్మ తీసుకున్న కథ మంచిదే కానీ, చెప్పే విధానంలో పూర్తిగా యాక్షన్ సినిమా గా అయిపొయింది. పోలీస్ వ్యవస్థలో మార్పు తెచ్చాడు అని చెప్పినప్పుడు అందులోని లోటుపాట్లు చెప్పి ఇంకా కొంచెం ఆసక్తికరంగా చెపితే బాగుండేదేమో. అల్లూరి అనే పోలీస్ ఆఫీసర్, నీతి నిజాయితీ తో పనిచేస్తూ సీరియస్ గా వుండే సమయంలో మధ్యలో కొన్ని రొమాంటిక్ పాటలు పెట్టడం తో సినిమా సీరియస్ గా చూస్తున్న ప్రేక్షకుడికి ఆ ఆసక్తి పోతుంది. ఈ పాటలు డిస్ట్రాక్షన్ గా ఉంటాయి. (Alluri film review)


ఇంకా నటీనటులు విషయానికి వస్తే శ్రీ విష్ణు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అల్లూరి పాత్రలో మెప్పించాడు. ఇంతవరకు యాక్షన్ సినిమాలు చెయ్యలేదు, ఈ సినిమా తో ఆ జానర్ కూడా టచ్ చేసాడు. కానీ అతని మీద ఆ రొమాంటిక్ సాంగ్స్ మాత్రం చాలా  ఆడ్ గా కనిపించింది. కాయదు లోహర్ కథానాయికగా నటించింది. ఆమె బాగానే చేసింది, అలాగే సినిమాలో గ్లామర్ గా కనపడుతుంది. రాజా రవీంద్ర, సుమన్, తనికెళ్ళ భరణి అందరూ సీనియర్ నటులు అందుకని వారికీ ఇలాంటివి చెయ్యడం మామూలే కాబట్టి బాగానే సపోర్ట్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం బాగుంది, ముఖ్యంగా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ సంగీతం కావాలి, అది బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ చాల బాగా తీశారు. మొదటి హాఫ్ కొంచెం నత్తనడక నడిచినా, సెకండ్ హాఫ్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం మీద అల్లూరి ఒక మాస్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కన్నా, ఫ్రంట్ బెంచి లో కూర్చున్న ప్రేక్షకులకి నచ్చే అవకాశం వుంది. బి, సి సెంటర్ లలో సినిమా ఆడొచ్చు. (Alluri film review)


ట్యాగ్ లైన్ : మాస్ యాక్షన్ సినిమా  

Updated Date - 2022-09-24T01:49:02+05:30 IST