సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా

ABN , First Publish Date - 2022-02-18T19:23:56+05:30 IST

చాలా ఏళ్ల తర్వాత విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. కొన్నాళ్ళకు నటనకు దూరంగా ఉన్న ఆయన ఫుల్ లెంత్ రోల్ లో సినిమా అంతా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అయింది? మోహన్ బాబు ఈ సినిమాతో అంచనాలు అందుకున్నారా? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా

చిత్రం : సన్ ఆఫ్ ఇండియా

విడుదల తేదీ : 18 ఫిబ్రవరి, 2022

నటీనటులు : మోహన్ బాబు, మీనా, పోసాని కృష్ణమురళి, రవిప్రకాశ్, శ్రీకాంత్, రాజారవీంద్ర, సుప్రీత్ రెడ్డి, నరేశ్, ఆలీ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రగ్యా జైస్వల్, బండ్ల గణేశ్ తదితరులు.

సంగీతం : ఇళయరాజా

సినిమాటోగ్రఫీ : సర్వేష్ మురారి

నిర్మాణం : లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్

నిర్మాత : మంచు విష్ణు

స్ర్కీన్ ప్లే : యం. మోహన్ బాబు

దర్శకత్వం : డైమండ్ రత్నబాబు

చాలా ఏళ్ల తర్వాత విలక్షణ నటుడు మోహన్ బాబు  హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’.  కొన్నాళ్ళకు నటనకు దూరంగా ఉన్న ఆయన ఫుల్ లెంత్ రోల్ లో సినిమా అంతా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు  రీచ్ అయింది? మోహన్ బాబు ఈ సినిమాతో అంచనాలు అందుకున్నారా? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ 

విరూపాక్ష (మోహన్ బాబు ) ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. చాలా సాధారణ జీవితం లీడ్ చేస్తూ తన కుటుంబమే సర్వంగా బతుకుతుంటాడు ఆయన. అలాంటి ఆయన జీవితం ఒక రాజకీయ నాయకుడి ( పోసాని కృష్ణమురళి) కారణంగా నాశనమవుతుంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యాకూతుళ్లని పోగొట్టుకుంటాడు. తాను చేయని తప్పుకు జైలు పాలవుతాడు. ఆ తర్వాత విరూపాక్ష తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ఎలా పగతీర్చుకుంటాడు? సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎలా స్పందించాడు అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ 

కేవలం ఓటీటీ కోసమే రాసుకొని, తీసిన సినిమా ఇది. ఆ విషయాన్ని ప్రీరిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు డైమండ్ రత్నబాబే రివీల్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించారు.  సినిమా రన్ టైమ్ 1గంట 25 నిమిషాలు.  మోహన్ బాబు ఏకపాత్రాభినయం చేసి ప్రయోగం చేశారు.  ఈ విషయాన్ని సినిమా ప్రారంభంలో కార్డ్ వేసివ మరీ చెప్పారు మోహన్ బాబు. సినిమాలో తానొక్కడ్నే కనిపించబోతున్నానని, మిగిలిన 25 పాత్రలు క్లైమాక్స్ లో కనిపిస్తాయని క్లారిటీ ఇచ్చారు. కొన్ని వందల సినిమాల్లో చూసిన కథాకథనాల్నే సన్ ఆఫ్ ఇండియా చిత్రం కోసం రాసుకున్నారు. కాకపోతే కొన్ని పొలిటికల్ పంచులు, సమకాలీన సమాజంపై పేల్చిన కొన్ని సెటైర్స్ బాగున్నాయి. కథాకథనాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగుతాయి. రాజకీయ నాయకుడి కారణంగా తన కుటుంబాన్ని కోల్పోవడం. వారిమీద పగ తీర్చుకోవడం.. అని ఒక్క ముక్కలో సినిమా కథని చెప్పేయొచ్చు. అయితే ఈ కథలో ఏముందని మోహన్ బాబే స్వయంగా నిర్మించి నటించారన్నది అంతుబట్టదు. లిమిటెడ్ బడ్జెట్ కు  తగ్గట్టుగానే ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. అలాగే పలు బోరింగ్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని తగ్గించేశాయి. రొటీన్ కథను మరింత రొటీన్ గా దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పక తప్పదు. 


విరూపాక్షగా మోహన్ బాబు జీవించారని చెప్పాలి. కులాల గురించి చెప్పే డైలాగ్‌లోనూ, పొలిటికల్ సెటైర్స్ పేల్చడంలోనూ తన మార్కు చూపించారు. ఆయన భార్యగా మీనా కనిపించేది ఒక్క షాట్ లోనే. అలాగే.. మిగిలినవారంతా సింగిల్ డే కాల్షీట్స్ కలిగిన నటీనటులు. ఆలీ, బండ్లగణేశ్, సునీల్, వెన్నెల కిషోర్ లను యాంకర్స్ గా చూపించారు. అలాగే శ్రీకాంత్, రాజారవీంద్ర , తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటుల్ని రెండు మూడు సీన్స్ కే సరిపెట్టారు. అలాగే ఇళయరాజా సంగీతం ఒక్క పాటకే పరిమితమైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే వారిచేత చేయించారని అర్ధమవుతుంది. మొత్తం మీద మోహన్ బాబు చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి చేసిన ప్రయోగం.. తీసిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’.  మోహన్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ చూడదగ్గ చిత్రం. 

ట్యాగ్ లైన్ : ఒన్ మేన్ షో

Updated Date - 2022-02-18T19:23:56+05:30 IST