సినిమా రివ్యూ : ‘సీతారామం’ (sitaramam)

ABN , First Publish Date - 2022-08-05T20:24:37+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా నటించిన రెండో సినిమా ‘సీతారామం’. ప్రేమకథల్ని ఎంతో అందంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు హను రాఘవపూడి ఈ సారి యుద్ధాన్ని, ప్రేమను ముడివేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు.

సినిమా రివ్యూ : ‘సీతారామం’ (sitaramam)

చిత్రం : ‘సీతారామం’

విడుదల తేదీ : ఆగస్ట్ 5, 2022

నటీనటులు: దుల్ఖర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, రష్మికా మందణ్ణ, సుమంత్, శత్రు, వెన్నెల కిషోర్, మహేష్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, జిషుసేన్ గుప్తా, భూమికా చావ్లా, సునీల్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ తదితరులు

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

ఛాయాగ్రహణం : పీయస్ వినోద్

నిర్మాణం : వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్

దర్వకత్వం : హను రాఘవపూడి

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా నటించిన రెండో సినిమా ‘సీతారామం’. ప్రేమకథల్ని ఎంతో అందంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు హను రాఘవపూడి ఈ సారి యుద్ధాన్ని, ప్రేమను ముడివేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో అంచనాల్ని పెంచేసిన ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? వారికి ఏ స్థాయిలో కనెక్ట్ అయింది అనే విషయాలు తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్ళాల్సిందే. (sitaramam movie review)


కథ 

లెఫ్టినెంట్ రామ్ (దుల్ఖర్ సల్మాన్) హైదరాబాద్‌లో ఉండే సీతామహాలక్ష్మి (మృణాళ్ ఠాకూర్) కి రాసిన ఉత్తరం తన గమ్యస్థానానికి చేరడానికి పాకిస్థాన్‌లో 20 ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని సీతకి అప్పగించే బాధ్యత ఆఫ్రిన్ (రష్మికామందణ్ణ)పై పడుతుంది. అది ఆమె తాతయ్య (సచిన్ ఖేడ్కర్) ఆఖరి కోరిక.  ఆ ఉత్తరాన్ని చేర్చాల్సిన చోట చేరిస్తే తప్ప ఆమెకు తన ఆస్థిలో చిల్లిగవ్వ కూడా దక్కదని ఆయన వీలునామాలో రాస్తాడు. అందుకే ఇష్టంలేకపోయినా ఆ ఉత్తరం పట్టుకొని హైదరాబాద్ వస్తుంది ఆఫ్రిన్. ఆ ప్రయాణంలో రామ్ గురించి, సీతా మహాలక్ష్మి గురించి ఆసక్తికరమైన ఎన్నో విషయాలు తెలుస్తాయి ఆమెకు. అసలు సీతకోసం రామ్ రాసిన ఉత్తరం పాకిస్థాన్ లో అంతకాలం ఎందుకు ఉండిపోతుంది? అసలు ఆ ఉత్తరాన్ని ఆఫ్రినే ఎందుకు గమ్యానికి చేర్చాలి? రామ్, సీతల ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిందా లేదా? చివరికి ఆ ఉత్తరం సీతామహాలక్ష్మి చేతికి చేరుతుందా? అనేది మిగతాకథ. (sitaramam movie review)


విశ్లేషణ

యుద్ధం, ప్రేమ.. రెండూ వేరు వేరు నేపథ్యాలు. మొదటిది ప్రాణాన్ని పణంగా పెట్టి చేసేది, మరొకటి ప్రాణంగా భావించేది. ఈ రెండు నేపథ్యాల జెర్నీయే సీతారామం. గతంలో ఎన్నో ప్రేమకథలు వచ్చి ఉంటాయి కానీ..  ఇంత అందమైన, పరిపక్వమైన ప్రేమకథ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. లెఫ్టినెంట్ రామ్ ఒక అనాథ. తన కొలీగ్స్ అందరికీ వారి కుటుంబాల నుంచి ఉత్తరాలు వస్తుంటాయి. కానీ అతడికి ఎవరూ రాయరు. అలాంటి పరిస్థితుల్లో అతడికి సీతా మహాలక్ష్మి అనే పేరుతో ఒక అమ్మాయి ఉత్తరాలు రాయడంతో అతడికి సరికొత్త జీవితంలోకి ప్రవేశించిన ఫీలింగ్ కలుగుతుంది.ఏ చిరునామా నుంచి వచ్చాయో తెలియ లేని ఆ ఉత్తరాల్ని పదే పదే చదువుకుంటూ.. రోజు ఆమె ఉత్తరాల కోసం ఎదురు చూపులు చూడడం అతడి దినచర్య అయిపోతుంది. సడెన్ గా ఒక రోజు రామ్ కు సీతను కలిసే అవకాశం దొరుకుతుంది. ఇద్దరి మధ్యా స్నేహం మొగ్గతొడుగుతుంది. అది ప్రేమగా మారుతుంది. నన్ను పెళ్ళి చేసుకుంటావా? అని అడిగిన రామ్ కు సీతనుంచి సమాధానం రాదు. దానికి వేరే కారణం ఉంటుంది. ఈ జెర్నీని ఎంతో అందంగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అని దర్శకుడు దీనికి ట్యాగ్ లైన్ గా ఎందుకు పెట్టాడన్న విషయం సినిమా చూశాకా అర్ధమవుతుంది. దీనికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు దర్శకుడు. యుద్ధ వాతావరణంలో కథ మొదలవుతుంది. అది కాశ్మీర్ తీవ్రవాదంపై ఉండడంతో, దానికి, వీరి ప్రేమకథకు సంబంధం ఏంటని అనిపిస్తుంది. వారి ప్రేమకథ ఎప్పుడు మొదలవుతుంది అనే ఆసక్తి మొదలవుతుంది. దానికి చివర్లో ఇచ్చిన జెస్టిఫికేషన్ మెప్పిస్తుంది. 


ఉత్తరాల ఆధారంగా సీతను రామ్ అన్వేషించే దగ్గర నుంచి ఇదో ప్రేమకథగా మారిపోతుంది. సీత జాడను రామ్ పట్టుకోవడం, ఆమెతో జెర్నీచేయడం ఎంతో పొయటిక్ గా ఉంటుంది. రామ్ సీతతో పలికే డైలాగ్స్ ఎంతో పొయటిక్ గా ఉంటాయి. స్వతహాగా మలయాళీ అయిన దుల్ఖర్ అలాంటి డైలాగ్స్‌ను అద్భుతంగా చెప్పడం అతడి ప్రతిభకి నిదర్శనం. మధ్యలో వెన్నెలకిషోర్, సునీల్ , అచ్యుత్, మురళీ శర్మల కామెడీ అంతగా అతకలేదు. అదొక్కటి తప్ప సీతారామం ప్రథమార్ధంలో కంప్లైంట్సేవీ లేవు. పాటలు కథలో భాగంగా వస్తాయి. ఒక అనూహ్యమైన ట్విస్ట్ తో ఇంట్రవెల్ వస్తుంది. దాంతో మరింతగా ఆసక్తి మొదలవుతుంది. 


సెకండాఫ్‌లో కథనం మరింత ఆసక్తిగా ఉంటుంది. అసలు కథ మొదలయ్యేది అక్కడే. ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. రామ్, సీత పాత్రలతో మనమూ ట్రావెల్ అవుతాం. ఇక ఇందులో సుమంత్ చేసిన విష్ణు శర్మ పాత్ర కథలో ఎంతో కీలకమైంది. ముందు సాదాసీదాగా అనిపించినా.. కథను కీలకమలుపు తిప్పే పాత్ర అదే అని తర్వాత తెలుస్తుంది. ఆ పాత్ర వల్ల కథ స్వరూపమే మారిపోతుంది. అలాగే రష్మికా మందణ్ణ చేసిన ఆఫ్రిన్ పాత్రకు చివరిలో మంచి ట్విస్ట్ ఇచ్చి.. తన బ్రిలియన్సీని నిరూపించుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రకు ఇచ్చిన ముగింపు వల్ల సినిమాకి మరింత అందం వచ్చింది. ఒక ప్రేమకథకు ఉద్వేగభరితమైన ముగింపు లభిస్తే అలాంటి కథలు ప్రేక్షకుల్ని కలకాలం వెంటాడుతాయి. అలాంటి ప్రేమకథే సీతారామం. 


లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండే అన్నట్టు ఎంతో సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కళ్ళతో రొమాన్స్ ను పలికించి, చిరునవ్వుతో భావాన్ని పండించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అలాగే సీత పాత్రకు కొత్తమ్మాయి మృణాళ్ ఠాకూర్ జీవం పోసింది. తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని మరీ ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కదిలించింది.  పొగరుబోతు ఆఫ్రిన్ పాత్రలో రష్మికా తన ప్రత్మేకతను చూపించింది. ఆ పాత్రలోని మార్పును క్యారీ చేస్తూ అదరగొట్టింది. విష్ణుశర్మగా సుమంత్ సైతం తన పాత్రకు న్యాయం చేశారు. ఆ పాత్రలోని సర్ ప్రైజింగ్ యాంగిల్ జనాన్ని ఆకట్టుకుంటుంది.  పాకిస్థానీ ఆర్మీ ఆఫీసర్ గా సచిన్ ఖేడ్కర్ పాత్ర కూడా ప్రేక్షకుల్లో గుర్తుండిపోతుంది. మొత్తం మీద ‘సీతారామం’ అనే పీరియాడికల్ లవ్ స్టోరీతో దర్శకుడు హనురాఘవపూడి ఒక మంచి అనుభూతినిచ్చాడు. (sitaramam movie review)

ట్యాగ్ లైన్ : ఎమోషన్స్‌తో రాసిన ప్రేమకథ

Updated Date - 2022-08-05T20:24:37+05:30 IST