సినిమా రివ్యూ: భీమ్లా నాయక్‌

ABN , First Publish Date - 2022-02-25T18:53:24+05:30 IST

గత ఏడాది ‘వకీల్‌సాబ్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన పవన్‌కల్యాణ్‌ ఈ ఏడాది ‘భీమ్లానాయక్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారనే వార్త బయటకు రాగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి

సినిమా రివ్యూ: భీమ్లా నాయక్‌

సినిమా: భీమ్లా నాయక్‌

విడుదల: 25–02–2022

నటీనటులు: పవన్‌కల్యాణ్‌, రానా, నిత్యామీనన్‌, సంయుక్త మీనన్‌, తనికెళ్ల భరణి, మురళీశర్మ, సముద్రఖని, రావు రమేశ్‌, సంజయ్‌ స్వరూప్‌, బ్రహ్మానందం, సాయి తదితరులు.

సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సితార సంస్థ

మాటలు–స్ర్కీన్‌ప్లే: త్రివిక్రమ్‌

దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర. 


గత ఏడాది ‘వకీల్‌సాబ్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన పవన్‌కల్యాణ్‌ ఈ ఏడాది ‘భీమ్లానాయక్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది.  ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి  నటిస్తున్నారనే వార్త బయటకు రాగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 


కథ..

భీమ్లా నాయక్‌(పవన్‌కల్యాణ్‌) కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ ేస్టషన్‌లో నిజాయతీ గల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తారు. డానియల్‌ శేఖర్‌(రానా) రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. ఒక రోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవిలో ప్రయాణిస్తుండగా అక్కడ జరిగిన తనిఖీల్లో పోలీసులకు దొరుకుతాడు. ఈ క్రమంలో పోలీసులను కొట్టి వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లానాయక్‌.. డానియల్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేస్తాడు. దీంతో అతడి ఈగో హర్ట్‌ అవుతుంది. నాయక్‌ను ఎలాగైనా దెబ్బ తీయాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకు డానియల్‌ ఏం చేశాడు. నాయక్‌ ఉద్యోగం ఎందుకు పోయింది? ఒకరినొకరు చంపుకొనే వరకూ వెళ్లడానికి కారణమేంటి? చివరికి ఎవరు గెలిచారు అన్నది కథ. ఆసక్తికర సంభాషణలు: 

‘బెదిరించాలంటే వార్నింగ్‌ ఇస్తా... 

కొట్టాలంటే కొడతా..’’

‘‘నేరస్తుల తల బరువుగా ఉంటుంది అందుకే దించుకుని ఉండాలి...

సైనికుల తల పొగరుతో ఉంటుంది.. అందుకే ఎత్తుకుని ఉంటుంది..

పోలీసుల తల బాధ్యతగా ఉంటుంది అందుకే నిటారుగా ఉంటుంది సర్‌...’’

‘‘తొక్కితే మొలుస్తా...

దింపితే లెగుస్తా

ఆపలేని యుద్థం ఇస్తా’’

‘నాయక్‌ పెళ్లాం అంటే నాయక్‌లో సగం కాదు డబల్‌..’

‘శుక్రవారం సంతకం’ అనే డైలాగ్‌ పొలిటికల్‌ అర్థాలు వెతుక్కునే వాళ్లకి బాగా కనెక్ట్‌ అవుతాయి. 


ట్యాగ్‌ లైన్‌: భీమ్లానాయక్‌’ పవన్‌ పవర్‌ తాండవం! విశ్లేషణ..

ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మాతృకలో కథ. అదే లైన్‌ను ‘అహంకారానికి– ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్థం’ అంటూ ‘భీమ్లానాయక్‌’ చిత్ర బృందం ట్రైలర్‌లో తెలిపారు. ప్రీ రిలీజ్‌ వేడుకలోనూ వెల్లడించారు. ఇందులో అహంకారంతో ప్రతీకారం తీర్చుకునే బలమైన వ్యక్తిగా రానా, ఆత్మగౌరవం గల పోలీస్‌గా పవన్‌కల్యాణ్‌ కనిపించారు. ఇద్దరు స్టార్‌డమ్‌ ఉన్న హీరోలను ఒకే సినిమాలో బ్యాలెన్స్‌ చేస్తు చూపించడం కత్తి మీద సాము లాంటిదే. పైగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో ఆయా హీరోల ఇమేజ్‌కు తగ్గట్లు ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా చూపించడం అంటే అది మరో సవాల్‌. పవన్‌కల్యాణ్‌లాంటి కల్ట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో పాత్రను, మరో బలమైన హీరోతో సమానంగా అభిమానులు శాటిస్‌ఫై అయ్యేలా తెరకెక్కించడం చిత్ర బృందానికి పరీక్షే అనాలి. అయితే ఈ విషయంలో ‘భీమ్లా’ టీమ్‌ 100 శాతం విజయం సాధించింది. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కోరుకునే అంశాలు మిస్‌ కాకుండా, రానా ఇమేజ్‌కు తగ్గట్లు సన్నివేశాలను మేళవించి తీర్చిదిద్దారు. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే... పవన్‌కల్యాణ్‌ ఎనర్జీ తెరపై కనిపించింది. ప్రతి సన్నివేశంలోనూ తనదైన మార్క్‌ నటన చూపించారు. పోరాట సన్నివేశాల్లోనూ అతి లేకుండా చేశారు. నాయక్‌ – డానియేల్‌ మధ్య సాగే ప్రతి సన్నివేశం –సంభాషణ నువ్వా – నేనా అన్నట్లు సాగుతాయి. అయితే తెరపై ప్రధాన పాత్రలు ఎన్ని ఉన్నా ప్రేక్షకుడి దృష్టి పవన్‌కల్యాణ్‌ – రానాలు పాత్రల వైపే ఉంటుంది. తన అహాన్ని మాటల్లో, చేతల్లో, చూపుల్లో కరెక్ట్‌గా చూపించాడు రానా. నాయక్‌ పాత్రకు సరైన పోటీ అన్నట్లుగా ఆయన నటన ఉంది. సుగుణ పాత్రలో నిత్యామీనన్‌ అలరించింది. పవన్‌–నిత్యాల మధ్య సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. సీఐ కోదండరాంగా మురళీశర్మ, డానియల్‌ భార్యగా సంయుక్త మీనన్‌, డేనియల్‌ తండ్రిగా సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేశ్‌ కూడా తనదైన శైలిలో అలరించారు. బ్రహ్మానందం, సునీల్‌ అలా తళుక్కుమన్నారు. రవి కె.చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నైట్‌ ఎఫెక్ట్‌, డ్రోన్‌ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. సెకెండాఫ్‌లో నవీన్‌ నూలి ఇంకాస్త షార్ప్‌గా వ్యవహరించి ఉండే కథ నడక ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. అడవి గురించి, మనుషుల మధ్య బంధాల గురించి మాటల మాంత్రికుడు రాసిన సంభాషణలు అలరించాయి. టేకింగ్‌లో సాగర్‌ చంద్ర ప్రతిభ కనిపించింది.  తమన్‌ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌. ఆడియోలో పెద్ద హిట్‌ అయిన ‘అంత ఇష్టమేందయ్య’ పాటను నిడివి రీత్యా  సినిమాలో కట్‌ చేశారు. ఇక నిర్మాణం విషయంలో సితార సంస్థ ఎక్కడ తగ్గలేదు. 


పరభాషా చిత్రాన్ని తెలుగులోకి రీమేక్‌ చేయాలంటే చాలా లెక్కలుంటాయి. ఉన్నది ఉన్నట్లు తీయలేరు. హీరోల తాలుక ఇమేజ్‌ ఒక అడ్డు. మార్పులు చేర్పులు చేసి ప్యాచ్‌ చేయడం అంత సులభం కాదు. భాష, ఆ ప్రేక్షకులకు తగ్గ సెన్సిబిలీటీస్‌ ఇలా చాలా విషయాలను బ్యాలెన్స్‌ చేయాలి. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ అనగానే ఇలాంటి చాలా అనుమానాలు రాకపోలేదు. దానికి తోడు పవన్‌, రానాలతో తీస్తున్నారంటే పవన్‌ ఇమేజ్‌ కోసం రానా పాత్రని తగ్గించేస్తారని, వ్యాపారాత్మక విలువలు జోడిస్తారని రకరకాల ఊహాగానాలు సినిమా ప్రారంభంలోనే మొదలయ్యాయి. సన్నివేశాల రాత.. తీత సరిగ్గా తెలిస్తే ఎలాంటి కథ అయినా దూసుకెళ్లిపోతుంది. ఈ చిత్రం విషయంలో అదే జరిగింది. మాతృకకు పెద్దగా మార్పులు చేయకుండా పవన్‌కల్యాణ్‌ కోసం కొన్ని ఎపిసోడ్లు ప్రత్యేకంగా రాసుకున్నారు. పవన్‌ ప్లాష్‌బ్యాక్‌ అనేది మలయాళ సినిమాలో లేదు. దానిని ‘లాలా భీమ్లా’ పాటలో చూపించి ఆ సీన్‌ను క్లైమాక్స్‌లో వాడుకున్నారు. పతాక సన్నివేశాల ముందువచ్చే ట్విస్ట్‌ బావుంది. సిస్టర్‌ సెంటిమెంట్‌, బలమైన ఎమోషన్‌తో సినిమాను ముగించిన తీరు బావుంది.


Updated Date - 2022-02-25T18:53:24+05:30 IST