Karthikeya 2 review :‘కార్తికేయ 2’ రివ్యూ

ABN , First Publish Date - 2022-08-13T20:22:41+05:30 IST

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించే యంగ్ హీరో నిఖిల్.. తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. సూపర్ హిట్టైన ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి దర్శత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ రోజే (ఆగస్ట్ 13) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది.

Karthikeya 2 review :‘కార్తికేయ 2’ రివ్యూ

చిత్రం : కార్తికేయ 2 (Karthikeya 2 review)

విడుదల తేదీ : ఆగస్ట్ 13, 2022

నటీనటులు : నిఖిల్ సిద్దార్ధ్(Nikhil), అనుపమా పరమేశ్వరన్(Anupama parameswaran), శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రవీణ్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, అప్పాజీ అంబరీష, తులసి తదితరులు

సంగీతం : కాలభైరవ

ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ : కార్తిక్ ఘట్టమనేని

నిర్మాణం : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

దర్శకత్వం : చందు మొండేటి(Chandoo mondeti)

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించే యంగ్ హీరో నిఖిల్.. తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. సూపర్ హిట్టైన ‘కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. చందుమొండేటి దర్శత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ రోజే (ఆగస్ట్ 13) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది? నిఖిల్ ఖాతాలో మరో హిట్టు పడుతుందా?  లేదా? అన్న విషయాల్ని రివ్యూలోచూద్దాం..  (Karthikeya 2 telugu movie review)


కథ

కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్. చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి. సమస్యను వెతుక్కుంటూ వెళితే సమాధానం దానంతటదే దొరుకుతుందని నమ్మడం అతడి సిద్ధాంతం. ఒక సమస్యను ఛేదించడానికి ఎంతదూరమైనా వెళ్ళే మనస్తత్వం కలిగిన అతడు.. తన తల్లి మొక్కును తీర్చడానికి ఆమెతో కలిసి శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాల్లో అతి విశిష్టమైన ద్వారకా నగరం చేరుకుంటాడు. అక్కడ అనూహ్య పరిస్థితుల్లో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతలో ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్)  అతడ్ని అక్కడి నుంచి తప్పిస్తుంది. ముగ్ధ ఎవరు?  కార్తికేయ అడ్డు తొలగించడానికి డాక్టర్ శాంతను ముఖర్జీ ఎందుకు ప్రయత్నిస్తాడు? భగవత్సంకల్పంగా అతడు ద్వారక ఎందుకు రావాల్సి వస్తుంది? ఆ ప్రయత్నంలో అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరికి కార్తికేయ అనుకున్నది సాధించాడా? అన్నది మిగతా కథ. (Karthikeya 2 telugu movie review)


విశ్లేషణ 

శ్రీకృష్ణ తత్వంలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని శోధించి సాధిస్తే.. మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ అపార జ్ఞానాన్ని ఆయన తన కాలి కంకణంలో నిక్షిప్తం చేస్తాడు. ఆయన అవతార పరిసమాప్తి జరిగాక..  దాన్ని అర్హులైన వారికి అందజేయమని ఒకరికి అప్పగించి అంతర్ధానమవుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించాకా ద్వారాకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. దాని రహస్యం దాగి ఉన్న  ఒక గ్రంధం గ్రీస్ దేశంలోని ఒక లైబ్రరీలో ఉంటుంది. ప్రముఖ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుప్త దాని రహస్యం తెలుసుకొని .. ఇండియా బైలుదేరతాడు. ఈ సన్నివేశంతో సినిమా ఎంతో ఆసక్తికరంగా టేకాఫ్ అవుతుంది. అసలు ఆ ధర్మ కంకణం అప్పటినుంచి ఇప్పటి వరకూ ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అది బైటికి ఎలా వస్తుంది ? అనే ఆసక్తి కలుగుతుంది. డాక్టర్ కార్తికేయ దైవికంగా ద్వారక వెళ్ళడం.. దీంతో ఎలాంటి సబంధం లేని, భగవంతుడి మీద అసలు నమ్మకమే లేని అతడు.. ఆ రహస్యాన్ని తెలుసుకోడానికి బైలు దేరడం.. ఆ ప్రయత్నంలో ఎన్నో అనుభవాల్ని చవిచూడడం.. ఆ జెర్నీ  ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. 


కథకథనాల్ని ఏ మాత్రం పక్కదారి పట్టించకుండా.. తను అనుకున్న పాయింట్ ను నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు చందు మొండేటి. ఆ ప్రయత్నంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా.. కార్తికేయ కేరకర్టరైజేషన్.. అతడ్ని ఈ మహాకార్యానికి పురిగొలిపే పలు సంఘటనలతో సినిమాని నడిపించిన దర్శకుడు.. అనూహ్యమైన, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండఫ్ పై మరింత ఆసక్తిని కలగచేశాడు.  సెకండాఫ్‌లో కార్తికేయ పాత్రతో మనల్ని ట్రావెల్ అయ్యేలా చేయగలిగాడు. అడుగడుగునా ఉత్కంఠను రేపుతూ సన్నివేశాలు రేసీగా సాగుతాయి. కడియానికి సంబంధించిన క్లూస్ ఒకోటి కనిపెట్టి.. దాన్ని సాధించేవరకూ ప్రయాణంలో వచ్చే ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఎంతగానో థ్రిల్ చేస్తుంది. విజువల్ పరంగా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి.. ప్రేక్షకుల్ని మేస్మరైజ్ చేస్తుంది. కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పటికీ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని సస్టైన్ చేయడంలో సఫలీకృతుడయ్యాడు. మరో పక్క అబేరులు అనే శ్రీకృష్ణ భక్త బృందం. ఆయనకి సంబంధించిన వస్తువుల్ని ఎవరు ముట్టుకున్నా వారిని చంపుకుంటూ వెళుతుంటారు. కార్తికేయ బృందానికి కూడా వాళ్ళు అడ్డు తగులుతారు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచిపోతుంది. దైవత్వం, శాస్త్రీయ దృక్పథం రెండు వేరు విరుద్ధమైన అంశాల్ని సమతూకంగా చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది. (Karthikeya 2)


డాక్టర్ కార్తికేయ (Karthikeya 2)పాత్రకు నిఖిల్ ప్రాణం పెట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి కష్టం బాగా కనిపిస్తుంది. అతడి మేకోవర్ కూడా ఆకట్టుకుంటుంది. అవసరం మేరకే అతడిపై యాక్షన్ సన్నివేశాలు వస్తాయి. ముగ్ధగా అనుపమా పరమేశ్వరన్ ఎంతో సహజంగా నటించి మెప్పించింది. ధన్వంతరిగా అనుపమ్ ఖేర్ కనిపించేది కొంతసేపే అయినా.. శ్రీకృష్ణునిపై ఆయన చెప్పే డైలాగ్స్ గొప్పగా అనిపిస్తాయి. శ్రీకృష్ణుడు భగవంతుడే కాదు.. అంతకు మించి అని ఆయన ఇచ్చే వివరణ ఈ కథాంశానికి ఎంతో బలం చేకూర్చుతుంది. శ్రీనివాసరెడ్డి కామెడీ టైమింగ్, వైవా హర్ష సెటైర్స్ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి. విలన్ గా ఆదిత్యా మీనన్ పర్వాలేదనిపిస్తాడు. అభేరుడు పాత్రధారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాడు. కార్తిక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. కాలభైరవ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచిపోతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి కార్తికేయ 2 చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాడు దర్శకుడు చందు మొండేటి. రొటీన్ సినిమాలు చూసి చూసి విసుగొచ్చిన ప్రేక్షకుల్ని ఈ సినిమా అద్భుతంగా ఎంగేజ్ చేస్తుంది.  (Karthikeya 2 telugu movie review)


ట్యాగ్ లైన్ :  స్పిరిట్యువల్ థ్రిల్లర్ 

Updated Date - 2022-08-13T20:22:41+05:30 IST