Like, Share and Subscribe film review: లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్ చెయ్యటం కష్టమే!

ABN , First Publish Date - 2022-11-05T16:49:35+05:30 IST

ఈ వారం సుమారుగా ఏడెనిమిది చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి 'లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' (Like, Share and Subscribe).

Like, Share and Subscribe film review: లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్ చెయ్యటం కష్టమే!

సినిమా: లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్

నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, నెల్లూరు సుదర్శన్, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి, సుదర్శన్  తదితరులు 

ఛాయాగ్రహణం: ఎ వసంత్ 

రచన దర్శకత్వం: మేర్లపాక గాంధీ 

నిర్మాత: వెంకట్ బోయనపల్లి 


-- సురేష్ కవిరాయని 


ఈ వారం సుమారుగా ఏడెనిమిది చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి 'లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' (Like, Share and Subscribe). 'ఏక్ మినీ కథ' (Santosh Sobhan of Ek Mini Katha fame) తో అందరిని మెప్పించిన సంతోష్ శోభన్, అలాగే అదే సినిమాతో వినోద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు మేర్లపాక గాంధీ (Director Merlapaka Gandhi), మరోసారి 'లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అనే సినిమాతో కలిశారు. ప్రభాస్, నాని వంటి స్టార్ నటులు ఈ సినిమాను బాగా సపోర్ట్ చెయ్యడం, (Prabhas and Nani supported this small film) అలాగే సినిమా ప్రచార వీడియోస్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రం మీద అందరి దృష్టి పడింది. 'జాతి రత్నాలు' లో నటించిన ఫరియా అబ్దుల్లా (Jaathi Ratnalu fame Fariya Abdullah) ఇందులో కథానాయిక. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం.


#Like,Share&Subscribe story కథ:

విప్లవ్ (సంతోష్ శోభన్) ఒక యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్, అందమయిన ప్రాంతాలను, అలాగే వివిధ రకాలు అయినా వీడియోస్ ని తన గువ్వా విహారి అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటాడు. ఇలా తన వీడియోస్ తో మిలియన్ల కొద్దీ సబ్ స్క్రైబర్స్ ని తెచ్చుకొని పాపులర్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమం లోనే అరకు వస్తాడు, అక్కడి ప్రకృతి అందాలను బంధించి యూట్యూబ్ లో పెట్టడానికి. వసుధ (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయి ఇంకో యూట్యూబ్ బ్లాగర్ కూడా అరకు వస్తుంది. ఆమెకు 3 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ వుంటారు. వసుధ పెట్టిన వీడియోస్ అన్నిటికీ విప్లవ్ కామెంట్ పెడుతూ ఉంటాడు, అలాగే ఆమె తనకి స్ఫూర్తి అని కూడా అంటూ అంటాడు, ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు కూడా. మొదట్లో వసుధ ఇష్టపడడు విప్లవ్ ని, కానీ పోను పోనూ ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈలోగా పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పి.పి.ఎఫ్) అనే నక్సల్ దళం వీళ్ళని కిడ్నాప్ చేస్తుంది. వసుధ ఇంతకీ ఎవరి కూతురు, ఈ దళం వీళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసింది, వీళ్ళు ఎవరిని చంపాలని అనుకుంటున్నారు అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ:

దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక మంచి రచయిత. సినిమా మొదలు పెట్టడం ఒక సీరియస్ ఇష్యూతో మొదలెట్టాడు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమా కథ మొదలుపెట్టి, ట్రావెల్ బ్లాగర్స్ తో కలిపి సంధానించాలని అనుకున్నాడు. ఇలా ఒక సీరియస్ సబ్జెక్టు ఒక పక్క, అలాగే వినోదం అందించాలని ఇంకో పక్క అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాని నేరేట్ చెయ్యాలి. కానీ మేర్లపాక గాంధీ రెండిటిని కూడా సరిగ్గా చూపించలేకపోయాడు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అనేది ఒక సీరియస్ సబ్జెక్టు, సంఘర్షణతో కూడుకున్నది, వాళ్ళని హాస్యానికి వాడుకో కూడదు. కానీ ఇక్కడ గాంధీ తప్పు చేసాడు. వాళ్ళని ఆసక్తికరంగా చూపిస్తూ ఉండాలి. పోనీ ఆలా అని వినోదాన్ని కూడా సరిగ్గా చూపడా అంటే, అదీ లేదు. కథలో ఎదో మిస్ అయినట్టు కనపడుతూ ఉంటుంది. భావోద్వేగాలు కూడా అంతగా లేదు. సినిమా మొదటి 15 నిముషాలు చాల బాగా తీసాడు. 90 లో కథ మొదలయి ఆ తరువాత నక్సల్స్, ప్రభుత్వం తో చర్చలకు రావటం, నక్సల్ నాయకులూ కనిపించకుండా పోవటం అవన్నీ చాలా ఆసక్తికరంగా తీసాడు. కానీ ఆ తరువాతే సినిమా గాడి తప్పేది. ఆటో ఆ నక్సల్స్ కథని సరిగ్గా చెప్పలేక, ఇటు ఈ ట్రావెల్ బ్లాగర్స్ తో వినోదాన్ని సరిగ్గా పండించలేక సతమతం అయ్యాడని అనిపిస్తుంది. 


అలాగే వసుధ, విప్లవ్ ల మధ్య కామెడీ మామూలుగా వుంది, కొన్ని సన్నివేశాలు నవ్వును తెప్పిస్తాయి అంతే. అలాగే నక్సల్స్ గ్రూప్ బ్రహ్మన్న సారధ్యం లో విప్లవ్, వసుధలను కిడ్నాప్ చేసాక, అది హాస్య సన్నివేశాలకి ఉపయోగించటం అంతగా పండలేదు. కిడ్నాప్ జరిగాక, కథ కొంచెం సీరియస్ గా ఉంటుంది అనుకున్న సమయంలో సిల్లీ హాస్య సన్నివేశాలు పెట్టి కొంచెం బోర్ కొట్టించాడు. నక్సల్స్ బొత్తిగా నాలెడ్జి లేనివాళ్ళని దళం లోకి తీసుకుంటారా? అసలు గాంధీ కి ఆ ఐడియా ఎలా వచ్చింది, వాళ్ళని హాస్యానికి ఉపయోగించడమే తప్పు. అక్కడే సినిమా సగం చెడిపోయింది. ఇంకా ముగింపు కూడా అనుకున్నట్టుగా లేకపోవటం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్. పాటలు సన్నివేశానికి తగ్గట్టుగా లేకపోవటం ఇంకో మైనస్. 


ఇంకా నటీనటుల విషయానికి వస్తే, సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ బాగున్నాయి, కరెక్టుగా కుదిరాడు. అలాగే ఫరియా అబ్దుల్లా కూడా బాగా నటించింది. ఆమె పాత్రని ఇంకా కొంచెం బలంగా రాస్తే బాగుండేది. బ్రహ్మాజీ ఒక ముఖ్యమయిన పాత్రలో కనిపిస్తాడు, అలాగే నవ్వులు పండిస్తాడు. బ్రహ్మాజీ ఉండబట్టే సినిమా ఆ మాత్రం అయినా నిలబడింది అని అనుకోవచ్చు. అలాగే పైరసీ ఫోటోగ్రాఫర్ గా సుదర్శన్ పరవాలేదు అనిపించదు. మిగతా పాత్రల్లో అందరూ వారి వారి పరిధుల మీరా నటించారు. ఇంకా మాటలు కూడా మామూలుగా వున్నాయి, పదునుగా లేవు, సంగీతం పరవాలేదు అనిపించే విధంగా వుంది. వసంత్ సినిమాటోగ్రఫీ బాగుంది. 

చివరగా, మేర్లపాక గాంధీ 'లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' అంతగా పండలేదు అని అనుకోవచ్చు. అటు ఒక సీరియస్ సబ్జెక్టు బ్యాక్ డ్రాప్ గా తీసుకొని వినోదాన్ని పండించే ప్రయత్నం చేసాడు గాంధీ కానీ, రెండూ చెయ్యలేకపోయాడు. జబర్దస్త్ స్కిట్స్ లాగ కొన్ని సన్నివేశాలు వున్నాయి. ప్రేక్షకులు లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్' చెయ్యడం కష్టమే. 

Updated Date - 2022-11-05T16:49:35+05:30 IST