సినిమా రివ్యూ: గని

ABN , First Publish Date - 2022-04-08T21:16:50+05:30 IST

తెలుగుతెరకు స్పోర్స్ట్‌ కథలు కొత్తేమీ కాదు. ‘తమ్ముడు’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘జెర్సీ’, ‘గురు’ ఇలా చాలా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘గని’. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదాపడుతూ వచ్చింది. బాక్సింగ్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని వరుణ్‌ ఈ సినిమా చేశారు. బాక్సింగ్‌ రింగ్‌లో ‘గని’ ఇచ్చిన పంచ్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా రివ్యూ: గని

సినిమా రివ్యూ: గని

నటీనటులు: వరుణ్‌తేజ్‌, సయీ మంజ్రేకర్‌, జగపతిబాబు, నదియా, ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నరేశ్‌, నవీన్‌ చంద్ర, హరితేజ తదితరులు

కెమెరా: జార్జ్‌ సి విలియమ్స్‌

సంగీతం: తమన్‌

ఎడిటింగ్‌: మార్తండ్‌ కె.వెంకటేశ్‌

మాటలు: అబ్బూరి రవి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్ధు ముద్ద

సమర్పణ: అల్లు అరవింద్‌

కథ–స్ర్కీన్‌ప్లే–దర్శకత్వం: కిరణ్‌ కొర్రపాటి


తెలుగుతెరకు స్పోర్స్ట్‌ కథలు కొత్తేమీ కాదు. ‘తమ్ముడు’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘జెర్సీ’, ‘గురు’ ఇలా చాలా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘గని’. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదాపడుతూ వచ్చింది.  బాక్సింగ్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని వరుణ్‌ ఈ సినిమా చేశారు. బాక్సింగ్‌  రింగ్‌లో ‘గని’ ఇచ్చిన పంచ్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.  


కథ: 

గని (వరుణ్‌తేజ్‌)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. తన తండ్రి విక్రమ్‌ ఆదిత్య(ఉపేంద్ర) బాక్సింగ్‌ ఛాంపియన్‌. నేషనల్స్‌లో గెలిచి తన తోటి ఆటగాళ్లకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అతని తపన. ఆ ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని నేషనల్స్‌ ఆడతాడు. ఆ క్రమంలో అతను స్టెరాయిడ్స్‌ తీసుకున్నాడనే నిందతో బాక్సింగ్‌ ఆడటానికి వీలు లేకుండా చేస్తారు. ఆ బాధతో గని తల్లి బాక్సింగ్‌ జోలికి వెళ్లకూడదని గని దగ్గర మాట తీసుకుంటుంది. తల్లికి మాటిచ్చినా.. తండ్రి వల్ల చెడ్డ పేరు వచ్చిందనే కోపంతో ఎలాగైనా బాక్సింగ్‌లో ఛాంపియన్‌ అయి తన సత్తా చాటాలనుకుంటాడు. ఆ దిశగా అడుగులు వేస్తాడు. తండ్రి వల్ల పోయిన పరువు నిలబెట్టాలనకుంటాడు. ఆ ప్రయత్నంలో గనికి ఎదురైన సవాళ్లు ఏంటి? తను అనుకున్నది సాధించాడా లేదా? జగపతిబాబు, సునీల్‌ శెట్టి పాత్రలేంటి? అన్నది మిగతా కథ. 


విశ్లేషణ: 

స్పోర్ట్స్‌ కథ అనగానే ఆట ఏదైనా యూత్‌కి మాత్రం బాగా కనెక్ట్‌ అవుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్‌ అనేది ఒక ఎమోషన్‌. ఇలాంటి కథలు గెలుపు ఓటమి.. నడుస్తాయి. అదే ఈ తరహా కథలకు ఎమోషన్‌ కూడా. అన్ని స్పోర్ట్స్‌ డ్రామాల్లానే ఈ సినిమా కూడా మొదలైంది. నేషనల్స్‌లో తన తండ్రి స్టెరాయిడ్స్‌ తీసుకున్నాడనే విషయం తప్ప అతని వెనకున్న ఆశయం తెలియని గని తండ్రి మీద కోపంతో తల్లికి తెలియకుండా బాక్సింగ్‌ ఎందుకు నేర్చుకోవాలనుకున్నాడు అన్నది తెరపై బాగా చూపించారు. అయితే కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌, తన తల్లితో ఉండే బాండింగ్‌ను ఆసక్తికరంగా మలచలేకపోయారు. హీరోయిన్‌తోపాటు తల్లితో ఉండే భావోద్వేగ సన్నివేశాల్లో సహజత్వం మిస్‌ అయింది. నదియాలాంటి ఆర్టిస్ట్‌తో ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పలికించవచ్చు. దర్శకుడు ఆ విషయంపై అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. హీరోయిన్‌ పాత్ర బబ్లీగా ఉంది. కాకపోతే ఆ పాత్రకు అంత ప్రాధాన్యం కనిపించలేదు. హీరోయిన్‌ ఉంది అన్నపేరుకు అక్కడక్కడా తళుక్కుమంది. కోచ్‌గా నరేశ్‌ పాత్ర సిల్లీగా ఉంది. నవీన్‌ చంద్రతో గొడవ, రింగ్‌లో పోటీ సన్నివేశాలు గత చిత్రాల్లో ఎక్కడో ఓ చోట చూసినట్లే అనిపించాయి. ఇలా ఇంటర్వెల్‌ వరకూ సోసోగా సాగిన సినిమా ఆ తర్వాత ఉపేంద్ర ఎంట్రీతో కాస్త గాడిలో పడిండి. అక్కడి నుంచే సినిమాకు కనెక్ట్‌ అయిన భావన కలుగుతుంది. క్రీడారంగంలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో చాలా చిత్రాల్లో చూశాం. అదే మళ్లీ ఇక్కడ కూడా చూపించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఆటగాడిని ఎలా మట్టుపెట్టారు? మరో ఆటగాడు గెలిచినా ఆ ఆనందం లేకుండా ఎలా చేశారు అన్నది ఆసక్తికరంగా ఉన్నా.. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో గతంలో వచ్చిన సినిమాల్లో సన్నివేశాలు గుర్తొస్తాయి. సునీల్‌శెట్టి ఎంట్రీతో విక్రమ్‌ ఆదిత్య ఎంత గొప్ప ప్లేయర్‌ అన్నది తెలిశాక గని వచ్చిన మార్పు, అక్కడి సన్నివేశాలు మెప్పించేలా ఉన్నాయి. ప్లాష్‌బ్యాక్‌ పూర్తయ్యాక మళ్లీ గని ఆట మొదలవుతుంది. ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌లో గని ఎలా ఛాంపియన్‌ అయ్యాడు? తండ్రిని మోసం వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది కథను మలుపు తిప్పింది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఆసక్తికరంగా సాగింది. హీరోయిన్‌కు, హీరోకు చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. హీరోహీరోయిన్‌కి మధ్య ఒక్క రొమాంటిక్‌ సీన్‌ కూడా లేదు. తమన్నాతో చేసిన ‘కొడ్తే’ పాటను తీసుకొచ్చి తమన్నా గ్లామర్‌తో సంతృప్తి పరిచారు. స్పోర్ట్స్‌ డ్రామాకు ఎమోషన్‌ అనేది చాలా ముఖ్యం. అది ఈ చిత్రంలో మిస్‌ అయింది. దర్శకుడికిది తొలి సినిమా. టెన్షన్‌ పడకుండా ఫార్ములా కథ రాసుకుని సేఫ్‌ జోన్‌లో వెళ్లాలనుకునే ప్రయత్నం చేశారు. తెరకెక్కించిన తీరు బావుంది. 

ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. స్పోర్ట్స్‌ పర్సన్‌కి ఉండాల్సిన బాడీతో వరుణ్‌ ఆకట్టుకున్నారు. నిజంగా బాక్సర్‌ అన్నట్లు అతని బాడీ లాంగ్వేజ్‌, క్యారెక్టర్‌ ఉన్నాయి. హీరోయిన్‌ నటన ఓకే. జగపతిబాబు మీటింగ్‌ సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. నదియా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. అబ్బూరి రవి మాటలు అక్కడక్కడా పేలాయి. కెమెరా పనితనం, విజువల్స్‌ బావున్నాయి. ఈ మధ్యకాలంలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో ఆకట్టుకుంటున్న తమన్‌ ఈ సినిమా విషయంలో ఫెయిల్‌ అయ్యాడు. బీజీఎమ్‌ ఎక్కడా ఆకట్టుకోలేదు. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు చేశారు. ‘కొడితే’ పాట మినహా ఇతర పాటలేమీ అంతగా గుర్తుంచుకునేలా లేవు. ఫస్టాఫ్‌ సోసోగా సాగినా... సెకెండాఫ్‌ మాత్రం కొంతవరకూ సినిమాను ముందుకు తీసుకెళ్లింది. అంచనాలు లేకుండా వెళ్తే సినిమాను ఎంజాయ్‌ చేయవచ్చు. 


ట్యాగ్‌లైన్‌: పంచ్ పడలేదు 

Updated Date - 2022-04-08T21:16:50+05:30 IST

Read more